శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (13:04 IST)

భార్య చనిపోయిందని కర్మకాండలు చేసిన భర్త... మరుసటి రోజు ఇంటికి వచ్చిన భార్య..

విజయవాడలోని ఓ కోవిడ్ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులతో పాటు.. సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పేందుకు ఈ ఘటన మచ్చుతునక. కరోనా వైరస్ బారిన వార్డులో చికిత్స పొందుతున్న ఓ మహిళ ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. దీనిపై వైద్యులను నిలదీస్తే మార్చురీలో వెతుక్కోండి అంటూ సమాధానమిచ్చారు. 
 
ఆ తర్వాత మార్చురీలో ఓ మృతదేహాన్ని చూపించి.. ‘ఈమె మా మనిషే’ అని అంటే.. ‘అయితే.. తీసుకుపోండి’ అని పంపేశారు. తీరా.. అంత్యక్రియలు పూర్తిచేసి.. కర్మకాండలూ పూర్తయిన మరునాడు ‘ఆమె’ తిరిగొచ్చి కుటుంబాన్ని దిగ్భ్రమకు గురిచేసింది. అయితే, అప్పటికే ఆ ఇంట జరగరాని నష్టం జరిగిపోయింది. తల్లి చనిపోయిందనే వ్యథతో ఆమె కుమారుడు అప్పటికే ఆస్పత్రిలో కన్నుమూయడం అన్నింటికన్నా పెద్ద విషాదం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన ముత్యాల గడ్డయ్య, గిరిజమ్మ వృద్ధ దంపతులకు ప్రసాదబాబు అనే కుమారుడు ఉన్నాడు. గిరిజమ్మ (72) గత నెల 12వ తేదీన కరోనా బారినపడింది. అదేరోజు ఆమెను కుటుంబసభ్యులు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. రెండురోజుల తర్వాత భర్త గడ్డయ్య (75).. భార్యను చూడటానికి ఆస్పత్రికి వెళ్లాడు. వార్డులో గిరిజమ్మ కనిపించకపోవడంతో అక్కడి సిబ్బందిని అడిగాడు. 
 
'ఏదో ఒక వార్డులో ఉంటుంది.... వెళ్లి వెతుక్కోండి' అని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అంత వృద్ధాప్యంలోనూ పడుతూ లేస్తూ గడ్డయ్య ఆస్పత్రి అంతా వెతికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో చివరిగా మార్చురీ గదిలోకి వెళ్లాడు. ఓ వృద్ధురాలి మృతదేహాన్ని చూసి.. తన భార్య పోలికలు కనిపించడంతో పెద్దపెట్టున రోదించడం మొదలుపెట్టాడు. ఆ మృతదేహమే గిరిజమ్మదని గడ్డయ్య చెప్పడంతో.. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడే మృతదేహాన్ని ఆయనకు సిబ్బంది అప్పగించేశారు. 
 
ఆ మృతదేహాన్ని గ్రామానికి తెచ్చి అదేరోజు, అంటే మే 15న కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. గిరిజమ్మ కుమారుడు ప్రసాదబాబు అప్పటికే కరోనా బారినపడ్డాడు. ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. తల్లి గిరిజమ్మ మరణవార్త తెలుసుకొని ప్రసాదబాబు కుంగిపోయాడు. 
 
ఆ తరdవాత ఎనిమిది రోజులకు మనోవ్యాధి తీవ్రమై అతడు చనిపోయాడు. కుమారుడి మృతదేహాన్ని గడ్డయ్య ఖననం చేశాడు. భార్య, కుమారుడికి మంగళవారం కర్మకాండలు పూర్తిచేశాడు. 10 రోజుల వ్యవధిలోనే కుటుంబంలో ఇద్దరిని గడ్డయ్య కోల్పోయాడని గ్రామస్థులు ఆవేదన చెందారు. 
 
ఇంతలో అనూహ్యంగా బుధవారం మధ్యాహ్నం గిరిజమ్మ ఆటోలో ఇంటికి వచ్చింది. ఆటో దిగిన ఆమెను చూసి గడ్డయ్య, ఊరి జనం దిగ్భ్రమకు గురయ్యారు. ఇంటి బయట తనది, కుమారుడిది ఫ్లెక్సీలు ఉండటం చూసి గిరిజమ్మకు ఏం జరిగిందో కొంత అర్థం అయింది. కుమారుడిని కడసారి చూడలేకపోయానని బోరుమంది. 
 
బుధవారం ఉదయం ఓ నర్సు వచ్చి.. ‘నీకు కరోనా తగ్గిపోయింది.. ఇంటికి వెళ్లిపో..’ అని చెప్పడమే కాకుండా ఏకంగా ఆటో మాట్లాడి ఇంటికి పంపారు అని తన భర్త గడ్డయ్యకు, ఊరి జనానికి గిరిజమ్మ చెప్పడంతో వారంతా ముక్కున వేలేసుకున్నారు.