జగన్ లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చేనా?
వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జగన్ లండన్ వెళ్లేండుగు నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇస్తుందా? లేదా? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా, గతంలో జగన్ లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. ఆ సందర్భంగా లండన్ పర్యటన సందర్భంగా న్యాయస్థానం విధించిన షరతులను ఉల్లంఘించారని సీబీఐ తీవ్ర ఆరోపణలు చేసింది. పర్యటన కోసం ఆయన తప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చి కోర్టును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని, భవిష్యత్తులో ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వరాదని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టును గట్టిగా కోరింది.
అయితే, ఈ ఆరోపణలను జగన్ తరపు న్యాయవాదులు ఖండించారు. అసలు జగన్‌కు ఫోన్ వాడే అలవాటే లేదని స్పష్టం చేశారు. బుధవారం ఈ పిటిషనుపై న్యాయమూర్తి టి.రఘురాం ఎదుట విచారణ జరిగింది. సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, జగన్ సమర్పించిన ఫోన్ నంబరుకు తాము మూడుసార్లు ఫోన్ చేయగా అది పనిచేయలేదని తెలిపారు. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, ఆయన పర్యటన అనుమతిని తక్షణమే రద్దు చేయాలని కోరారు.
దీనిపై స్పందించిన జగన్ తరపు న్యాయవాదులు, ఆయన గతంలో విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా తన వ్యక్తిగత సిబ్బంది ఫోన్ నంబర్లనే కోర్టుకు ఇచ్చారని గుర్తుచేశారు. జగన్‌కు ఫోన్ ఉపయోగించే అలవాటు లేదని తెలిపారు. అంతేకాకుండా, పర్యటనకు ఇంకా మూడు రోజుల గడువు ఉన్నప్పటికీ ఆయన ముందుగానే స్వదేశానికి తిరిగి వచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కాగా, లండన్‌లో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అక్టోబరు 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు జగన్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పర్యటన వివరాలు, అక్కడి చిరునామా, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటివి సమర్పించాలని ఆదేశించింది.
పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాక కోర్టుకు హాజరు కావాలని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అక్టోబరు 11వ తేదీన జగన్ లండన్ వెళ్లారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో, ఈ పిటిషనుపై తీర్పును ఈ నెల 28వ తేదీన వెల్లడిస్తామని న్యాయస్థానం ప్రకటించింది.