ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (12:19 IST)

టమాటా ధర కిలో రూ.100.. గడిచిన ఐదేళ్లలో అత్యధిక ధర

చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో మొదటి రకం టమాటా ధర కిలో రూ.100 పలికింది. గడచిన ఐదేళ్లలో ఇంత అత్యధిక ధర నమోదవడం ఇదే తొలిసారి. వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులు, వరుసగా కురుస్తున్న వర్షాలతో టమాటా దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. అంతో ఇంతో వస్తున్న పంట వర్షం కారణంగా నాణ్యత లేకపోవడం, డ్యామేజీ అధికంగా వస్తుండటంతో మార్కెట్‌లో టమాటాకు డిమాండ్‌ ఏర్పడింది.
 
దీనికితోడు బయట రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో అక్కడ స్థానికంగా లభ్యమయ్యే పంటకు నష్టం వాటిల్లింది. దీంతో వ్యాపారులు 365 రోజులు టమాటా దొరికే మదనపల్లె మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్‌లో అన్‌సీజన్‌ కావడం, దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం, డిమాండ్‌ ఎక్కువ ఉండటంతో రికార్డు స్థాయి ధర పలికింది. 2016 నవంబర్‌లో మొదటి రకం అత్యధికంగా కిలో రూ.98 పలికింది. తర్వాత కిలో రూ.100 మంగళవారం నమోదైంది.