సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (13:14 IST)

భారత్‌లో అణ్వస్త్రాలకు భద్రత లేదు : ఇమ్రాన్ ఖాన్

కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసి లబ్దిపొందాలన్న పాకిస్థాన్ వ్యూహాలు బెడిసికొట్టాయి. పైగా, అంతర్జాతీయంగా ఆ దేశానికి అండగా ఒక్క చైనా మినహా మిగిలిన ఏ ఒక్క దేశం అండగా నిలబడేందుకు ముందుకురావడం లేదు. దీన్ని జీర్ణించుకోలేక పోతున్న ఇమ్రాన్... అర్థంపర్థంలేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
కాశ్మీర్‌లో 370 అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ అంశాన్ని రాజకీయం చేసి అంతర్జాతీయ అంశంగా చూపడానికి పాకిస్థాన్ చేయని ప్రయత్నమంటూ లేదు. కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైంది. పైగా, కాశ్మీర్‌ అంశంపై ఇక తమ వాదనలు చెల్లవని భావించారో ఏమో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే ప్రయత్నం చేశారు. 
 
ఎలాంటి అవగాహన లేకుండానే ఎన్‌ఆర్‌సీ, అణ్వస్త్ర విధానంపై వ్యాఖ్యానించారు. భారత్‌లోని అణ్వస్త్రాల భద్రతను శంకించిన ఆయన.. అంతర్జాతీయ సమాజం కలుగజేసుకోవాలని ప్రాధేయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పాక్‌తో పాటు ప్రాంతీయంగా ముప్పు కలగజేస్తోందని నిరాధార ఆరోపణలు చేశారు. ఎన్ఆర్‌సీతో కొన్ని వర్గాలకు నష్టం కలిగే అవకాశం ఉందంటూ దానిపై ఎలాంటి అవగాహన లేకుండానే వ్యాఖ్యానించే ప్రయత్నం చేశారు. 
 
ఒకవైపు ద్వైపాక్షిక చర్చలకు రావాలని పిలుస్తూనే.. మరోవైపు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇమ్రాన్ ఖాన్ చేయడాన్ని పలువురు అంతర్జాతీయ నిపుణులు తప్పుబడుతున్నారు. భారత్‌తో సత్సంబంధాలకు పెంపొందించడానికి కృషి చేస్తానని అధికారంలోకి వచ్చిన కొత్తలో పలికిన ఇమ్రాన్‌ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం ఇపుడు తీవ్ర విమర్శలపాలవుతున్నారు.