శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 18 ఏప్రియల్ 2022 (11:48 IST)

‘బ్రెస్ట్ క్యాన్సర్‌‌తో బాధపడుతున్నాను, అయినా, డేటింగ్ కొనసాగించాలని అనుకున్నాను’

Catherin
కేథరీన్ క్రోసన్‌కు 29 ఏళ్ల వయసులో క్యాన్సర్ సోకింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు తిరిగి డేటింగ్ ఎప్పుడు మొదలుపెట్టగలనా అనే విచారం మొదలైంది. ఈమె ఎడిన్‌బరోలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆమె ఇప్పటికీ కీమోథెరపీ, రేడియోథెరపీ చేయించుకుంటున్నారు. కానీ, ఆమెకు మాత్రం సాధారణ జీవితం తిరిగి ఎప్పటి నుంచి మొదలుపెట్టగలనో అనేది తెలుసుకోవాలని ఉంది.

 
"నేను తెల్లవారుజామున 3 గంటలకు గూగుల్ చేస్తుండగా ఒక జర్నల్‌లో వ్యాసం చూశాను. అందులో క్యాన్సర్ ఉన్నవారితో కూడా డేటింగ్ చేసేందుకు ఎటువంటి అభ్యంతరాలు లేవంటూ కొంతమంది సమాధానాలు కనిపించాయి. కానీ, డేటింగ్ చేయాలని అనుకునేవారు చికిత్స కూడా పూర్తయి ఉంటే మంచిదని చెప్పారు. "దానిని పిచ్చి వ్యవహారంగా కొట్టిపారేసిన విషయం కూడా నాకింకా గుర్తుంది" అని అన్నారు.

 
ఆమె ఆలోచనలను కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవాలని అనుకున్నారు. కానీ, కొన్ని వారాల తర్వాత ఆమె మనసు మార్చుకుని ఒక డేటింగ్ యాప్‌లో తన ప్రొఫైల్ పెట్టారు. ఆ తర్వాత ఆమెకు తన ప్రొఫైల్‌లో ఎలాంటి ఫోటో పెట్టాలా అనే విషయంలో సందిగ్ధత ఏర్పడింది. "నా జుట్టు అప్పటికి ఒక సెంటీమీటర్ పొడవు మాత్రమే ఉంది. కీమో వల్ల జుట్టు ఊడిపోయింది" అని కేథరీన్ చెప్పారు. ఇప్పుడామె వయసు 32 సంవత్సరాలు.

 
"నేను పొడవు జుట్టు ఉండే విగ్‌లు పెట్టుకుంటున్నాను. కానీ, నాకు అంతకుముందు పొడవైన బ్రౌన్ హెయిర్ ఉండేది. "కానీ, పొట్టి జుట్టుతో ఉన్న ఫోటోల ద్వారా నాకు క్యాన్సర్ ఉందని చూపించాలనుకోవటం లేదు" అని అన్నారు. ఆమె ప్రొఫైల్‌లో పెట్టుకునేందుకు చాలా రకాల ఫోటోలను వాడారు. కానీ, ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు ఎక్కడా బయట పెట్టలేదు.
ఆమె తన పూర్తి కథను ఎవరికీ చెప్పేవారు కాదు. దీంతో, మొదట్లో ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వారిని మోసం చేస్తున్నానేమో అని ఆమెకనిపించేది.

 
కానీ, డేటింగ్ యాప్ బయట ఎవరికైనా మెసేజీ చేస్తున్నప్పుడు మాత్రం ఆమె వారికి నిజం చెప్పేవారు. ఆమెకు క్యాన్సర్ ఉండటం వారికి సమస్య అయితే, వారు వెంటనే తనతో మాట్లాడటం మానేయవచ్చని చెబుతూ ఉండేదానినని చెప్పారు. "అయితే, నేను నిజం చెప్పడం వల్ల ఎవరూ కలవరపడలేదు. మనల్ని మనం వ్యక్తీకరించుకోవడం పైనే అన్నీ ఆధారపడి ఉంటాయి" అని ఆమె అన్నారు. "క్యాన్సర్‌ను ఒక సమస్యగా చెప్పకపోవడంలో మీ వ్యక్తిత్వం దాగి ఉంటుంది. నేనెవరినీ కెరీర్ కోసం ఉద్యోగంలో నియమించుకోవడం లేదు" అని అన్నారు.

 
ఆమెకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత తండ్రి ఇంట్లో ఒక సంవత్సరం పాటు ఉన్నారు. కానీ, 2021లో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసి మరో ఇద్దరు మగవాళ్లతో కలిసి ఒక ఫ్లాట్‌లో ఉండేవారు. అప్పటికి కూడా ఆమె ప్రొఫైల్ డేటింగ్ యాప్‌లో ఉంది. ఆమె ఇల్లు చూసుకుంటున్న సమయంలోనే ఆమెకు క్యాన్సర్ అనే నిజాన్ని చెప్పారు.

 
కొత్త రూమ్ మేట్
యాంగస్ మెక్‌ఫైల్‌కు 30 సంవత్సరాలు. ఆయన కూడా ఆమెతో కలిసి ఫ్లాట్‌లో ఉంటారు. "ఆమె ఫ్లాట్‌లోకి వచ్చి మాతో పాటు ఉండేందుకు మేం ఒప్పుకొన్నాం" అని ఆయన చెప్పారు. ఆయన కూడా క్యాథరీన్ వాడుతున్న డేటింగ్ యాప్ వాడుతున్నారు. అందులో ఆమె ఫోటోను ఆయన లైక్ చేశారు. క్యాథరీన్ ఆయనకు సమాధానమిస్తూ ఆమె కూడా అదే ఇంట్లో ఉంటున్నట్లు చెప్పారు. "అది వినగానే చాలా ఇబ్బందిపడ్డాను" అని ఆంగస్ చెప్పారు.

