తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. రోడ్డుపైనే సంచారం..
అడవుల నుంచి వన్య మృగాలు కొండపైకి రావడం సర్వసాధారణమైంది. తిరుమల క్షేత్రం దట్టమైన శేషాచలం అడవుల్లో ఉంది. లాక్‌డౌన్ సమయంలో జన సంచారం లేకపోవడంతో అడవి జంతువులు తిరుమల కొండపై ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు లాక్‌డౌన్ అన్‌లాక్ 2 దశలో.. జనాలు తిరుగుతున్నా.. అప్పుడప్పుడూ చిరుతలు ప్రత్యక్షమవుతున్నాయి.
తాజాగా తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం రేగింది. సోమవారం రాత్రి గ్యాస్ గోడౌన్ ప్రాంతంలో ఓ చిరుత రోడ్డు మీదకు వచ్చింది. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో రోడ్డుపై చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను చూసి స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అటు అధికారులు సైతం రాత్రి వేళల్లో అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచిస్తున్నారు.