గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 12 జనవరి 2022 (15:46 IST)

చంద్రబాబు కంటే సీఎం జగన్ ఎక్కువ రోడ్లు వేయించారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రహదారులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని విజ‌య‌వాడ‌సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పైపుల రోడ్ నుంచి కండ్రిక మెయిన్ రోడ్డు వరకు నూజివీడు ప్రధాన రహదారి నిర్మాణ పనులను డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు, అధికారులతో కలిసి బుధవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.


నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయనడానికి విజయవాడ-నూజివీడు రహదారే చక్కని ఉదాహరణ అని ఈ సందర్భంగా వెల్లడించారు. రూ. 2.5 కోట్ల నిధులతో చేపట్టిన ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. నెలాఖరులోగా నగరవాసులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. డివైడర్ ను సైతం మొక్కలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని వివరించారు. 
 
రహదారులపై విమర్శలు గుప్పించే ముందు నూజివీడు రహదారి పనులను చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు ఒకసారి పరిశీలించాలని మల్లాది విష్ణు సూచించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రోడ్ల నిర్వహణను కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రోడ్ల పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.


ఐదేళ్ల చంద్రబాబు పాలనలో వేసిన రోడ్ల కంటే సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి  రెండున్నర ఏళ్లలో అధిక రోడ్లు వేశారన్నారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో కొత్తగా 1,356 కి.మీ మాత్రమే తారు రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లలోనే కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా 1,883 కి.మీ తారు (బీటీ) రోడ్ల నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు. దీంతోపాటు రెండేళ్లలో 4,015 కి.మీ మేర రహదారుల విస్తరణ, అభివృద్ధి, మరమ్మతులు జరిగాయన్నారు. నాడు-నేడు తరహాలో రోడ్లు మరమ్మతులు చేసిన తర్వాత ఆ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 
 
 
మరోవైపు నగరంలో రోడ్ల మరమ్మతులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు మల్లాది విష్ణు చెప్పారు. ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో నియోజకవర్గంలో రహదారుల నిర్మాణాలు, మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. రాత్రివేళల్లో ప్రమాదాలను నివారించేందుకు ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద 5 హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు కూడా ఇటీవల శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, యరగొర్ల తిరుపతమ్మ, కొంగితల లక్ష్మీపతి, జానారెడ్డి, నాయకులు యరగొర్ల శ్రీరాములు, మోదుగుల గణేష్, అలంపూర్ విజయ్, ఉమ్మడి వెంకట్రావు, పెనుమత్స సత్యం, అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.