శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (18:19 IST)

ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'..

ఎటుచూసినా ఎడారిని తలపించే భూములు. దుమ్ముతో నిండిన రోడ్లు. కనుచూపు మేరల్లో ఇల్లు కనిపించడం కూడా ఒక్కోసారి గగనమే. ఇది నెవడాలోని రేచల్, హికో పట్టణాల పరిస్థితి. వీటి మొత్తం జనాభా 173 మాత్రమే. అయితే ఈ మారుమూల పట్టణాలకు ఓ ప్రత్యేకత ఉంది. అదే 'ఏరియా-51'.

 
అమెరికా రహస్య వైమానిక స్థావరం పేరే 'ఏరియా-51'. ఇక్కడ రహస్య ప్రయోగాలు జరుగుతుంటాయని అమెరికన్లు విశ్వసిస్తుంటారు. గతంలో దొరికిన గ్రహాంతరవాసులతోపాటు గుర్తుతెలియని ఎగిరే పళ్లాలు (యూఎఫ్‌వోలు) ఇక్కడ ఉంటాయని నమ్ముతుంటారు. ఇక్కడికి సమీపంలోనే ఈ రెండు పట్టణాలున్నాయి.

 
ఈ నెల 19 నుంచి రేచల్, హికో పట్టణాల్లో రెండు ఈవెంట్‌లు మొదలుకాబోతున్నాయి. వీటికి హాజరయ్యేందుకు వేల సంఖ్యలో ప్రజలు వస్తారని అంచనా. ఈ ఈవెంట్ల పేర్లు 'ఏలియన్ స్టాక్', 'స్టార్మ్ ఏరియా 51 బేస్‌క్యాంప్'. ఇవి ఏటా జరిగే ఈవెంట్లు కావు. నాలుగు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో కనిపించిన ఓ జోక్‌ నుంచి వీటిని నిర్వహించాలనే ఆలోచన పుట్టింది.

 
ఓ ఈవెంట్‌ నిర్వహణలో తోడ్పాటు అందించేందుకు సదరు జోక్‌ను పోస్ట్‌ చేసిన వ్యక్తి తొలుత ముందుకువచ్చారు. అయితే ఈ ఈవెంట్ మానవ విపత్తులా మారే ముప్పుందని ఆయన భయపడుతున్నారు. గత జూన్‌లో కాలిఫోర్నియాకు చెందిన 20 ఏళ్ల మ్యాటీ రాబర్ట్స్.. ఫేస్‌బుక్‌లో సరదాగా ఓ ఈవెంట్‌ను పోస్ట్‌చేశారు. దీనిపేరు ''ఏరియా 51పై దండెత్తండి. మనల్ని వారు ఆపలేరు''. సెక్యూరిటీని దాటుకుంటూ లోపలకు వెళ్లే స్థాయిలో అందరూ ఇక్కడ గుమిగూడాలనే వ్యూహాన్నీ ఆయన పోస్ట్‌కు జతచేశారు.

 
''స్థావరంలో జరుగుతున్న ఏలియన్ టెక్నాలజీ ప్రయోగాలు, ప్రభుత్వ రహస్య పరిశోధనల గురించి ప్రజలకు తెలియాలి. ఏలియన్లను చూడనివ్వండి''అని ఆయన రాసుకొచ్చారు. కొన్ని రోజులకే ఈ ఈవెంట్ సంచలనంగా మారింది. ప్రపంచ మీడియా పతాక శీర్షికల్లో నిలిచింది.

 
''జూన్ 27న అర్ధరాత్రి రెండు గంటలకు ఏరియా 51 ఫేస్‌బుక్ ఈవెంట్‌ను పోస్ట్‌ చేశాను. ఇదొక జోక్ మాత్రమే. అయితే ఇది విపరీతంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. అద్భుతంగా అనిపించింది''అని బీబీసీతో రాబర్ట్స్ చెప్పారు. ''సెప్టెంబరు 20న జరుగబోతున్న ఈ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు 35 లక్షల మందికిపైగా ఉత్సాహం చూపించారు. చాలామంది దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు''అని ఆయన వివరించారు.

