మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 12 జనవరి 2021 (11:40 IST)

బర్డ్ ఫ్లూ: ఈ వైరస్ సోకితే చనిపోతారా? చికెన్ తింటే వస్తుందా? లక్షణాలు ఏమిటి?

భారత్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన రాష్ట్రాల జాబితా పెరుగుతోంది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పక్షులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తాజాగా దిల్లీలోని సంజయ్ లేక్‌లో బాతులు ఒక్కసారిగా చనిపోయాయి. వీటి నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ పరీక్షల్లో బాతులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలిందని దిల్లీ జంతు సంరక్షణ విభాగం అధికారులు వెల్లడించారు.

 
ఛత్తీస్‌గఢ్‌లోనూ భారీగా పక్షులు మరణిస్తున్నాయని, వాటి నామూనాలు పరీక్షల కోసం పంపించామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలోని ముంబయికి 500 కి.మీ. దూరంలోనున్న పర్బనీలో గత రెండు రోజుల్లో దాదాపు 800 పక్షులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీటి నమూనాలను కూడా పరీక్షల కోసం పంపించామని అధికారులు వెల్లడించారు. మరోవైపు పశువులకు ఇచ్చే టీకాల అందుబాటుపై సమీక్ష చేపట్టాలని పశు సంవర్ధక విభాగం అధికారులకు వ్యవసాయ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సూచించింది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ కమిటీ భేటీ అయ్యింది.

 
ప్రజలు అప్రమత్తంగా ఉండాలా?
ప్రజలు భయపడాల్సిన పనిలేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్‌ మనకు సోకకుండా అడ్డుకోవచ్చని వివరిస్తున్నారు.బర్డ్ ఫ్లూలో చాలా రకాలు ఉంటాయి. వీటిలో చాలావరకు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపలేవు. అయితే, ఈ వైరస్‌లలో కొన్ని మనుషులకు సోకే అవకాశముంటుంది. అయితే, భారత్‌లో ప్రస్తుతం మనుషులకు ఈ వైరస్ సోకినట్లు ఎలాంటి కేసులూ నిర్ధారణ కాలేదు. అయితే, పౌల్ట్రీల్లో పనిచేసేవారు, పక్షులతో ఎక్కువసేపు దగ్గరగా గడిపేవారు పీపీఈ కిట్లు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

 
మరోవైపు బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో పక్షులను స్థానిక ప్రభుత్వాలు వధిస్తున్నాయి. మిగతా పక్షులతోపాటు మనుషులకు ఈ వైరస్ సోకకుండా చర్యలు తీసుకుంటున్నాయి.

 
పక్షులకు ఈ వైరస్ ఎలా సోకుతుంది?
హెచ్5ఎన్1 లాంటి ఏవియెన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ సోకిన పక్షులకు దగ్గరగా వెళ్లినప్పుడు మిగతా పక్షులకు ఈ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ సోకి మరణించిన పక్షుల మృతదేహాలకు దగ్గరగా వెళ్లినప్పుడు కూడా బతికుండే పక్షులకు ఈ వైరస్ సంక్రమిస్తుంది. పక్షుల రెట్టల నుంచి కళ్లు, నోటి నుంచి వెలువడే ద్రవాల వరకు... అన్నింటిలోనూ ఈ వైరస్ జాడలు ఉంటాయి. కొన్ని పక్షుల్లో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అయితే వీటి వల్ల ఇతర పక్షులకు వైరస్ వ్యాపించే ముప్పు ఉంటుంది. వలస పక్షుల వల్ల ఇవి ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తుంటాయి.

 
మనుషులకు ఎలా సోకుతుంది?
ఈ వైరస్ సోకిన పక్షులకు సమీపంలో ఎక్కువ సేపు గడిపినప్పుడు ఎక్కువగా ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. ముఖ్యంగా పౌల్ట్రీల్లో పనిచేసేవారికి ఈ వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బర్డ్ ఫ్లూ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. అయితే, ఏదో ఒకరోజు ఈ వైరస్ కూడా జన్యు పరివర్తన చెంది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సామర్థ్యాన్ని సాధించొచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 
1918లో లక్షల మంది మరణాలకు కారణమైన స్పానిష్ ఫ్లూ ఇలానే పక్షుల నుంచి మనుషులకు సంక్రమించిందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. తాజా కోవిడ్-19 వైరస్ కూడా జన్యుపరివర్తన చెందడంతో మనుషుల మధ్య వ్యాపించగలిగే సామర్థ్యాన్ని సంపాదించగలిగింది.

 
ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పులు, జలుబు, వణుకు లాంటి లక్షణాలతో మనుషుల్లో బర్డ్ ఫ్లూ మొదలవుతుంది. సాధారణ ఫ్లూ లక్షణాలే బర్డ్ ఫ్లూ సోకినప్పుడూ కనిపిస్తాయి. వైరస్ సోకిన మూడు నుంచి ఐదు రోజుల తర్వాత ఈ లక్షణాలు ఒక్కసారిగా కనిపిస్తాయి.

 
చికిత్స ఏమిటి?
లక్షణాలు తగ్గేందుకు యాంటీవైరల్ ఔషధాలను వైద్యులు సూచిస్తారు. పారాసిటమాల్ లాంటి నొప్పి నివారిణులను కూడా ఇస్తుంటారు.

 
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎలాంటి ఫ్లూలు విజృంభిస్తున్నప్పుడైనా.. తరచూ చేతులు కడుక్కోవడం; దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు గుడ్డలు అడ్డుపెట్టుకోవడం లాంటి చర్యలతో ముప్పును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు, మరుగుదొడ్డి ఉపయోగించేటప్పుడు చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గు, తుమ్ములు లాంటి లక్షణాలు కనిపించే వారి నుంచి సామాజిక దూరం పాటించాలి. కోళ్లు, బాతులకు మీరు ఆహారం వేయొచ్చు. అయితే ఆహారం వేసిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చనిపోయిన, జబ్బు పడిన పక్షుల దగ్గరకు పోకూడదు.

 
చికెన్ తినొచ్చా?
శుభ్రంగా వండితే వైరస్ చనిపోతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. చికెన్, గుడ్లు శుభ్రంగా, పూర్తిగా వండేలా జాగ్రత్తలు తీసుకునేంత వరకు వీటి నుంచి ఎలాంటి ముప్పూ ఉండదు.