గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2020 (09:21 IST)

బాకీ తీర్చలేదనీ స్నేహితుడుకి శిరోమండనం.. ఎక్కడ?

ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాలు ఘోరాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష నేతలపై దాడులు పెరిగిపోయానే విమర్శలు ఉన్నాయి. అలాగే, రాష్ట్రంలో దళితులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. తాజాగా బాకీ తీర్చలేదన్న కారణంతో ఓ యువకుడుకి శిరోమండనం చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడంలో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తాడేపల్లిగూడేనికి చెందిన అలకా అభిలాష్, జంగారెడ్డిగూడేనికి చెందిన ఎర్రసాని విజయ్‌బాబు స్నేహితులు. అభిలాష్ ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తుండగా, విజయ్‌బాబు మునిసిపల్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అయితే, కొన్ని రోజుల క్రితం అభిలాష్ తన స్నేహితుడైన విజయ్‌బాబు వద్ద అవసరాల నిమిత్తం రూ.30 వేలు అప్పుగా తీసుకున్నాడు. 
 
ఈ డబ్బులు చెల్లించడంలో జాప్యం జరిగింది. దీంతో తీసుకున్న డబ్బులు ఇవ్వాలంటూ ఇటీవల అభిలాష్‌కు ఫోన్ చేసిన విజయ్‌బాబు పరుష పదజాలంతో దూషించాడు. అనంతరం బాకీ వసూలు కోసం తన మిత్రులు కంకిరెడ్డి మార్కండేయులు, షేక్ నాగూర్ మీరావలితో కలిసి శనివారం రాత్రి తాడేపల్లిగూడెం వెళ్లి బాకీ తీర్చాలంటూ అభిలాష్‌ను పట్టుబట్టారు. 
 
ఇప్పటికిప్పుడంటే తన వద్ద డబ్బులు లేవని సమయం ఇవ్వాలని కోరాడు. దీంతో అతడిని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని జంగారెడ్డిగూడెం తీసుకెళ్లారు. అక్కడ బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీలోని ఓ ఇంట్లో బంధించారు. ఆదివారం ఉదయం మణికంఠ అనే యువకుడిని పిలిపించి అభిలాష్‌కు శిరోముండనం చేయించి జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. అభిలాష్ అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు నలుగురిని అరెస్టు చేశారు.