ఆంధ్రప్రదేశ్‌లో అసలేం జరుగుతోందో?!: మాజీ మంత్రి చింతా మోహన్
ఆంధ్రప్రదేశ్‌లో అసలేం జరుగుతోందో తెలియని స్థితి ఉందని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి చింతా మోహన్ సందేహం వ్యక్తం చేశారు. సభ్యత లేకుండా నేతలు బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల సమస్యలపై ఎవరూ మాట్లాడటం లేదని తెలిపారు. కాపు సామాజిక వర్గ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు.
దేశ పరిస్థితి అధ్వానంగా ఉందని, ప్రధానమంత్రి మోడీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత ఉందన్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. దేశంలో ఎన్ని వేల కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందో ప్రజలకు కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో విలువైన వ్యాక్సిన్‌లు వేసినా ఏనాడూ డప్పు కొట్టుకోలేదని తెలిపారు. 100 కోట్ల వ్యాక్సిన్ వేసి ప్రధానమంత్రి గొప్పలు చెప్పుకోవడం సబబు గా లేదన్నారు.
ప్రధానమంత్రి స్నేహితుని పోర్టులో హెరాయిన్ పెద్ద ఎత్తున దొరికినా చర్యలు లేవని మండిపడ్డారు. ఇండియా ఫర్ సేల్‌గా మోడీ పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. యువతకు ఉద్యోగాలు లేవని, మాదకద్రవ్యాలు మాత్రం దొరుకుతున్నాయని చింతా మోహన్ అన్నారు.