బుధవారం, 29 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified మంగళవారం, 17 జనవరి 2023 (20:11 IST)

చైనా: 60ఏళ్లలో తొలిసారి తగ్గిన జనాభా, ఇది దేనికి సంకేతం

china flag
చైనా జనాభా గత 60 ఏళ్లలో మొదటిసారిగా తగ్గింది. పోయిన ఏడాది(2022)లో చైనా దేశ జనాభా సుమారు 8.50 లక్షలు తగ్గి 141.175 కోట్లుగా నమోదైంది. 2021లో ఇది 141.260 కోట్లుగా ఉంది. జననాల రేటు ప్రతి 1,000 మందికి 6.77గా నమోదైంది. 2021లో జననాల రేటు 7.52గా ఉంది. చైనా జననాల రేటు కొన్నేళ్లుగా క్షీణిస్తోంది. ఈ ధోరణి తగ్గించడానికి ఒకరినే కనాలనే విధానాన్ని 2016లో రద్దు చేసింది. 

 
2021లో అమెరికాలో ప్రతి 1,000 మందికి 11.06 జననాలు, బ్రిటన్‌లో 10.08 జననాలు నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించేందుకు సిద్ధంగా ఉన్న భారతదేశంలో అదే ఏడాది జననాల రేటు 16.42గా రికార్డ్ అయింది. చైనాలో గతేడాది తొలిసారిగా జననాల కంటే మరణాల రేటు పెరిగింది. 1976 తర్వాత చైనాలో అత్యధిక మరణాల రేటు 2022లో నమోదైంది. 1,000 మందికి 7.37 మరణాలు నమోదయ్యాయి. 2021లో ఇది 7.18గా ఉంది. ఇది దీర్ఘకాలంలో చైనా శ్రామిక శక్తిని తగ్గిస్తుంది. ఆరోగ్య సంరక్షణ, ఇతర ఖర్చులపై భారాన్ని పెంచుతుంది. జపాన్, దక్షిణ కొరియా వంటి ఇతర తూర్పు ఆసియా దేశాలలో కూడా జనాభా తగ్గిపోతోంది. వృద్ధాప్యం పెరుగుతోంది.

 
ఈ సంక్షోభంతో చైనా ఎలాంటి సవాళ్లు ఎదుర్కోనుంది?
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్‌లోని ప్రధాన ఆర్థికవేత్త యు సు దీనిపై స్పందిస్తూ "ఈ ధోరణి కొనసాగుతుంది. కోవిడ్ తర్వాత మరింత దిగజారవచ్చు" అని అభిప్రాయపడ్డారు. 2023 నాటికి చైనా జనాభా మరింత తగ్గిపోతుందని భావించే వారిలో సు ఒకరు. ‘నిరుద్యోగం పెరగడం, ఆదాయాలు తగ్గడం వంటి కారణాల వల్ల పెళ్లి చేసుకోవడం లేదా పిల్లలను కనడాన్ని వాయిదా వేస్తారు. అందువల్ల జననాల రేటు తగ్గుతుంది’ ఆమె అన్నారు. జనాభా పెరుగుదల నియంత్రించడానికి 1979లో ప్రవేశపెట్టిన వివాదాస్పద వన్-చైల్డ్ పాలసీ చైనా జనాభా దిశను మార్చేసింది.

 
నిబంధనలను ఉల్లంఘించిన కుటుంబాలకు జరిమానా విధించారు. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఉద్యోగాలు కూడా కోల్పోయారు. బాలికల కంటే అబ్బాయిలకు ప్రాధాన్యతనిచ్చే సంస్కృతిలో ఈ విధానం 1980ల నుంచి బలవంతపు అబార్షన్‌లు, లింగ నిష్పత్తి తేడాలకు దారితీసింది. 2016లో ఈ పాలసీని రద్దు చేసి పెళ్లయిన జంటలు ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతించారు. ఇటీవల చైనీస్ ప్రభుత్వం పడిపోతున్న జనన రేటును పెంచడానికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. వీటిలో పన్ను మినహాయింపులు, మెరుగైన ప్రసూతి ఆరోగ్య సంరక్షణ తదితరాలు ఉన్నాయి. కానీ, ఈ విధానాలు జననాలలో స్థిరమైన పెరుగుదలకు దారితీయలేదు. అయితే పనులకు వెళ్లే తల్లులకు ప్రసవాన్ని ప్రోత్సహించే విధానాలు పెద్దగా ప్రయోజనం ఇవ్వలేదు. పిల్లల సంరక్షణ, విద్య తదితరాలు ఇందులో లేకపోవడం కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 
చైనా పరిస్థితిపై అధ్యక్షుడు ఏం చెబుతున్నారు?
2022 అక్టోబరులో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ జనన రేటును పెంచడానికి ప్రాధాన్యతనిచ్చారు. బీజింగ్‌లో ఐదేళ్లకోసారి జరిగే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌ సభలో జిన్‌పింగ్ మాట్లాడుతూ.. వృద్దాప్య జనాభా పెరుగుతున్న నేపథ్యంలో తమ ప్రభుత్వం "చురుకైన జాతీయ వ్యూహాన్ని అనుసరిస్తుందని" ప్రకటించారు. పిల్లలను కనడానికి ప్రోత్సాహకాలను అందించడమే కాకుండా, చైనా గృహాలు, కార్యాలయాలలో లింగ సమానత్వాన్ని కూడా మెరుగుపరచాలని నిపుణులు సూచించారు. బుసరవాన్ సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఫ్యామిలీ అండ్ పాపులేషన్ రీసెర్చ్ డైరెక్టర్. ఇటువంటి నిర్ణయాలు సంతానోత్పత్తి రేటును మెరుగుపరుస్తాయని స్కాండినేవియన్ దేశాలు చేసి చూపించాయని ఆమె తెలిపారు. సింగపూర్ మాజీ చీఫ్ స్టాటిస్టిషియన్ పాల్ చియుంగ్ మాట్లాడుతూ జనాభా సమస్య పరిష్కరించడానికి చైనాకు పుష్కలమైన మానవశక్తితో పాటు సమయం కూడా ఉందని తెలిపారు. అయితే కేవలం జననాల రేటు పెంచడం వల్ల చైనా జనాభా వృద్ధి మందగమనం పరిష్కరించలేమని పరిశీలకులు అంటున్నారు.