శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2023 (15:19 IST)

చంద్రబాబు మళ్లీ సీఎం అయితే గుండు కొట్టించుకుంటా : వైకాపా ఎమ్మెల్యే

prakash reddy
ఏపీ శాసనసభకు వచ్చే యేడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తాను గుండు కొట్టించుకుంటానని వైకాపాకు చెందిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. రాయలసీమ గురించి మాట్లాడే నైతిక అర్హత, హక్కు, చంద్రబాబుకు ఏమాత్రం లేవన్నారు. 
 
ప్రస్తుతం చంద్రబాబు రాయలసీమలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో యాత్ర కొనసాగిస్తున్నారు. ఇందులోభాగంగా ఆయన పులివెందుల, దర్శి, రాప్తాడు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వైకాపా పాలకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వీటిని వైకాపా నేతలు తిప్పి కొడుతున్నారు. ఇందులోభాగంగా, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, తాను గుండు కొట్టించుకుంటానని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు రూ.40 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆయనో గజదొంగ అని ఆరోపించారు. 
 
అమరావతిని రియల్ ఎస్టేట్ దందాగా చంద్రబాబు మార్చివేశారని ఆరోపించారు. జగనన్న ఇళ్ళ నిర్మాణంతో పేద కల నెరవేరుతుందని అన్నారు. చంద్రబాబులా పేదలను దోచుకునే అలవాటు తమకు లేదన్నారు. చంద్రబాబు తన బినామీలతో అమరావతిలో భూములు ముందుగానే కొనుగోలు చేయించారని ఆరోపించారు. తనకు రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని నిరూపిస్తే వాటిని రూ.20 కోట్లకే రాసిస్తానని అన్నారు. చంద్రబాబు ఇక ఈ జన్మకు ముఖ్యమంత్రి కాలేరని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి జోస్యం చెప్పారు.