బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 7 అక్టోబరు 2020 (13:21 IST)

కరోనావైరస్: భారతదేశంలో కోవిడ్-19 వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?

భారతదేశంలో సెప్టెంబరు ఆఖరి వారంలో సగటున రోజుకి 86,000 నమోదైన కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతూ అక్టోబరు మొదటి వారం నాటికి రోజుకి 64000 కి చేరాయి. సెప్టెంబరు మొదటి వారంలో రోజుకి 93,000 నమోదయిన కేసుల సంఖ్యతో పోల్చి చూస్తే ఇప్పుడు తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు.

 
అలా అని పరీక్షల సంఖ్య కూడా తగ్గలేదు. ఆగస్టు నెలలో రోజుకు 70,000 శాంపిళ్లను పరీక్షించగా, అక్టోబరు నాటికి రోజువారీ పరీక్షల సంఖ్య 11 లక్షలకు చేరింది. గత నెలలో రోజుకు 10 లక్షల 50 వేల శాంపిళ్లను పరీక్షించారు. ఈ లెక్కలను బట్టి చూస్తే దేశంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందనే చెప్పవచ్చు. అయితే కొంత మంది ఎపిడెమాలజిస్టులు ఈ సంఖ్యను జాగ్రత్తగా పరిశీలించాలని చెబుతున్నారు.

 
ఇటీవల తగ్గుముఖం పడుతున్న కేసులు, మరణాల సంఖ్య కోవిడ్ తగ్గుతుందనే నమ్మకాన్ని కలిగిస్తున్నప్పటికీ, మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పడుతోందని చెప్పలేమని వారంటున్నారు. కేవలం అధిక సంఖ్యలో చేస్తున్న పరీక్షలు, తగ్గుతున్న కేసుల ఆధారంగా ఒక నిర్ణయానికి రాలేమన్నది వారి అభిప్రాయం.

 
రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేయడం ఖర్చు తక్కువగా కూడుకున్నది మాత్రమే కాకుండా, సత్వర ఫలితాలను కూడా ఇచ్చేవిగా ఉండటంతో దేశంలో సగానికి పైగా వీటినే నిర్వహిస్తున్నారు. అయితే, వీటి ఫలితాలను పూర్తిగా నమ్మలేం. ఈ పరీక్షల ఫలితాల ఖచ్చితత్వం 50 శాతం కంటే తక్కువే ఉంటోంది.

 
పోలిమరీజ్ చెయిన్ రియాక్షన్ (పీసీఆర్) పరీక్షను అత్యధిక ప్రమాణాలతో కూడుకున్న కోవిడ్ పరీక్షగా చెబుతారు. దీని ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుంది. పరీక్ష ఫలితాలు రావడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఈ రాపిడ్ పరీక్షలలో వస్తున్న ఫలితాల ఆధారంగా దేశంలో కోవిడ్ కేసులు ఎంత వరకు నిజంగా తగ్గు ముఖం పడుతున్నాయనేది స్పష్టంగా చెప్పలేమని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్ చెప్పారు.

 
ప్రభుత్వం నిర్వహిస్తున్న పీసీఆర్, యాంటిజెన్ పరీక్షల డేటా కచ్చితంగా విడుదల చేస్తేనే శాస్త్రవేత్తలు కేసులు అంచనా వేయడటం వీలవుతుందంటారు ఆయన. అలాగే, ప్రభుత్వం కోవిడ్ లక్షణాలు లేని వారికి కూడా అవసరమైతే పరీక్షలు నిర్వహించవచ్చనే అనుమతిని ఇవ్వడంతో, లక్షణాలు లేని వారికి జరుగుతున్న పరీక్షల సంఖ్య కూడా పెరుగుతూ ఉండవచ్చని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు.

 
మరోవైపు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న యాంటీ బాడీ సర్వేలు, ఎపిడెమియలాజికల్ నమూనాలు దేశంలో వైరస్ సోకని వారి సంఖ్య ఎక్కువగానే ఉందని సూచిస్తున్నాయి. భారతదేశంలో ఇప్పటికే 12 నుంచి 13 కోట్ల మంది ఇన్ఫెక్షన్ కి గురై ఉంటారని మిషిగన్ యూనివర్సిటీలో ఎపిడెమియోలజీ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ అంచనా వేశారు. అది దేశ జనాభాలో 10 శాతం మాత్రమే. దేశ వ్యాప్తంగా నిర్వహించిన యాంటీ బాడీ పరీక్షల్లో సుమారు 9 కోట్ల మంది ప్రజలకు ఇప్పటికే వైరస్ సోకినట్లు తేలింది. ఇది అధికారికంగా నమోదైన కేసుల సంఖ్య కంటే 15 రెట్లు ఎక్కువ.

