మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (10:46 IST)

లక్షల్లో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు - తెలంగాణాలోనూ అంతే..

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులో లక్షల్లో పెరిగిపోతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో కూడా కొత్త కేసుల నమోదులో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ఇటు దేశం, అటు తెలంగాణాల్లో ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుని దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 67 లక్షల మార్కును చేరుకుంది.  
 
ఇక మంగళవారం ఒక్క రోజులో ఏకంగా 72,049 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 67,57,132కు చేరుకుంది. వీటిలో 9,07,883 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. 57,44,694 మంది కోలుకోగా నిన్న 986 మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు. తాజా మరణాలతో కలుపుకుని ఇప్పటివరకు 1,04,555 మరణాలు సంభవించాయి.
 
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 2,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,04,748కి పెరిగింది. అలాగే, మంగళవారం ఒక్క రోజే కరోనా మహమ్మారి కారణంగా 8 మంది మృతి చెందారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,189 మంది మరణించారు.
 
గత 24 గంటల్లో 2,239 మంది కోలుకోవడంతో ఈ సంఖ్య 1,77,008కి పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 26,551 కేసులు యాక్టివ్‌గా ఉండగా, వీరిలో 21,864 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. మంగళవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 54,277 కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 33,46,472కు పెరిగింది.