శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (09:03 IST)

సమాచారం రాగానే పదవులను వదులుకుంటాం: మంత్రి మోపిదేవి

వ్యవసాయ రంగంతో పాటుగా ఆక్వా రంగానికి సమాన ప్రాధాన్యతనిస్తామని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ ప్రచార విభాగంలో బుధవారం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తూ రైతును ఏ విధంగా ఆదుకుంటున్నారో అదే విధంగా ఆక్వా రంగానికి సమాన ప్రాధాన్యతనిస్తున్నారు. సువిశాల తీర ప్రాంతంగా రాష్ట్రానికి గుర్తింపు ఉందని గుర్తుచేశారు.

ఇంత విస్తారమైన తీర ప్రాంతం, సముద్ర సంపదకు ఆక్వా రంగానికి అనువైన ప్రాంతంగా రాష్ట్రానికి గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో భాగంగా మెరైన్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌ పోర్ట్‌ లో జాతీయస్థాయిలో విదేశీమారకద్రవ్యంలో 40 శాతం రాష్ట్రం నుంచి రావడం గుర్తించదగిన విషయమన్నారు.

ఇలాంటి పరిస్ధితిలో మెరైన్‌ సెక్టార్‌ను ప్రోత్సహించాలని అందుకవసరమైన, అనువైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని సీఎం సంకల్పించారన్నారు.  ఫిషింగ్‌ జెట్టీలు ఏర్పాటుచేయాలనే ఆలోచనతో సీఎం ఈ రంగంపై ప్రత్యేకదృష్టి సారించారని తెలిపారు.

ఆక్వారంగం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో విద్యుత్ యూనిట్‌ కాస్ట్‌ రూ.1.50 ఆక్వారైతులకు అందించడం వల్ల సుమారుగా రూ 550 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని వెల్లడించారు. అదే విధంగా మేజర్‌ ఫిషింగ్‌ హర్బర్‌లు, మైనర్‌ హర్బర్‌లు ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై సర్వే చేసి సుమారుగా 22 ప్రాంతాల్లో మేజర్, మైనర్‌ జెట్టీలు ఏర్పాటుచేయాలని నిర్ణయించామని తెలిపారు.

ఫేజ్‌ 1 కింద వాడరేవు, ఉప్పాడ, మచిలీపట్నం, జువ్వలదిన్నె, ఫేజ్‌ 2 కింద బుదగట్లపాలెం, ఎద్దువానిపాలెం, పూడిమడక, కొత్తపట్నం హర్బర్‌లు నిర్మించనున్నారు. ఒక్కో జెట్టీ నిర్మాణానికి రూ.350 కోట్ల ఖర్చులో యాభైశాతం కేంద్రం, మిగిలిన యాభై శాతం రాష్ట్రం భరించేవిధంగా ఈ ఏడాదిలోనే వీటి నిర్మాణం ప్రారంభించాలనే లక్ష్యంగా సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు.

విశాఖ ఫిషింగ్‌ హర్బర్‌కు రూ.100 కోట్లతో ఆధునీకరణ చేయడానికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు.  వ్యవసాయరంగానికి ఎంత పెద్ద పీట వేస్తున్నామో అదే విధంగా అంతే ప్రాధాన్యతని ఫిషింగ్‌ యాక్టివిటీ పెంచే ప్రయత్నంలో తమ ప్రభుత్వం ఉందన్నారు.

కేజ్‌ కల్చర్‌ ద్వారా తిలాపీ లాంటి కొత్త వంగడాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. రానున్న రోజుల్లో ఫిషరీస్‌ రంగానికి మంచి రోజులు రాబోతున్నాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 8 మంది మత్య్‌కారులు  బంగ్లాదేశ్‌ నుంచి నేడు విడుదల అయ్యారని తెలిపారు. సీఎం తీసుకున్న చొరవ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి వెల్లడించారు.
 
శాసనమండలి గురించి ప్రతిపక్షనేత తన సభ్యుల్లో ఆత్మవిశ్వాసం నింపుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రప్రభుత్వం కేంద్రంకు పంపిన నివేదికపై సానుకూల స్పందన వస్తుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుండి క్లియరెన్స్‌ ఎప్పుడు వస్తే అప్పుడు రాజీనామా చేస్తామన్నారు.

తమ ప్రభుత్వ నిర్ణయం మేరకు రాజీనామ తప్ప మరో ఆలోచన లేదన్నారు. మాకు ఉన్న పద్దతుల ప్రకారం మేం ముందుకెళతామని తెలిపారు. కేంద్రం కౌన్సిల్‌ను రద్దుచేశాం అని సమాచారం రాగానే రాజీనామా చేస్తాం తప్ప ప్రతిపక్ష పార్టీ నేతల్లా  పదవులు పట్టుకుని వేలాడే తత్వం తమది కాదన్నారు.

మా ముఖ్యమంత్రి నిర్ణయాలు అమలుకు క్రమశిక్షణ గల సైనికుల్లా ముందుంటామన్నారు. ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకెళుతుంటే పెద్దల సభ సహకరించాలి కానీ భిన్నంగా ఉండకూడదని సూచించారు. కౌన్సిల్‌ గొడ్డలిపెట్టుగా పరిగణించినందున ఈమేరకు నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనిపై ప్రత్యేక చర్చలు అనవసరమని మంత్రి వెల్లడించారు.