 
"ఆమె ఫ్లాట్ చూసేందుకు వచ్చినప్పుడు ఆమెకు పొట్టి జుట్టు, మాస్క్ ఉండేది. కానీ, ఫొటోల్లో ఆమెకు పొడవు జుట్టు ఉంది" అని చెప్పారు. క్యాథరీన్ ఆమెను అర్థం చేసుకునే వ్యక్తిని కలిశారు. కానీ, ఆమెకి కీమోథెరపీ ముగిసే సమయానికి వాళ్లిద్దరూ సెప్టెంబరులో విడిపోయారు. అప్పుడు ఆంగస్ ఆమెకు ప్రతిపాదన చేశారు. ఆమె ఆయన ప్రతిపాదనను అంగీకరించారు.

 
"క్యాథరీన్ నేను అరమరికలు లేకుండా మాట్లాడుకుంటాం. మేం చాలా విషయాలు మాట్లాడుకుంటాం. మేము ముందు స్నేహితులుగా మారాం. ఆ తర్వాత డేటింగ్ మొదలుపెట్టాం" అని ఆంగస్ చెప్పారు. "నా తల్లితండ్రులు, సోదరికి కూడా క్యాన్సర్ ఉంది. ఇది ఎవరికైనా రావచ్చు. అందుకే నేను డేటింగ్ మొదలుపెట్టినప్పుడు అదొక పెద్ద విషయం అని అనిపించలేదు" అని చెప్పారు.

 
"తన క్యాన్సర్ ప్రయాణంలో చేయూత ఇవ్వడం కాస్త కష్టమయింది కానీ, ఆ శ్రమకు విలువ దక్కింది". ఆంగస్ ఎడిన్ బరోలో ఉన్న క్యాన్సర్ ఛారిటీలో ఉచిత కౌన్సెలింగ్ తీసుకుంటారు. క్యాథరీన్‌కు క్యాన్సర్ మూడవ దశ అని మార్చి 2020లో నిర్ధరణ అయింది. ఆమె చంకలో చిన్న గడ్డ కనిపించి డాక్టర్ దగ్గరకు వెళితే, రొమ్ములో పెద్ద గడ్డ ఉన్నట్లు తేలింది. "నన్ను బ్రెస్ట్ క్లినిక్‌కు రిఫర్ చేయగానే చాలా వణుకు పుట్టింది" అని ఆమె చెప్పారు.

 
"క్యాన్సర్ చికిత్స అవుతుండగా బంధాల్లోకి అడుగుపెట్టడం సవాళ్లతో కూడుకున్న పని" అని క్యాన్సర్ ఛారిటీలో హెడ్ ఆండ్రూ ఆండర్ సన్ అన్నారు. అది కూడా ఒక కొత్త బంధంలోకి అడుగుపెట్టడం మరింత కష్టం ముందు కొత్త బంధాల కంటే కూడా తమ మీద దృష్టి పెట్టుకోమని మేము రోగులను ప్రోత్సహిస్తాం. రోగం నుంచి కోలుకోవడానికి ప్రాధాన్యం ఇమ్మని సూచిస్తాం" అని చెప్పారు. క్యాన్సర్ ప్రభావం చాలా మార్పులు తీసుకొస్తుంది. ఆ ప్రభావం నుంచి కోలుకుని అప్పుడు కొత్త బంధాల గురించి ఆలోచించాలి" అని అన్నారు.

 
"మీ కోసం మీరు తగినంత సమయం తీసుకున్న తర్వాత మీ ముందున్న అవకాశాల కోసం చూడండి" అని అన్నారు.
క్యాథరీన్ చికిత్స కొనసాగుతోంది. ఆమెకు ప్రతి నెలా ఇంజెక్షన్లు, ఎముకల బలానికి ఆరు నెలలకొకసారి ఔషధాలు తీసుకుంటున్నారు. ఆమె అండాలను ఫ్రీజ్ చేసి, గర్భాశయ నాళాలను మూడేళ్ల వరకు తెరుచుకోకుండా మూసేసారు.

 
"నేను పిల్లల్ని కనేందుకు వీలవుతుందో లేదో తెలుసుకోవడానికి కొన్నేళ్లు ఎదురు చూడాలి" అని కేథరీన్ అన్నారు.
"నేనింకా సాధారణ స్థితికి రాలేదని చాలా విషయాలు గుర్తు చేస్తూ ఉంటాయి" అని అన్నారు. "నేను ఏ మాత్రం అలసటకు గురైనా గుండె దడ వస్తోంది. పరుగు పెడుతుంటే నా అరచేతులు మొద్దుబారిపోతున్నాయి". "ఇవన్నీ నా చికిత్స వల్ల ఏర్పడుతున్న ప్రతికూల ప్రభావాలు. కానీ, ఇలాంటి మరెన్నో సమస్యలకు నేను అలవాటు పడిపోయాను" అని అన్నారు.

 
క్యాన్సర్ చికిత్స పూర్తయిన తర్వాత జీవితాన్ని ఆలింగనం చేసుకుని సంపూర్ణంగా జీవించాలని అనిపిస్తుంది" అని అన్నారు. "నాకు క్యాన్సర్ చికిత్స కోసం 18 నెలలు గడపడంతో అన్నిటికీ అవుననే చెప్పాలనుకుంటున్నాను" అని అన్నారు.