డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే తొక్కిసలాట : తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు (Video)
అడ్మినిస్ట్రేషన్ లోపం వల్లే తొక్కిసలాట జరిగిందని, గొడవలు జరుగుతాయని సమాచారం ఉందని ముందుగానే హెచ్చరించానని తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమల వైకుంఠ - ఏకాదశి ద్వార దర్శనాలకు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద అడ్మినిస్ట్రేషన్ లోపమే కారణంగానే తొక్కిసలాట జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ తొత్కిసలాటపై ఆయన స్పందిస్తూ, టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాటల్లో భక్తులు చనిపోవడం దురదృష్టకరమని, జరగరానిది జరిగిందని విచారం వ్యక్తం చేశారు. 'వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత అడ్మిస్ట్రేషన్ లోపం కారణంగా జరిగిందని నాకు అనుమానం ఉంది. ఘటనకు బాధ్యత అధికారులదే కదా. మంగళవారం కూడా నేను అధికారులతో సమావేశమై ఆషామాషిగా తీసుకోవద్దని చెప్పాను.
గొడవలు జరుగుతాయని నాకు సమాచార ముందని హెచ్చరించాను. ఐదు వేలమంది పోలీసులను పెట్టామని, చూసుకుంటామని అధికారులు చెప్పారు. టోకెన్లు జారీ చేసే ఒక సెంటరులో ఓ మహిళ అస్వస్థతకు గురైన క్రమంలో ఆమెను బయటకు తీసుకువచ్చేందుకు అక్కడున్న డీఎస్పీ గేట్లు తెరవడంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తోపులాట జరిగింది. అందులో ఆరుగురు చనిపోయినట్టు తెలిసింది' అని బీఆర్ నాయుడు అన్నారు.
డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని, తొక్కిసలాటలో భక్తుల మృతి దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారనీ, గాయపడ్డ వారిని చంద్రబాబు పరామర్శించి, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందచేస్తారని వెల్లడించారు.