సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (20:11 IST)

ఆంధ్రప్రదేశ్ : ఆత్మకూరు ఎందుకు వార్తల్లోకెక్కింది? ఆ ఊరిలో ఏం జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గుంటూరు జిల్లాలోని ఆత్మకూరు హాట్ టాపిక్ అయ్యింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ గ్రామ రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. గుంటూరు జిల్లా దుర్గి మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆత్మకూరు ఇంతటి రాజకీయ చర్చకు ఎలా కేంద్ర బిందువు అయింది? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందనే విషయాలు తెలుసుకునేందుకు బీబీసీ ఆ గ్రామం వెళ్ళింది.
 
సుమారు 3 వేల జనాభా ఉన్న గ్రామం ఆత్మకూరు. ఈ గ్రామం నరసరావుపేట, నాగార్జున సాగర్ మార్గంలో ఉంది. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆత్మకూరు పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం. ఇక్కడ పత్తి, కంది పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే, అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. 2011 అధికారిక లెక్కల ప్రకారం, ఈ గ్రామంలో అక్షరాస్యత 49 శాతం మాత్రమే. గత సర్పంచ్ ఎన్నికల తర్వాత మొదలైన వివాదం ఇప్పుడు రాష్ట్ర మంతా దుమారం రేపుతోంది.
 
టీడీపీ ఛలో ఆత్మకూరు అనడంతో... 
టీడీపీ మద్దతుదారులను ఆత్మకూరు గ్రామంలో ఉండనీయకుండా వారిపై రాజకీయ దాడులకు పాల్పడుతున్నారంటూ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. ఆ గ్రామాన్ని వీడి వివిధ గ్రామాల్లో ఉంటున్న వారి కోసం గుంటూరులో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. 'వైసీపీ రాజకీయ వేధింపుల బాధితుల' పేరుతో వాటిని నిర్వహించారు. రెండు వారాల పాటు ఆ క్యాంపులో ఉన్న వారిని స్వగ్రామానికి తీసుకెళ్తామని ఆ పార్టీ ప్రకటించింది. 
 
అందులో భాగంగా 11వ తేదీన 'ఛలో ఆత్మకూరు' అంటూ టీడీపీ అధినేత పిలుపునిచ్చారు. అందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆత్మకూరులో 144సెక్షన్ విధించింది. ఆంక్షలను ఉల్లంఘించి, ఆత్మకూరు బయలుదేరుతారని భావించి పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. చంద్రబాబు సహా ఎవరూ బయటకు రాకుండా అడ్డుకున్నారు. బయటకు వచ్చిన వారిని అరెస్టు చేశారు.
 
పోటీగా పిలుపునిచ్చిన వైసీపీ... 
ప్రతిపక్షానికి పోటీగా అధికార వైసీపీ కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యింది. తాము కూడా ఆత్మకూరు వెళతామని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. గ్రామస్థాయి వివాదాన్ని చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని హోంమంత్రి సుచరిత విమర్శించారు. పెయిడ్ ఆర్టిస్టులతో పునరావాస కేంద్రం నడుపుతున్నారని మండిపడ్డారు. అయితే, ఆత్మకూరు వెళ్లేందుకు అనుమతులు లేవని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆయన నిరసన తెలిపారు.
 
ఆత్మకూరులో ఏం జరుగుతోంది?... 
ఆత్మకూరులో ఒక్కో సామాజిక వర్గంలో ఒక్కో పార్టీకి పట్టుందని స్థానికుడు వీరాంజనేయులు బీబీసీకి తెలిపారు. "ఎస్సీ వర్గంలో చాలా కాలంగా టీడీపీకి బలం ఉండేది. కానీ, నాలుగేళ్ళ క్రితం వారి మధ్య తగాదాలు వచ్చాయి. దాంతో, కొందరు కాలనీ నుంచి వచ్చేసి మా వీధిలో ఉండేవారు. ఇప్పుడు అధికార మార్పిడి తర్వాత వీళ్ళు వెళ్లారు. వారు బయటికిపోయారు. అంతా ఒకే కుటుంబం, బంధువులే. అయినప్పటికీ రాజకీయ కారణాలతోనే వారి మధ్య విభేదాలు వచ్చినట్టు కనిపిస్తోంది. అయితే నాలుగేళ్లుగా పెద్దగా వానలు పడక పంటలు లేకపోవడంతో ఇబ్బంది రాలేదు. ఈ ఏడాది వారి భూములు సాగు చేసుకోవడానికి సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో దీన్ని ఇంత పెద్ద వివాదంగా మార్చినట్టు కనిపిస్తోంది" అని ఆయన వివరించారు.
 
