ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (22:09 IST)

అభ్యంగన మర్దన ఎపుడు చేయాలి? ఎలా చేయాలి?

Massage
అభ్యంగన మర్దన. శరీరానికి అభ్యంగన మర్దన చేస్తే శరీరం చాలా తేలికగా ఉంటుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అభ్యంగన మసాజ్ అనేది ఓ రకమైన ఆయుర్వేద మసాజ్. ఆయుర్వేదాన్ని అనుసరించి శరీరంలో మూడు రకాల దోషాలుంటాయి. వీటిని త్రిదోషలాని పిలుస్తారు. 1. వాత, 2. పిత్త మరియు 3. కఫం. ఈ దోషాలు ప్రతి మనిషి శరీరంలోను వారివారి శరీర తత్వాలను అనుసరించి, వాతావరణాలను అనుసరించి బయటపడతాయి.
 
వాతావరణంలో మార్పు, ఆహారంలో మార్పులు, శరీరంలో వ్యాధి నిరోధకశక్తిలో తగ్గుదల, సమతుల్యమైన ఆహారం లోపించడం, సరైన వ్యాయామం చేయకపోవడం తదితరాల కారణంగా ఈ దోషాలు తలెత్తుతాయంటున్నారు. ఈ దోషాలు రకరకాల శారీరక, మానసిక జబ్బులకు తోడ్పాటునిస్తాయి. రోగి యొక్క శరీర తత్వాన్ని అనుసరించి అభ్యంగన మసాజ్ చేస్తే త్రిదోషాలు తొలగిపోతాయి.
 
రోగి ఎలాంటి దోషంతో బాధపడుతున్నాడో పరీక్షించి, అతని శరీరానికి తగ్గట్టు మసాజ్‌ కొరకు నూనెను ఎంచుకోవాలి. కొబ్బరి లేదా ఆవాల నూనెలో వివిధ రకాల వేర్లు కలిపి మసాజ్ కొరకు ఉపయోగించాలి. మసాజ్ చేసుకునేందుకు అనువైన సమయం ప్రాతఃకాలంలోనేనని వైద్యులు సూచించారు.
 
మసాజ్ అనేది కేవలం పరగడుపున మాత్రమే చేయాలి. ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాతే మసాజ్ చేయించుకోవాలి. మసాజ్ చేసుకునేటప్పుడు మనిషి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మసాజ్ సందర్భంలో శరీరంపై తక్కువ దుస్తులుండేలా చూసుకోవాలి. మసాజ్ చేసే వ్యక్తి మంచి దిట్టకల వ్యక్తిగా ఉండాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు. మసాజ్ ముగిశాక స్నానం చేయాలి.