శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: శుక్రవారం, 25 అక్టోబరు 2019 (18:17 IST)

అదిరిపోయే సౌకర్యాలతో నారాయణాద్రి, ప్రమాదం జరిగినా ఫుల్ సేఫ్, వివరాలు

అదిరిపోయే వసతులతో తిరుపతి- లింగంపల్లి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ కొత్త రైలు ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. జర్మన్‌ టెక్నాలజీతో రూపొందించిన లింక్‌ ఆఫ్‌ మెన్‌ బుష్‌ బోగీలతో కుదుపు లేని ప్రయాణం సాగిస్తున్నారు ప్రయాణీకులు. తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులకు ఈ రైలు సౌకర్యవంతంగా ఉంది. 
 
తిరుపతి.. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి రైళ్ళ ద్వారా తిరుపతికి వచ్చే యాత్రికుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. యాత్రికులకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్ళను నడుపుతోంది. అయితే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలును కొత్త హంగులతో ప్రస్తుతం నడుపుతున్నారు. దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన మాల్య ఇటీవల సికింద్రాబాద్‌ నుంచి ఈ రైలును ప్రారంభించారు.
 
తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం 1991 జనవరి 7న సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. గతంలో నడిచిన నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న రైలుకు ఎంతో వ్యత్యాసం ఉంది. అంతేకాదు కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు బయోటాయిలెట్‌, మోడల్‌ కుళాయిలు, లింక్‌ ఆఫ్‌మెన్‌ బోగీలతో కుదుపు, శబ్దాలు లేని ప్రయాణం, వేగంగా తిరిగే సీలింగ్‌ ఫ్యాన్లు, పైబెర్తులు ఎక్కేందుకు వీలుగా చైన్‌లింకులు బోగీలో వసతులు ఉన్నాయి. 
 
అంతేకాదు మెత్తని బెర్తులు, బెర్తు బెర్తుకు ఛార్జింగ్‌ పాయింట్లు, విశాలమైన కిటికీలు, వాష్‌బేషన్లు, ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక బోర్డులు, రాత్రివేళ పుస్తకాలు చదువుకునేందుకు వీలుగా చిన్నపాటి దీపాలు ఇలా.. మెరుగైన అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. గతంలో 5 ఏసీ కోచ్‌ల సంఖ్యను ఏడుకు పెంచారు.
 
ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో పాటు ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌తో తగినంత వెలుతురు, ఎయిర్‌ కండీషనర్‌ వ్యవస్థతో విద్యుత్‌ ఆదా అవుతుంది. హెడ్‌ ఆన్‌ జనరేట్‌ వ్యవస్థ ప్రవేశపెట్టడం వల్ల రైలులో శబ్దకాలుష్యం, కర్బన ఉద్గారాల విడుదల తగ్గి రైల్వేకి ఇంధనం ఆదా అవుతోంది. సంవత్సరానికి 6 కోట్ల రూపాయలకు పైగా దక్షిణ మధ్య రైల్వేకు ఈ రైలు ద్వారా ఖర్చు తగ్గే అవకాశం ఉందంటున్నారు రైల్వే అధికారులు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో పాటు వ్యయం తగ్గుతుండటంతో ఈ మోడల్‌ను అన్ని రైళ్లలో ప్రవేశపెట్టాలని దక్షిణమధ్య రైల్వే భావిస్తోంది.
 
మరోవైపు ఒకవేళ రైలు ప్రమాదం జరిగితే ఒక బోగీ మీద మరో బోగీ వెళ్ళి ప్రమాదం తీవ్రతరం అయ్యే అవకాశం నారాయణాద్రిలో ఏ మాత్రం లేదంటున్నారు రైల్వే అధికారులు. వేగంగా ఒక బోగీని మరో బోగీ ఢీకొంటే అలాగే నిలిచేందుకు మధ్యలో అధునాతన టెక్నాలజీతో కొన్ని పరికరాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ప్రమాదం జరిగినా క్షతగాత్రుల సంఖ్యను తగ్గించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. నారాయణాద్రి రైలులో ప్రయాణీస్తున్న భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.