నాలుగేళ్లు మమ్మల్ని కష్టపెట్టారు... 
2014 ఎన్నికల్లో అందరం కలిసి పనిచేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత తమను వేధించారని, నాలుగేళ్లు తమను చాలా ఇబ్బంది పెట్టారని వైసీపీ మద్దతుదారుడిగా చెప్పుకుంటున్న పి. ఆదయ్య అన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "ప్రభుత్వం ఇళ్లు ఇస్తే వాళ్ళకే. ఏది వచ్చినా మాకు చేరనివ్వలేదు. మేము ప్రశ్నించాం. మా మీద దాడి చేశారు. ఏం చేయాలో తెలియక కొంపా గోడు వదిలేసి పోయాం. నాలుగేళ్లు కష్టపడ్డాం. అద్దె ఇళ్లలో మూడు, నాలుగు కుటుంబాలు సర్దుకున్నాం. వెళ్లిపోయిన 20 కుటుంబాల వాళ్ళం మళ్ళీ మూడు నెలల క్రితం సొంతూళ్లకు వచ్చాం. పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు పోయారు అని ఆదయ్య చెప్పారు.
 
వేధింపులు తట్టుకోలేకే వెళ్లిపోయాం.. 
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తరువాత వేధింపులు పెరిగిపోయాయని మూడు నెలల పాటు గ్రామం నుంచి వెళ్లిపోయి వివిధ చోట్ల ఆశ్రయం పొందిన రాబర్ట్ బీబీసీకి తెలిపారు. "వాళ్ళు 20 కుటుంబాల వాళ్ళు మాపై దాడులకు దిగారు. మా ఇళ్లు ధ్వంసం చేశారు. దాంతో ఊరు వదిలి వెళ్లిపోయాం. నేను పాలెంలో తలదాచుకున్నాను. తలో గ్రామం చొప్పున 5, 6 గ్రామాలకు వెళ్లిపోయారు. అందరినీ చంద్రబాబు పిలిస్తే గుంటూరు వెళ్ళాం. ఆయన మాకు ధైర్యం చెప్పారు. ఇప్పుడు పోలీసులు పిలిస్తే వచ్చాం. మా ఉరిలోనే ఉంటాం" అని రాబర్ట్ అన్నారు.
 
ఆత్మకూరులో పరిణామాలపై ప్రభుత్వం స్పందించింది. గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన శిబిరంలో ఉన్నవారిని పోలీసులు గ్రామానికి తీసుకెళ్లారు. 52 కుటుంబాలకు చెందిన 65 మంది మూడు నెలల తర్వాత స్వగ్రామానికి చేరుకున్నారు. వారందరికీ స్థానిక చర్చిలో తాత్కాలికంగా పునరావాసం ఏర్పాటు చేశారు.
 
ఇకపై కలిసి ఉంటాం... 
ఇకపై వివాదాలకు దూరంగా ఉంటామని ఊరు విడిచి వెళ్లిన వారి గ్రామ పెద్ద యోహాను చెబుతున్నారు. "పోలీసులు మాకు భరోసా ఇచ్చారు. అందరూ గతంలో మాదిరిగా కలిసి ఉండాలని చెప్పారు. ఇన్నాళ్లుగా జరిగింది పీడకలగా మరిచిపోతాం" అని ఆయన అన్నారు. వినుకొండ డీఎస్పీ శ్రీహరి బాబు బీబీసీతో మాట్లాడుతూ, "కొందరు ఊరు విడిచి వెళ్ళడానికి గ్రామంలో ఎవరూ ఒత్తిడి చేయలేదు. భయాందోళనల కారణంగా వారు గ్రామం విడిచి వెళ్లారు. ఇప్పుడు గుంటూరు నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చాం. ఎలాంటి సమస్య రాకుండా చూస్తాం. అందరూ సఖ్యతగా ఉండేందుకు కృషి చేస్తాం" అని వివరించారు.
 
రాజకీయ విబేధాలతో గ్రామంలో ఏర్పడిన సమస్య పరిష్కారానికి ఎవరూ మధ్యవర్తులుగా వ్యవహరించలేక పోవడం, పోలీసులు సక్రమంగా స్పందించకపోవడమే వివాదం ఈ స్థాయికి చేరడానికి ప్రధాన కారణాలని తన పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఓ స్థానికి ఉద్యోగి అభిప్రాయపడ్డారు. ఈ సమస్య పునరావృతం కాకుండా చూడాలని అంతా ఆశిస్తున్నామన్నారు.