 
ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ఉత్సాహం చూపించిన వారిలో 33ఏళ్ల రియల్‌ ఎస్టేట్ ఇన్వెస్టర్ ఆర్ట్ ఫ్రాన్సిక్ కూడా ఒకరు. ''ఏలియన్లకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు, ఏరియా 51లోకి వెళ్లేందుకు నాతోపాటు చాలామంది ఉత్సాహంగా ఉన్నారు''అని ఆయన బీబీసీతో చెప్పారు. ''మాపై విధిస్తున్న పన్నులతోనే ఈ స్థావరం నడుస్తోంది. ఏలియన్ టెక్నాలజీని 70ఏళ్ల నుంచి రహస్యంగా ఉంచేస్తున్నారు. అక్కడేముందో తెలుసుకోవడం మా హక్కు''అని ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఆయన రాసుకొచ్చారు.

 
ఏరియా 51 స్థావరంలో అనుమతిలేని ప్రాంతంలోకి మూడు మైళ్ల వరకు వచ్చిన నెదర్లాండ్‌వాసి టైస్ గ్రాన్‌జీర్, ఆయన స్నేహితుడు గోవెర్ట్ స్వీప్‌లను పోలీసులు అరెస్టుచేశారు. లోపల ఏముందో చూడాలని అనుకుంటున్నట్లు ఈ ఇద్దరూ పోలీసులకు తెలిపారు. మరికొందరు కూడా ఇలానే లోపలకు వస్తామంటూ చెబుతున్నారు. భారీగా మీమ్‌లు కూడా వస్తున్నాయి. అయితే ఎంతమంది నిజంగా ఇక్కడకు వస్తారో అంచనా వేయడం కొంచెం కష్టమే.

 
లోపలకు వస్తామంటూ చేస్తున్న వ్యాఖ్యలు, పోస్ట్‌లను అమెరికా వైమానిక స్థావరం సీరియస్‌గా తీసుకుంటోంది. ''సైనిక సదుపాయాలు, శిక్షణ ప్రాంతాల్లోకి అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నించడం అత్యంత ప్రమాదకరం''అని అమెరికా వైమానిక స్థావరం అధికార ప్రతినిధి లారా మెక్‌ఆండ్రూస్.. బీబీసీతో చెప్పారు. మరోవైపు ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ కాకూడదని తాను భావిస్తున్నట్లు రాబర్ట్స్ చెప్పారు. ఫేస్‌బుక్ పోస్ట్ సంచలనంగా మారడంతో ఎఫ్‌బీఐ ప్రతినిధులు ఆయన్ను విచారించారు.

 
సరదాగా చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు ఆయన చేయి దాటిపోయింది. దీన్ని చూసిన అనంతరం ఏరియా 51 లోపలకు చొరబడేందుకు వస్తామంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అమెరికా వైమానిక స్థావరం సిబ్బందితోపాటు లింకన్, నై కౌంటీల అధికారులకు వీరు సవాల్ విసురుతున్నారు. ఏలియన్ స్టాక్ ఈవెంట్‌ను రేచల్‌లోని లిటిల్ ఎలెఇన్ హోటల్, స్టార్మ్ ఏరియా 51 బేస్‌కాంప్‌ ఈవెంట్‌ను హికోలోని ఏలియన్ రీసెర్చ్ సెంటర్ నిర్వహిస్తున్నాయి. లింకన్ కౌంటీ నుంచి అవసరమైన అనుమతులను ఇప్పటికే తీసుకున్నామని ఈ రెండు సంస్థలు చెబుతున్నాయి.

 
ముందుజాగ్రత్తగా కౌంటీ ఓ ఎమర్జెన్సీ డిక్లెరేషన్‌ను సిద్ధంచేసింది. ఈవెంట్లకు ఎంతమంది వస్తారో ఎవరికీ తెలియదు. అయితే 5,000 నుంచి 50,000 మందిని మాత్రమే మేం అనుమతిస్తాం అని స్పష్టంచేసింది. ఏలియన్లు ఉన్నాయని విశ్వసించేవారు దశాబ్దాల నుంచి ఏరియా 51ను చూడాలని కలలుగంటున్నారు. ఇది గ్రూమ్ సరస్సు పక్కనే ఉంది. 1950ల్లో గూఢచారి విమానం లాక్‌హీడ్ యూ-2కు ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు దీన్ని ఏర్పాటుచేశారు. అయితే ఈ ప్రాంతంతో ఏలియన్లు, ఎగిరే పళ్లాలకు సంబంధమున్నట్లు 1980ల వరకూ ఎలాంటి వార్తలూ రాలేదని ఏరియా 51 నిపుణుడు గ్లెన్ క్యాంప్‌బెల్ తెలిపారు.

