విజయనగరం వార్డు వాలంటీర్ ఘరానా మోసం.. రూ.3 కోట్లు స్వాహా
విజయనగరం జిల్లాలో వార్డు వాలంటీర్ ఘరానా మోసానికి పాల్పడింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.3 కోట్లు కొల్లగొట్టింది. మురికివాడ ప్రజలు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని పొదుపు పేరుతో వ్యాపారం ప్రారంభించింది. సుమారు రూ.3కోట్లు వసూలు చేసి పారిపోయింది.
వివరాల్లో వెళితే.. పట్టణంలోని చిట్లు వీధికి చెందిన మానాపురం రమ్య వార్డు వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె తల్లి అరుణతో కలిసి గత 15 ఏళ్లుగా పొదుపు వ్యాపారం సాగిస్తోంది. ఇలా రెండువేల మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు.
గత ఏడాది డిసెంబర్ నెలచో ఏడాది గడువు పూర్తయిన సుమారు 150 మందికి ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదు. అడిగితే బ్యాంకులో డబ్బులు పెద్ద మొత్తంలో ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. చివరికి మూడు కోట్ల మేర మోసం చేశారు. బాధితులు మోసపోయామని గ్రహించి శుక్రవారం పోలీసులు ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.