సోమవారం, 16 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 8 జూన్ 2024 (18:41 IST)

వైసిపి ఘోర పరాజయం: పదవీ బాధ్యతల నుంచి సజ్జల ఔట్?

sajjala ramakrishna reddy
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయాన్ని చవిచూసింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాకపోడాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమికి కారణాలను నాయకులు తలోరకంగా స్పందిస్తున్నారు. కొందరు వాలంటీర్ల వల్ల నాయకులకి- ప్రజలకి మధ్య సంబంధం తెగిపోయిందనీ, అందువల్ల పరాజయం పాలయ్యామని విశ్లేషిస్తున్నారు.
 
మరికొందరైతే... ముఖ్యమంత్రి చుట్టూ ఓ కోటరీ ఏర్పడిందనీ, ఆ వలయాన్ని ఛేదించుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం వెళ్లలేకపోయారనీ, నియోజకవర్గ సమస్యలను చెప్పుకునే అవకాశం కూడా లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ చుట్టూ కోటరీ అంటే... వారిలో సజ్జల రామకృష్ణా రెడ్డి ముందు వరసలో వుంటారు. కనుక ఈయన వల్ల పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
 
ఇంకోవైపు... నియోజకవర్గాలకు సంబంధించి ఏ పనులు కావాలన్నా గంటల తరబడి సీఎంఓ దగ్గర వేచి చూడాల్సిన పరిస్థితి వుండేదనీ, ఉదయం వెళితే రాత్రి వరకూ పని అయ్యేది కాదని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితులతో పాటు నియోజకవర్గ సమస్యలను చెప్పుకునే సమయం కూడా జగన్ వద్ద లేకుండా పోయిందంటూ చెపుతున్నారు. ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అనే భావన వైసిపి నాయకుల్లో నాటుకుని వుంది. అందువల్ల ఆయనను పదవీ బాధ్యతల నుంచి తప్పించాలని వైసిపి అధినాయకులు భావిస్తున్నట్లు సమాచారం.