శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2019 (08:36 IST)

సత్ఫలితాలను ఇస్తోన్న వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం

అంధత్వ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘వైఎస్ఆర్  కంటి వెలుగు’ పథకం సత్ఫలితాలను ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని మొదటిబ్లాక్ లో ఉన్న సమావేశ మందిరంలో ఆయన “వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం”పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

శరీరంలోని అన్ని అవయవాలకన్నా కళ్లు అతి ముఖ్యమైనవని...వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన కంటివెలుగు పథకం ఆశయం నెరవేరాలని అధికారులకు సూచించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ముందు చూపుతో వైఎస్సార్‌ కంటివెలుగు పథకం అమలు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.

సాధారణ జనాభాలో 40 శాతం మందిలో కంటి సమస్యలు సాధారణమని ఆయన పేర్కొన్నారు. 80 శాతం అంధత్వం నివారించదగినదని తెలిపారు. అంధత్వాన్ని 1 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గించగలిగామన్నారు. ఈ పథకం ద్వారా 5.30 కోట్ల మందికి కంటి పరీక్షలతోపాటు అవసరమైన వారికి ఉచితంగా కంటికి శస్త్రచికిత్సలు చేసి  కళ్లజోళ్లు అందించామన్నారు. 

చిన్నపిల్లలు సాధారణంగా కాటరాక్ట్, తట్టు, రూబెల్లా, విటమిన్ వంటి ఏదో ఒక లోపంతో బాధపడుతుంటారని తెలిపారు. ప్రభుత్వం నేత్ర సంరక్షణకు పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. అందులో భాగంగానే వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా విద్యార్థుల్లో నేత్ర సమస్యలను తొలగిస్తోందన్నారు. వారు చదువుకునే పాఠశాలకే వైద్యులను పంపించి పరీక్షలు చేయిస్తోందని తెలిపారు. చిన్నవయస్సులోనే కంటి సమస్యలను దూరం చేసేందుకు కృషిచేస్తోందని గుర్తుచేశారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా దృష్టిలోపాలను సరిదిద్దుతోందని పేర్కొన్నారు. 

వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆరు దశల్లో నిర్వహించాలని భావించారని అందులో భాగంగా ప్రభుత్వం రూ.560 కోట్లు ఖర్చు చేస్తోందని సీఎస్ అన్నారు. రాష్ట్రంలోని 5.30 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుందన్నారు. 

తొలి విడతలో భాగంగా అక్టోబర్ నెల 10 నుంచి 16 వరకు మొత్తం 60,693 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని సుమారు 70 లక్షలమంది విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించామని అధికారులు సీఎస్ తో అన్నారు. ఇప్పటికే 62,81,251 మంది చిన్నారుల డేటా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశామని  ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అందులో 32,61,663 అబ్బాయిలు కాగా, 30,20,056 మంది అమ్మాయిలున్నారని తెలిపారు. ఇందులో 2,13,677 మంది అబ్బాయిలు, 2,07,499 మంది అమ్మాయిలు   మొత్తం 4,21,144 మంది చిన్నారులు దృష్టి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని వివరించారు. 58,60,107 మంది చిన్నారులకు ఎలాంటి దృష్టి సంబంధిత లోపాలు లేవని గుర్తించామన్నారు.

దృష్టి సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన మేర కళ్లజోళ్ల పంపిణీ జరిగిందన్నారు.  ఇక రెండవ దశలో కంటి సమస్యలున్న  4.5 లక్షల మంది చిన్నారులను గుర్తించి నవంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు 45 రోజుల్లో విజన్‌ సెంటర్లకు పంపి అసరమైన చికిత్స అందిస్తామని అధికారులు వెల్లడించారు. 

రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలకు కంటి పరీక్షలకు సంబంధించిన కిట్లను ఇప్పటికే పంపిణీ చేశామని తెలిపారు. సుమారు 500 టీమ్స్ ఇందులో పాల్గొంటాయన్నారు. ఇందులో 300 కొత్త టీమ్ లు కాగా, 200 టీమ్స్ ఎన్ పీసీబీ కింద గుర్తించబడిన ఎన్జీవోలని తెలిపారు. ప్రతి ఒక్క టీమ్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్, ఒక పబ్లిక్ హెల్త్ స్టాఫ్ మరియు ఒక ఆశావర్కర్లను కలిగి ఉంటారని తెలిపారు.

రెండవ దశకు సంబంధించి ఆర్టీజీఎస్ ఆన్ లైన్ అప్లికేషన్స్ ను డెవలప్ చేస్తుందన్నారు. అక్టోబర్ 29న డీఎమ్ హెచ్ఓ, డీపీఎం, న్యూ పీఎంఓఏలతో రాష్ట్రస్థాయి వర్క్ షాప్   నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లో కొత్తగా నియామకమైన పీఎంఓఏలకు శిక్షణ అందిస్తున్నామన్నారు. 

ఇక మూడు, నాలుగు, ఐదు, ఆరో దశల్లో  కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా కళ్ళజోళ్ల సేకరణ ఉంటుందన్నారు.   ఫిబ్రవరి 1, 2020 నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు చేస్తారు. ప్రతి ఆరు నెలలకొక దశ చొప్పున ప్రతి దశలో కోటి మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఒక్కో దశ పూర్తి చేసుకొని జనవరి 31, 2022 నాటికి కార్యక్రమం పూర్తవుతుందన్నారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామాలు కవర్ అయ్యేలా చూడాలని, కంటివెలుగు శిబిరాల షెడ్యూలు పై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు తెలిసేలా చూడాలని సీఎస్ అధికారులకు సూచించారు.  కంటివెలుగు కార్యక్రామానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు drysrkv.ap.gov.in వెబ్ సైట్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. అధికారులతో పాటు 33,204 మంది ఆశావర్కర్లు, 64,000 మంది టీచర్లు, 11,408 మంది ఏఎన్‌ఎంలు, 8,238 పీహెచ్ ఎస్ లు, 1737 మంది  ప్రజారోగ్య సిబ్బంది కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. వీరంతా విద్యాశాఖతో సమన్వయం చేసుకొని పనిచేస్తారని తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కంటి సమస్యలతో ఏ విద్యార్థీ బాధపడకూడదు, అవకాశాలను పోగొట్టుకోకూడదన్నదే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.  మారుమూల ప్రాంతాల్లో నిరుపేదల పిల్లలకు వైద్య పరీక్షలు చేసి వెలుగులు నింపుతున్నారు. 

పిల్లల్లో కంటి సమస్యలు పరిష్కరించడం వల్ల పిల్లలు చక్కగా చదువుకునేందుకు అవకాశం కలుగుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అవసరమైతే అదనంగా వైద్య వసతులు కల్పించాలన్నారు. సాంకేతికతను వినియోగించుకొని విజయవంతం చేయాలన్నారు.

సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ విజయరామరాజు, హెల్త్ డైరెక్టర్ అరుణకుమారి, ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, పుష్పగిరి ఐ ఇన్ స్టిట్యూట్, అరవింద్ ఐ ఇనిస్టిట్యూట్ వంటి ఎన్జీవోలు, తదితరులు పాల్గొన్నారు.