 
ఏరియా 51కు సమీపంలోని ఓ ప్రాంతంలో ఏలియన్ వ్యోమనౌకను తిప్పి పంపేందుకు నన్ను నియమించుకున్నారంటూ లాస్‌వెగాస్ టీవీ స్టేషన్‌లో భౌతికశాస్త్ర నిపుణుడు బాబ్ లేజర్ చెప్పడంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ''దీంతో వేలకొద్దీ ఊహాగానాలు పుట్టుకొచ్చాయి''అని ఏరియా 51పై పుస్తకం రాసిన అన్నె జాకబ్‌సెన్ వివరించారు.

 
సైనిక స్థావరం కావడంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. అయితే ''మిలిటరీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచంలో అమెరికా అగ్రగామిగా ఎదగడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. గోప్యత ఎక్కువ కావడంతో భిన్న ఊహాగానాలు పుట్టుకొచ్చాయి''అని జాకబ్‌సెన్ తెలిపారు.

 
''ఈ స్థావరం ఎప్పటికీ ఓ బ్లాక్ బాక్స్‌గా మిగిలిపోయింది. దీంతో ఎవరికి నచ్చినదాన్ని వారు నమ్ముతున్నారు''అని బీబీసీతో కాంపెబెల్ అన్నారు. మరోవైపు ఫేస్‌బుక్‌పై ఉత్సాహం చూపినవారిలో ఒక శాతం మంది వచ్చినా.. పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారతాయని లింకన్ కౌంటీ షెరీఫ్ కెరీ లీ తెలిపారు.

 
''అదనంగా 150 మంది అధికారులు, 300 మంది వైద్య సిబ్బందిని నెవడాలో ఇతర ప్రాంతాల నుంచి రప్పిస్తున్నాం. కౌంటీలోని మిగతా ప్రాంతంలో విధులకు కేవలం 26 మంది అధికారులు మాత్రమే మిగిలారు''అని లీ చెప్పారు. ఏరియా 51లోకి చొరబడే వారిని అరెస్టు చేస్తామని, వెయ్యి డాలర్లకుపైగా జరిమానా విధిస్తామని ఆయన వివరించారు. ఎవరైనా చూడాలని అనుకుంటే బయట నుంచే చూడండని అన్నారు.

 
ఎఫ్‌బీఐతోపాటు స్థానిక, రాష్ట్ర, ఫెడరల్ సంస్థల వనరులు ఉపయోగించుకుంటున్నామని, రెండు ఈవెంట్లకు వచ్చేవారి సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. ''అంచనాలు నిజమైతే.. రాత్రికి రాత్రే లింకన్ కౌంటీలో జనాభా పది రెట్లకు పెరుగుతుంది. రేచల్, హికో పట్టణాల్లోని సదుపాయాలు సరిపోవు. ఇక్కడున్న కొన్ని దుకాణాలు, ఓ హోటల్, రెస్ట్‌రూమ్, గ్యాస్, ఇంటర్నెట్ సేవలు జనాల రద్దీని తట్టుకోలేవు''అని లీ వివరించారు.

 
ఏలియన్‌స్టాక్ ఈవెంట్.. 'ఫైర్ ఫెస్టివల్ 2.0'గా మారొచ్చని రేచల్ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఫైర్ ఫెస్టివల్ 2017లో బహమాస్‌లో జరిగింది. జనాలు విపరీతంగా రావడంతో ఈ పార్టీ అభాసుపాలైంది. ఏలియన్‌స్టాక్‌కూ అదే గతి పడుతుందని కొంతమంది భావిస్తున్నారు.

