గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 21 జూన్ 2021 (17:59 IST)

తిరుమలలో విఐపిల తాకిడి మొదలైంది, సామాన్య భక్తులు కూడా?

తిరుమల సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఒకప్పుడు కిటకిటలాడే తిరుమల సెకండ్ వేవ్ కారణంగా బోసిపోవాల్సి వచ్చింది. సుమారు రెండు నెలల పాటు తిరుమలగిరులు బోసిపోయి కనిపించాయి. కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో టోకెన్లను కుదించేసింది టిటిడి. దీంతో భక్తుల సంఖ్య మరింత తగ్గిపోయింది.
 
ఈ నెల 15వ తేదీ వరకు మోస్తరుగా ఉన్న భక్తులు ప్రస్తుతం క్రమేపీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. భక్తుల రద్దీ పెరుగుతోందని.. వారితో పాటు విఐపిల తాకిడి పెరుగుతోందని టిటిడి అధికారులు చెబుతున్నారు. గత మూడురోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీని ఒకసారి చూద్దాం.
 
ఈనెల 19వ తేదీ తిరుమల శ్రీవారిని 13,453 మంది భక్తులు దర్సించుకోగా 5,419 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. పరకామణి ద్వారా హుండీ ఆదాయం కోటి 89 లక్షల రూపాయలు వచ్చింది. 20వ తేదీ స్వామివారిని 18,211 మంది దర్సించుకోగా 7,227 మంది తలనీలాలు సమర్పించారు.
 
ఇక హుండీ ఆదాయం కోటి 9 లక్షల రూపాయలు వచ్చింది. నేడు తిరుమల శ్రీవారిని 18,000 మంది దర్సించుకోగా 7,472మంది తలనీలాలను సమర్పించారు. పరకామణి హుండీ ఆలయం కోటి 63 లక్షల రూపాయలు వచ్చింది. 
 
సామాన్య భక్తులే కాకుండా విఐపిల తాకిడి పెరుగుతోంది. హుండీ ఆదాయం పెరుగుతోందని టిటిడి అధికారులు  చెబుతున్నారు. మరో నెలరోజుల్లో సాధారణ స్థితికి తిరుమల వచ్చేస్తుందన్న అభిప్రాయంతో టిటిడి అధికారులు ఉన్నారు.