హక్కులు, చట్టాలపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాం: మంత్రి కొడాలి నాని

kodali nani
ఎం| Last Updated: ఆదివారం, 7 మార్చి 2021 (11:39 IST)
హక్కులు, చట్టాలపై వినియోగదారులకు మరింత అవగాహన కల్పిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. వస్తు సేవలను పొందే వినియోగదారుల ప్రయోజనార్ధం, వారి హక్కుల పరిరక్షణ కోసం 1986 లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు.

నూతన వ్యాపారాభివృద్ధి సంస్కరణల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్, ఈ - కామర్స్, టెలీ షాపింగ్ విధానంలో ప్రజలు అనేక వస్తువులను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇదే సమయంలో సైబర్ నేరాలు, తప్పుడు ప్రకటనలు, సందేశాలతో ప్రజలను మోసగించడం జరుగుతోందన్నారు.

దీంతో వినియోగదారుల హక్కుల రక్షణ కోసం కొత్త చట్టాల అవసరం ఏర్పడిందన్నారు. 1986 నాటి చట్టం స్థానంలో 2019 లో మరో చట్టాన్ని రూపొందించారని, అది 2020 సంవత్సరంలో అమల్లోకి వచ్చిందన్నారు. నూతన చట్టం ప్రకారం మోసపోయిన ప్రజలకు సత్వర న్యాయం అందుతుందన్నారు.

వాస్తవ విరుద్ధమైన, ఆకర్షణీయ ప్రకటనలతో వినియోగదారులకు హాని, నష్టం కల్గించే, మోసగించే సంస్థలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు . దేశంలో గతంలో ఉన్న జిల్లా ఫోరాలన్నింటినీ జిల్లా, కమిషన్లుగా పేరులు మార్చారని, ఇక్కడ నష్టపరిహార పరిధిని రూ .10 లక్షల రూ.కోటికి పెంచారన్నారు.

ఫిర్యాదులు చేసే పరిధిని కూడా విస్తృతం చేశారన్నారు. రాష్ట్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్లో రూ.కోటి నుండి రూ.10 కోట్ల వరకు నష్టపరిహారాన్ని పొందవచ్చన్నారు. జాతీయ కమిషన్లో రూ .10 కోట్లు పైబడి నష్టపరిహారాన్ని పొందేందుకు ఫిర్యాదులు చేసే పరిధిని కూడా పెంచడం జరిగిందన్నారు.

ఫిర్యాదులు వస్తే ప్రచార, ప్రచురణ ప్రకటనల్లో భాగస్వాములయ్యే సెలబ్రెటీలు, సంస్థలపై కూడా విచారణ జరుపుతారన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్లో అధ్యక్షులు, సభ్యుల నియామకంపై ఆర్ సంస్థ ఇచ్చిన వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి కొడాలి నాని చెప్పారు.
దీనిపై మరింత చదవండి :