 
మౌలిక సదుపాయాల లేమి, సరైన ప్రణాళికలు లేకపోవడం, ముప్పు అంచనాల్లో లోపాలు తదితర కారణాల వల్ల ఈ ఈవెంట్ మానవ విపత్తుగా మారే ముప్పుందని రాబర్ట్స్ ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేశారు. దాదాపు పదివేల మంది వరకు ఇక్కడికి వచ్చే అవకాశముందని, సరైన భద్రతా సదుపాయాలు లేకపోవడంతో నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ఆయన అన్నారు.

 
మరోవైపు ఫ్రాంక్ డిమ్యాగియో అనే మరోవ్యక్తి కూడా ఏలియన్‌స్టాక్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. నెవడా చరిత్రలో ఈ ఈవెంట్ భారీ విపత్తుగా అపఖ్యాతి మూటగట్టుకోకముందే దీన్నుంచి తప్పుకొంటున్నట్లు కేటీఎన్‌వీ లాస్ వెగాస్‌తో ఆయన చెప్పారు. అయినప్పటికీ ఈవెంట్ కొనసాగుతుందని లిటిల్ ఏ లీ ఇన్ హోటల్ యజమాని కోనీ వెస్ట్ స్పష్టంచేశారు. ''భద్రత, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు అన్నింటికీ ఇప్పటికే చెల్లింపులు చేశాం. 20 బ్యాండ్లు, ఇద్దరు కమెడియన్లు కూడా వస్తారు''అని ఆమె తెలిపారు.

 
''ఏదైనా సరే.. ఈవెంట్ జరుగుతుంది. దీన్ని ఆపేందుకు నేనేమీ చేయలేను''అని కేటీఎన్‌వీ రిపోర్టర్‌తో ఆమె చెప్పారు. రెండో ఈవెంట్‌ను నిర్వహిస్తున్న ఏలియన్ రీసెర్చ్ సెంటర్‌లోని యూఎఫ్‌వో నిపుణులు, సంగీత కళాకారులు కొంత ఆశాభావంతో కనిపిస్తున్నారు. 5000 మందికి ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం తమకుందని ఆర్గనైజర్లలో ఒకరైన కీత్ రైట్.. బీబీసీతో చెప్పారు.

 
''పార్కింగ్, రెండు బాటిళ్ల మంచినీరు, పది డాలర్ల ఫుడ్ వోచర్‌తో కలిపి ఒక్కొక్కరికి రోజుకు 51 డాలర్ల వరకు ఖర్చవుతుంది. ఏరియా 51 పరిసరాల్లో టెంట్లకు మాత్రమే అనుమతి ఇస్తున్నాం. ఒక్కో టెంట్‌కు రోజుకు 50 డాలర్లు ఖర్చు అవుతుంది. మొబైల్ హోమ్ లాంటి భారీ వాహనాల పార్కింగ్‌కు రోజుకు 150 డాలర్లు''అని ఆయన వివరించారు.

 
''టెంట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన చోటు అక్కడుంది. మంచి నీరు, విద్యుత్, పారిశుద్ధ్య అవసరాలకు తగిన ఏర్పాట్లు చేశాం. అయితే వచ్చేవారు లక్షల్లో ఉంటే.. ఈ సదుపాయాలతో నెట్టుకురావడం కష్టం''అని రైట్ చెప్పారు. అయితే ఏలియన్‌స్టాక్ నిర్వాహకుల్లానే తమ లెక్కలు తలకిందులయ్యే ముప్పు ఎక్కువని, పరిస్థితులు విపత్తుకు దారితీసే అవకాశముందని రైట్‌కు తెలుసు.

 
''ఏలియన్‌స్టాక్ లేదా స్టార్మ్ ఏరియా 51లకు ఎవరైనా వస్తే.. అది వారి ఇష్టం మేరకే. వారిని హెచ్చరించేందుకు నేను చేయాల్సిందంతా చేశాను''అని రాబర్ట్స్ చెప్పారు. అయితే అక్కడ ఏముందో ప్రజలందరికీ తెలియజేయడం మేలని ఆయన అభిప్రాయపడ్డారు.