22న టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి..
పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమలలో కొన్నిరోజులుగా రాజకీయ దుమారం చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యులుగా ఉన్న వారు కొంతమంది రాజీనామాలు చేసారు. అయితే తితిదే ఛైర్మన్‌గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేయడానికి ససేమిరా ఒప్పుకోలేదు.
నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తనను తొలగించేంత వరకు కొనసాగుతానని చెప్పారు. అయితే ఈరోజు పుట్టా సుధాకర్ యాదవ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవికి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సింఘాల్‌కు అందజేసారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైవీసుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
ఈనెల 22వ తేదీన ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదివరకే పలువురు టీటీడీ బోర్డు సభ్యులు రాజీనామా చేసిన సంగతి విదితమే. కాగా ఈనెల 22వ తేదీనే టీటీడీ బోర్డు కొత్త సభ్యులు సైతం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.