శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 అక్టోబరు 2020 (09:57 IST)

తితిదే బోర్డు యూ టర్న్ : నిధుల మళ్లింపునకు తాత్కాలిక బ్రేక్

తిరుమల శ్రీవారి సొమ్మును ప్రభుత్వ సెక్యూరిటీలలో డిపాజిట్ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (తితిదే) తీసుకున్న నిర్ణయంపై యూటర్న్ తీసుకుంది. ఈ వ్యవహారం పెద్దది అయ్యే అవకాశం ఉండటంతో తితిదే వెనక్కి తగ్గింది. 
 
నిజానికి ఈ నిర్ణయంపై ఓ తెలుగు దినపత్రికా గోవిందా.. గో.. విందా అంటూ శ్రీవారి నిధుల మళ్లిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో అప్రమత్తమన తితిదే అధికారులు వెనక్కి తగ్గారు. బాండ్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ నిధుల మళ్లింపునకు తాత్కాలిక బ్రేక్ పడింది.
 
ఇకపై.. బ్యాంకులలోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలని టీటీడీ తాజాగా నిర్ణయించింది. టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి... అబ్బాయ్‌ వైఎస్‌ జగన్‌ సర్కారు సేవలో తరించేందుకు రంగం సిద్ధం చేశారంటూ ప్రాంతీయ మీడియా వరుస కథనాలను ప్రసారం చేసింది. 
 
టీటీడీ ఆధ్వర్యంలో నడిచే సేవా ట్రస్టులకు చెల్లించే విరాళాలను 'వడ్డీ కోసం' రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని టీటీడీ పెద్దలు నిర్ణయించిన విషయం బట్టబయలైంది. దినదిన గండం అన్నట్లుగా ఎప్పటికప్పుడు అప్పులు చేస్తూ బండిలాగుతున్న సర్కారు వారికి తమదైన ‘సాయం’ చేయాలని తీర్మానించిన విషయాన్ని వివరించింది. 
 
ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలోనే దీనిపై తీర్మానం చేసిన విషయాన్ని బయటపెట్టింది. డిసెంబరులో ఈ ప్రణాళికను అమలు చేయడమే తర్వాయి అని, ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. అత్యంత రహస్యంగా ఉంచిన ఈ నిర్ణయాన్ని మీడియా బయటపెట్టడంతో ఈ నిర్ణయంపై టీటీడీ వెనక్కి తగ్గింది.