సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: గురువారం, 25 ఏప్రియల్ 2019 (21:08 IST)

'కియా' ఏంటీ కిరికిరీ? 'అనంత'లో స్థానికులకు స్వీపర్ ఉద్యోగాలా?

"ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక నగరాలు, ప్రభుత్వ భూసేకరణ ద్వారా ఏర్పడిన భారీ పరిశ్రమలు - వాటి సామాజిక ఆర్థిక ప్రభావం"పై పరిశీలనలో భాగంగా అనంతపురంలో కియా పరిశ్రమకు, ఆ చుట్టుపక్కల పల్లెలకు బీబీసీ వెళ్లింది.

కియా పరిశ్రమ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో వచ్చిన కియా 535 ఎకరాల్లో ఒక ప్లాంటును నిర్మిస్తోంది. ప్రధాన పరిశ్రమతో పాటు మరో 16 అనుబంధ పరిశ్రమలు కూడా ఈ ప్లాంటు చుట్టుపక్కల నిర్మించబోతున్నారు.
 
ఈ ఫ్యాక్టరీతో పెనుగొండ పట్టణం, పరిసర గ్రామాలు చాలా మారాయి. ఉద్యోగుల రాకతో ఇళ్ల అద్దెలు పెరిగాయి. కొత్తగా భవనాలు, దుకాణాలు వెలిశాయి. కొరియన్ రెస్టారెంట్లు, కొరియా భాషలో కనిపించే బోర్డులతో ఈ ప్రాంతం కొత్తదనం సంతరించుకుంది. కియా కోసం గొల్లపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి, ప్రభుత్వం ఈ సంస్థకు నీటి సౌకర్యం కల్పిస్తోంది. ఏళ్ల తరబడి స్థానికులు ఎదురుచూసిన ఈ నీటి ప్రాజెక్టు, కియా కోసం చకచకా పూర్తయ్యింది.
 
రియల్ ఎస్టేట్‌కు రెక్కలు
ఆంధ్ర ప్రదేశ్‌లోని అత్యంత కరవు ప్రాంతాల్లో అనంతపురం జిల్లా ఒకటి. గత ఐదేళ్లుగా ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని దాదాపు అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో కియా పరిశ్రమ అనంతపురం జిల్లా స్థితిగతులనే మార్చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ భూసేకరణ పెద్దగా వివాదాస్పదం కాలేదు. కియా ఏర్పాటు కోసం ప్రభుత్వం ఎకరాకు 10.5 లక్షల రూపాయల పరిహారం చెల్లించి, భూసేకరణ చేసింది. అప్పటి మార్కెట్ ధర కంటే అది ఎక్కువ. ప్రస్తుతం ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. ఎకరా భూమి విలువ కోట్ల రూపాయలు పలుకుతుండటంతో కియా రాకపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
''కియా రాకుంటే ఏమీలేదు. జనాలు కూడా బెంగళూరుకు వలస పోవాలి. ఏ పనీ లేదు. మేం కూడా వలస పోవాల్సిందే. బోర్లలో నీళ్లు లేవు. భూములుంటే ఏం చేస్తారు? ఇప్పుడు బెంగళూరు పోయేవాళ్లంతా వచ్చి ఇక్కడే పనిచేసుకుంటున్నారు. భూముల విలువ పెరిగింది. ఎకరా లక్ష నుంచి కోట్లకు పెరిగింది. ముందు బాత్‌రూం కూడా కట్టుకోలేని వాళ్లు ఇప్పుడు మేడలు కడుతున్నారు. ఊరు మెరుగైంది'' అని అమ్మవారిపల్లెకి చెందిన ఆంజనేయులు బీబీసీతో అన్నారు.
 
ఉపాధి
ఉపాధి - ఉద్యోగాల విషయంలో స్థానికుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ప్రస్తుతానికి కియాలో 900 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉత్పత్తి ప్రారంభమయ్యే నాటికి మొత్తం 3,500 మంది ఉద్యోగులను కియా సంస్థ నియమించనుంది. మొత్తం 16 అనుబంధ సంస్థల్లో కలిపి మరో 6,500 మందికి ఉపాధి దొరుకుతుందని కియా చెబుతోంది. కియా ప్రధాన ఫాక్టరీలో జులై నాటికి ఉత్పత్తి ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని కియా సంస్థ తెలిపింది.
 
ఈ ప్రాంతంలో డిగ్రీలు, ఇంజినీరింగ్ చదివిన వారు ఎక్కువ. కానీ కియా మాత్రం డిప్లొమా వారికే ప్రాధాన్యమిస్తోంది. కియాలో ఉన్నత ఉద్యోగాల్లో కొరియన్లు ఉంటారు. మిగిలిన ఉద్యోగాల్లో 80 శాతానికిపైగా తమిళులే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. తమకు శిక్షణ ఇస్తే కియాలో పనిచేయడానికి తగిన నైపుణ్యం సంపాదించుకుంటామని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం కియా నిర్మాణం అంతా చెన్నైలోని హ్యూందాయ్ చూస్తోంది. దీంతో ఇక్కడ పనిచేసే వారిలో తమిళుల సంఖ్య ఎక్కువగా ఉందని స్థానికుల ఆరోపణ.
 
''భూమి పోయిన వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంకా పని పూర్తి కాలేదు అని చెబుతున్నారు. మన వాళ్లు డిగ్రీలు చదివారు. వాళ్లకు పాలిటెక్నిక్ కావాలి. ఇక్కడ కూడా అంతా చదువుకున్న వాళ్ళే. ఒక మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తే ఫ్యాక్టరీలో చేయగలుగుతారు. అదేం పెద్ద సమస్య కాదు. మాకు టాలెంట్ ఉంది. శిక్షణ ఇస్తే నేర్చుకుంటాం. తమిళ వాళ్లకు పనిలో అనుభవం ఉందని వారిని తీసుకుంటున్నారు. మాకు ఉద్యోగాలిస్తారని ఆశిస్తున్నాం'' అన్నారు ఆంజనేయులు.
 
స్వీపర్ ఉద్యోగాల్లో స్థానికులు అధికం
స్థానికేతరులకు ఉద్యోగాల విషయంలో ఇక్కడ యువతకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ''దేశమంతా ఒకటే. అంతా ఉండాలి. కానీ స్థానికులు కూడా కొంత ఉండాలి కదా. అన్నీ మాకే అనడం లేదు. కానీ స్థానికులకు కనీసం ఓ 50% అయినా ఇవ్వాలి కదా. పోనీ ఇంకో 10 శాతం తగ్గించి 40 శాతం స్థానికులకు ఇవ్వండి. మేం చదువుకోకుండా ఉద్యోగాలు అడగడం లేదు. క్వాలిఫికేషన్ బట్టే ఇవ్వండి. లేదా మా చదువు సరిపోదంటే, ఏ క్వాలిఫికేషన్ కావాలో చెప్పండి. ఆ చదువు పూర్తిచేసి వస్తాం. మేం బయటకు వెళ్లి మా సొంత డబ్బుతో ఆ కోర్సు చేసి వస్తాం. భూములు కోల్పోయాం కాబట్టి ఈ మాట అంటున్నాం'' అని ఇంజినీరింగ్ పూర్తి చేసిన సత్యనారాయణ అన్నారు. సత్యనారాయణ దుద్దిగూడెం గ్రామానికి చెందినవారు.
 
ప్రస్తుతానికి స్థానికులకు ఫ్యాక్టరీ, యూనిట్ల నిర్మాణ పనుల్లో కొంత ఉపాధి దొరుకుతోంది. ఇందులో కూడా ఉత్తరాది వారితో పాటూ, తమిళుల సంఖ్య ఎక్కువగానే ఉంది. నైపుణ్యం లేని పనులైన స్వీపర్లు, సెక్యూరిటీ ఉద్యోగాల్లో స్థానికులు ఎక్కువ ఉన్నారు. స్థానికులకు అతి తక్కువ సంఖ్యలో మాత్రమే కియాలో శాశ్వత ఉద్యోగాలు వచ్చాయి. ఇక్కడి యువత, భూములు ఇచ్చిన కుటుంబాల వారు, చుట్టుపక్కల పల్లెల్లో చదువుకున్న వారు కియాలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, కియా వర్గాల నుంచి సమాచారం సరిగా అందడం లేదన్న అసంతృప్తి వారిలో ఉంది.
 
కియా తమ భారతీయ ఉద్యోగులను రాష్ట్రాల వారీగా చూడటం లేదు. అయితే శాశ్వత ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యమిస్తామని మాత్రం వారు చెబుతున్నారు. అంతేకాదు, సాంకేతిక ఉద్యోగాల్లో డిప్లొమా చదివిన వారిని మాత్రమే చేర్చుకునే విషయంలో కియా స్పష్టంగా ఉంది. దీంతో డిగ్రీలు, పీజీలతో పాటు ఇంజినీరింగ్ చదివిన వారికి ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం తక్కువగానే ఉంది.
 
''భారతదేశానికి 30% ఆటోమొబైల్ ఉత్పత్తులు తమిళనాడు నుంచే వస్తాయి. ఆ మేరకు అక్కడ నిపుణులు, ఆ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులు దొరుకుతున్నారు. ఆంధ్రలో ఆటోమొబైల్ రావడం ఇదే మొదలు. ఒక పదేళ్లలో ఇక్కడ కూడా ఆ డిప్లొమాలు చేసిన వారు దొరుకుతారు. ఫ్యాక్టరీ ఇక్కడ ఉంటే, ఉద్యోగాలు కూడా ఇక్కడి వారికే వస్తాయి కదా'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
 
ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ 2 వేల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని సంకల్పించగా, ఇప్పటి వరకూ 54 బ్యాచుల్లో 920 మందికి శిక్షణ ఇచ్చింది. వీరిలో కియాలో శాశ్వత ఉద్యోగాలు ఎందరికి వచ్చాయన్న విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం కియా సంస్థ ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించడంలేదు. కియా పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభించే నాటికి స్థానికులకు ఎంత శాతం ఉద్యోగాలు వస్తాయి, పరోక్ష ఉపాధి ఎంత మేరకు కొనసాగుతుంది, అనంతపురంపై కియా ప్రభావం ఎంత అనేది తేలుతుంది.
 
-బళ్ల సతీశ్
బీబీసీ ప్రతినిధి