శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 2 జూన్ 2020 (10:45 IST)

కరోనావైరస్: చనిపోయారని మృతదేహం అప్పగించారు, ఆ తర్వాత కోలుకున్నారు వచ్చి తీసుకెళ్లండని ఫోన్

గుజరాత్‌లోని అహమ్మదాబాద్ నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం నాడు జరిగిన ఘటన అందర్నీ నివ్వెరపరచింది. ఆస్పత్రిలో కోవిడ్-19 వ్యాధికి చికిత్స పొందుతున్న ఓ రోగి మరణించారంటూ ఆయన బంధువులకు ఆసుపత్రి వర్గాలు సమాచారం ఇచ్చాయి. ఓ రోజు గడిచిన తర్వాత అదే ఆస్పత్రి నుంచి మరో ఫోన్ వచ్చింది. ఈ సారి వచ్చిన సమాచారం ముందు ఇచ్చిన సమాచారానికి పూర్తి విరుద్ధంగా ఉంది.

 
వారి బంధువుకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, మీరు ఇంటికి తీసుకువెళ్లవచ్చన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. తీరా ఆస్పత్రికి వెళ్లిన తర్వాత ఆయన మృతికి సంబంధించిన డాక్యుమెంట్లను చేతుల్లో పెట్టారు. నికోల్ ప్రాంతానికి చెందిన 71 ఏళ్ల వయసున్న దేవ్రం భిస్కర్ డయాబెటిక్ రోగి. నాలుగు రోజుల క్రితం శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తగా ఆయన్ను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు.

 
ఆస్పత్రిలో చేర్చుకునే ముందే భిస్కర్ అల్లుడు నిలేష్ నిక్తేతో ఆస్పత్రి వర్గాలు ఆయనకు ఏదైనా జరగరానిది జరిగితే తమ బాధ్యత కాదంటూ ఓ లేఖ రాయించుకున్నారు. “మా మామయ్యను కోవిడ్-19 ఆస్పత్రిగా మార్చిన స్థానిక ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్చాం. ఆ సమయంలో నిర్వహించిన డయాబెటిక్ పరీక్షలో ఆయన షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా (575) ఉన్నాయి. నన్ను ఆ లెటర్‌పై సంతకం పెట్టమన్నప్పుడు నేను ఓ సారి ఆయన్ను చూడాలని అడిగాను. దాంతో ఆస్పత్రి సిబ్బంది వీడియో కాల్ ద్వారా ఆయన్ను చూపించారు. ఆయన్ను చూసిన తర్వాత నేను సంతకం పెట్టాను” అని నీలేష్ బీబీసీకి చెప్పారు.

 
వైద్యులు చికిత్స ప్రారంభించిన తర్వాత వారికి ఆయన ఆరోగ్యంపై ఆశలు చిగురించాయి. “అన్ని విధివిధానాలను పూర్తి చేసుకొని మేం ఇంటికి తిరిగి వచ్చాం. మర్నాడే కరోనావైరస్ కారణంగా ఆయన మరణించారంటూ ఆస్పత్రి నుంచి మాకు ఫోన్ వచ్చింది. ఆస్పత్రికి వెళ్లగానే నీలి రంగు పీపీఈ కిట్‌ చుట్టిన ఓ మృతదేహాన్ని మాకు అప్పగించారు. అయితే అప్పటికి ఇంకా ఆయన కరోనావైరస్ రిపోర్ట్ మాకు ఇవ్వలేదు. ఆయన వేసుకున్న దుస్తులు చూపించగానే ఆయన ముఖం కూడా చూడకుండా మా మామయ్య ఇక లేరని బాధపడ్డాం. ఆపై ఆయన అంత్యక్రియల హడావుడిలో పడిపోయాం” అని నీలేష్ చెప్పారు. దేవ్రం భిస్కర్ కుటుంబంలో ఆయన భార్య సహా ఆరుగురు కుటుంబసభ్యులున్నారు.

 
ఆయన బతికే ఉన్నారంటూ ఆస్పత్రి నుంచి ఫోన్
“ఓ రోజు గడిచిన తర్వాత మాకు ఆస్పత్రి నుంచి మరోసారి ఫోన్ వచ్చింది. మా మామయ్యకు కరోనావైరస్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని, ఆయన్ను సాధారణ వార్డులోకి మారుస్తున్నామని, ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని కూడా చెప్పారు” అని నీలేష్ బీబీసీతో అన్నారు. ఆ ఫోన్ కాల్‌తో మొత్తం కుటుంబం అంతా ఒక్కసారిగా నిర్ఘాంత పోయింది. ఆస్పత్రి వర్గాలు చెప్పినట్టు భిస్కర్ ప్రాణాలతోనే ఉంటే ముందు రోజు వాళ్లు ఎవరికి అంత్యక్రియలను నిర్వహించినట్టు?

 
ఇదే ప్రశ్నతో నీలేష్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి హుటాహుటిన చేరుకున్నారు. కానీ తీరా అక్కడికి వెళ్లాక అధికారులు భాస్కర్ చనిపోయారని చెప్పడమే కాదు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా వారికి అందజేశారు. దీంతో పొరపాటు జరిగి ఉంటుందనుకొని ఊసురుమంటూ ఇంటికి వచ్చిన నీలేష్ కుటుంబ సభ్యులు ఆ వార్తను తమ కుటుంసభ్యులకు చేరవేయడంలో బీజీ అయిపోయారు.

 
అక్కడితో ఈ ఘటన ముగిసిపోలేదు. మళ్లీ ఆదే ఆస్పత్రి నుంచి వారికి మరో సారి ఫోన్ వచ్చింది. దేవ్రం ఆరోగ్యం మెరుగుపడుతోందన్నది ఆ ఫోన్ సారాంశం.