ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ
సెప్టెంబర్ నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ అధికారులు భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. టికెట్లను పొందిన వారి జాబితాను కూడా విడుదల చేయనున్నారు.
29వ తేదీ ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల తరువాత తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని స్పష్టం చేశారు. మొత్తం 46,470 టికెట్లను విడుదల చేశారు. ఇందులో లక్కీడిప్ ద్వారా భక్తులను ఎంపిక చేయడానికి 8,070 టికెట్లు కేటాయించారు.
దీనితో పాటు- ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన 38,400 టికెట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
ఏ సేవకు ఎన్ని లక్కీడిప్ టికెట్లను కేటాయించారనే జాబితా వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. టికెట్ల అలాట్‌మెంట్ వివరాలను భక్తులకు ఎస్‌ఎంఎస్, ఇమెయిల్ ద్వారా తెలియజేస్తారు. టికెట్లు పొందిన భక్తులు రెండు రోజుల్లోగా వాటి ధరనను చెల్లించాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల టికెట్లను ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయని తెలిపారు.
వీటిని ముందుగా వచ్చిన ముందు అనే ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తామని అన్నారు. భక్తులు తమ సేవా టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు ఈ మార్గదర్శకాలను గమనించాలని విజ్ఞప్తి చేశారు.