వ్యర్థ నీటి నిర్వహణలో విజయవాడకు వాటర్ హోదా
విజయవాడ నగరానికి వాటర్ ప్లస్ గుర్తింపు లభించింది. నగర సిగలో మరో కలికితురాయి చేరింది. గత కొన్నేళ్లుగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన పనితీరును నగరపాలక సంస్థ కనబరుస్తోంది. ఈ ఏడాది తొలిసారిగా వాటర్ ప్లస్ విభాగాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది.
తొలి ప్రయత్నంలోనే ఈ విభాగంలో సర్టిఫికెట్‌ను నగరం సాధించింది. ఈ దఫా కూడా స్వచ్ఛతలో మంచి ర్యాంకు సాధించేందుకు ఇది దోహదపడుతుందని నగరపాలక అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నగరం ఓడీఎఫ్ ++ హోదాను దక్కించుకుంది. వ్యర్థ నీటిని ఎక్కువ సద్వినియోగం చేసుకునే వాటికి దీనిని ఇస్తారు. ఈ విభాగంలో మన పనితీరును పరిశీలించేందుకు గత నెలలో స్వచ్ఛసర్వేక్షణ్ బృందం నగరంలో పర్యటించింది.
క్షేత్రస్థాయిలో వివిధ ప్రాంతాల్లో తిరిగి పనితీరును మదింపు చేశారు. ఇందులో ప్రధానంగా బహిరంగ మాల విసర్జన, మురుగునీటి శుద్ధి, పబ్లిక్ టాయిలెట్లు, ప్రజల నుంచి స్పందన, వ్యక్తిగత మరుగుదొడ్లు, భూగర్భ డ్రైనేజీ అంశాలలో పరిశీలించి ఎంపిక చేశారు. నగరంలోని ఇళ్ల నుంచి వచ్చే వృథా నీటిని శుద్ధి చేసేందుకు ఆరు ఎస్టీపీలు నిర్మించారు. వీటి ద్వారా 150 ఎంఎల్‌డీ నీటిని శుద్ధి చేస్తున్నారు. ఈ నీటిని డివైడర్లలోని మొక్కలకు అందిస్తున్నారు. ఫుట్‌పాత్‌లు, పైవంతెనలు, సిటీ బస్టాప్‌లు శుభ్రం చేసేందుకు వాడుతున్నారు. శుద్ధి చేసిన నీటిని తిరిగి ఉపయోగించుకుంటున్నారు.
నగరంలో ఆరుబయట మల విసర్జన లేకుండా చేసేందుకు 65 ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు. భవానీపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీ పార్కు మినీ ఎస్టీపీని ఏర్పాటు చేశారు. ఇందులో వృథా నీటిని శుద్ధి చేసి మొక్కలకు ఉపయోగిస్తున్నారు. ఇలా వివిధ అవసరాలకు నగరపాలక సంస్థ వినియోగించుకుంటోంది. వాటర్ ప్లస్ విభాగంలో నగరానికి ఐదు నక్షత్రాల రేటింగ్ లభించింది.
వ్యర్థ నీటి నిర్వహణలో మెరుగైన పద్ధతులను ఆచరిస్తున్నందుకు ఈ హోదా వీఎంసీకి దక్కిందని నగరపాలక కమిషనర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. మౌఖికంగా వర్తమానం వచ్చిందని, నేడో, రేపో అధికారికంగా సమాచారం అందుతుందన్నారు.