బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (13:30 IST)

చమోలీ గ్లేసియర్: ఉత్తరాఖండ్‌లో ఈ 'ప్రళయం' ఎందుకొచ్చింది?

ఆదివారం ఉత్తరాఖండ్‌లో జల ప్రళయం వచ్చిన ఈ ప్రాంతం చాలా మారుమూల ఉంటుంది. అందుకే, అది ఎలా జరిగుంటుంది అనేది చెప్పడానికి ఇప్పటివరకూ ఎవరి దగ్గరా స్పష్టమైన సమాధానం లేదు. హిమాలయాల్లో ఒక్క ఈ భాగంలోనే వెయ్యికి పైగా గ్లేసియర్స్ ఉన్నాయని గ్లేసియర్‌(హిమానీనదం)పై పరిశోధనలు చేస్తున్న నిపుణులు చెబుతున్నారు.

 
ఉష్ణోగ్రత పెరగడం వల్ల విశాలంగా ఉన్న ఒక గ్లేసియర్ కరిగి విడిపోయి ఉంటుందని, అలా దాన్నుంచి భారీ స్థాయిలో జల ప్రవాహం వచ్చిందని చెబుతున్నారు. గ్లేసియర్ వల్ల మంచు చరియలు పడి ఉండచ్చని, బండరాళ్లు, మట్టి విడిపోయి కిందికి వచ్చుండవచ్చని అంటున్నారు. "మేం వాటిని డెడ్-ఐస్ అంటాం. ఎందుకంటే ఈ గ్లేసియర్ కరిగి విడిపోయినపుడు వాటిలో సాధారణంగా పెద్ద పెద్ద బండరాళ్లు, రాళ్ల శిథిలాలు ఉంటాయి. శిథిలాలు కిందికి భారీస్థాయిలో ప్రవహించాయి కాబట్టి, అలా జరిగిందనడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది" అని డాక్టర్ డీపీ డోభాల్ చెప్పారు.

 
డీపీ డోభాల్ భారత ప్రభుత్వ వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ నుంచి ఇటీవలే రిటైర్ అయ్యారు. ఏదైనా ఒక గ్లేసియర్ సరస్సులో మంచు చరియలు విరిగి పడుంటాయని, దానివల్లే భారీ స్థాయిలో నీళ్లు కిందికి వచ్చాయని, వరద కూడా వచ్చిందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో అలాంటి గ్లేసియర్ సరస్సు ఏదీ ఉన్నట్టు సమాచారం లేదని మరికొంతమంది అంటున్నారు.

 
కానీ ఈమధ్య గ్లేసియర్‌ సరస్సు ఎంత త్వరగా ఏర్పడుతుంది అనేది కూడా మనం చెప్పలేమని డాక్టర్ డోభాల్ చెప్పారు. హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో గ్లేసియర్లు కరుగుతున్నాయి. దీంతో గ్లేసియర్ సరస్సులు ప్రమాదకరంగా విస్తరిస్తున్నాయి. ఎన్నో కొత్త సరస్సులు ఏర్పడ్డాయి. ఆ సరస్సుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరినపుడు, అది తన సరిహద్దులు దాటి పొంగుతుంది. దారిలో ఏవి ఉంటే వాటిని తనలో కలిపేసుకుంటూ ప్రవహిస్తుంది. అలా, దాని దారిలో పల్లెలు, రోడ్లు, వంతెనలు లాంటి మౌలిక సదుపాయాలు కూడా ఉంటాయి. ఇటీవల ఏళ్లలో ఈ ప్రాంతంలో ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి

 
మంచుచరియలు, కొండచరియలు నదికి అడ్డంగా పడిపోవడం వల్ల దాని ప్రవాహం కాసేపు ఆగిపోయి ఉండవచ్చని, నీటిమట్టం పెరిగి అది తెగడంతో హఠాత్తుగా భారీ స్థాయిలో నీళ్లు విడుదలై ఉంటాయని కూడా నిపుణులు భావిస్తున్నారు. హిమాలయ పర్వతాల్లో కొండ చరియలు పడి నదీ ప్రవాహం ఆగిపోవడం, తాత్కాలిక సరస్సులా ఏర్పడడం లాంటి ఘటనలు ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి. తర్వాత వాటిలో నీటిమట్టం పెరగడంతో అవి పొంగి పల్లెలు, వంతెనలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు లాంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలు కొట్టుకుపోయేలా చేస్తాయి.

 
2013లో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, ఇంకా చాలా ప్రాంతాల్లో జలప్రళయం వచ్చింది. అప్పుడు కూడా నిపుణులు ఎన్నో థియరీలు ఇచ్చారు. "చాలా కాలం గడిచిన తర్వాత.. ఛౌరాబారీ గ్లేసియర్ విరగడం వల్లే ఆ వరద వచ్చిందనే విషయాన్ని మేం కచ్చితంగా చెప్పగలిగాం" అని డాక్టర్ డోభాల్ చెప్పారు. ఉత్తరాఖండ్ అధికారులు ధౌలీగంగా నదిలో ఈ వరద ఎందుకు వచ్చిందో తెలుసుకోడానికి నిపుణుల బృందాన్ని కూడా పంపిస్తున్నారు.