శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (19:47 IST)

రూ.177 కోట్లతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే విస్తరణ

భారీ విమానాల రాకపోకలకు అనువుగా ఉండే విధంగా రూ.177 కోట్లతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేను విస్తరించి, పటిష్టపరిచే పనులను చేపట్టినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ రన్‌వే విస్తరణ పనులు 2021 నాటికి పూర్తి కాగలవని భావిస్తున్నట్లు తెలిపారు. 
 
రన్‌వే విస్తరణ కోసం ఇంకా 30.88 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కి అప్పగించడం, స్వాధీనం చేసిన భూమిలో ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల తొలగింపులో జరుగుతున్న జాప్యం వల్లనే పనులు మందగించినట్లు తెలిపారు. 
 
తిరుపతి విమానాశ్రయంలో 181 కోట్ల రూపాయలతో జూన్‌ 2011లో కొత్తగా ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణాన్ని చేపట్టిన ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ డిసెంబర్‌ 2015 నాటికి నిర్మాణ పనులను పూర్తి చేసిందని మంత్రి పూరి వైకాపా రాజ్యసభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.