 
"ఈ వైరస్ కార్చిచ్చులా వ్యాపించడానికి ఇంకా చాలా అవకాశం ఉంది’’ అని డాక్టర్ ముఖర్జీ చెప్పారు. "దీనినిప్పుడు నెమ్మదిగా కాలుతున్న నిప్పులా ఉంచటమే మంచిది. వైద్య రంగం కూడా శక్తి సామర్థ్యాలు కూడదీసుకుని తిరిగి పని చేయడానికి కాస్త సమయం కావాలి" అన్నారామె.

 
మహమ్మారి తగ్గు ముఖం పడుతుందని చెప్పడానికి ఏది ఉత్తమమైన మార్గం?
మరణాల సంఖ్యను పరిశీలించాలని డాక్టర్ రెడ్డి చెబుతున్నారు. "కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతోందనే వాదన ఉన్నప్పటికీ , గత ఏడు రోజుల నుంచీ నెమ్మదిగా తగ్గుతూ వస్తున్న కోవిడ్ మరణాల రేటు.. కేసుల సంఖ్య తగ్గుతుందనే సంకేతాన్నిస్తోంది. దీనిని జాగ్రత్తగా పరిశీలించాలి" అని ఆయన పేర్కొన్నారు.

 
ఏ మహమ్మారి అయినా వెలుగు చూడటం, పెరగటం, అత్యధిక స్థాయికి చేరడం, తగ్గు ముఖం పట్టడం అనే నాలుగు దశల్లో ఉంటుందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ శాస్త్రవేత్త ఆడమ్ కుకార్స్కి చెప్పారు. కొన్ని కేసులలో ఈ స్థాయిలు పలు మార్లు కనిపిస్తూ ఉంటాయి. యూకేలో 2009లో స్వైన్ ఫ్లూ తలెత్తినప్పుడు వేసవి మొదట్లో బాగా పెరిగి, జులై కల్లా తీవ్ర స్థాయికి చేరింది. ఇది మళ్ళీ పెరిగి అక్టోబరు చివరి నాటికి తీవ్ర స్థాయికి చేరింది.

 
కోవిడ్ కేసులు అత్యధికంగా నమోదయిన దేశాలైన అమెరికా, యుకె, రష్యా, ఫ్రాన్స్ దేశాలను పరిశీలిస్తే అమెరికాలో మూడవ దశ పెరుగుదల కనిపిస్తోందని ఎపిడెమియాలజిస్టులు చెబుతున్నారు. అలాగే 22 రాష్ట్రాలలో కేసుల సంఖ్య పెరుగుతోంది. మిగిలిన దేశాలలో కేసుల సంఖ్య రెండవ దశ పెరుగుదలలో ఉన్నాయి.

 
"ప్రస్తుతం కలుగుతున్న భద్రతా భావన కేవలం తాత్కాలికం, అశాశ్వతం" అని డాక్టర్ ముఖర్జీ అంటారు. భారతదేశంలో పండగల సీజన్ మొదలవుతోంది. ఈ సమయంలో చాలా కుటుంబాలు పండుగ జరుపుకోవడానికి కలుసుకుంటారు. దీంతో, మరో రెండు వారాలలో మళ్ళీ కేసులు విపరీతంగా వ్యాపించే ప్రమాదం ఉందని ఆమె అన్నారు.

 
"ఇప్పుడున్న పరిస్థితి అదుపులోకి వచ్చి అన్నీ సక్రమంగా ఉన్నాయని అనుకోవడానికి లేదు" అని ముఖర్జీ అన్నారు. "ప్రపంచంలో కనీసం సగం జనాభాకి వ్యాక్సీన్ లభించేవరకూ కాస్త ఆగడం, తిరిగి మొదలు పెట్టడం, మళ్లీ ప్రయాణం చేయడం మొదలు పెట్టే సరికొత్త పద్ధతికి అలవాటు పడాల్సిందే. దురదృష్టవశాత్తు అదే నిజం" అని ఆమె అన్నారు. అందుకే, మాస్కు ధరించండి, చేతులు శుభ్రపరుచుకోండి, రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండండి.