ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే కరోనా ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. "చాలా దేశాలు ఇప్పుడు తప్పుడు మార్గంలో పయనిస్తున్నాయి'' అని సంస్థ డైరక్టర్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రియేసస్ అన్నారు. సరైన నిబంధనలు పాటించని దేశాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
ప్రస్తుతం అమెరికా కోవిడ్-19 వైరస్‌కు కేంద్రంగా మారింది. అధ్యక్షుడు ట్రంప్‌కు, వైద్య ఆరోగ్య శాఖ మధ్య విభేదాలు కొనసాగుతుండగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 30 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, 135,000 మరణాలతో అమెరికా కరోనా వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశంగా నిలిచింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది?
వివిధ ప్రభుత్వాధినేతలు చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలను చూస్తే, వారు మహమ్మారిని అదుపు చేయగలరన్న నమ్మకం ప్రజల్లలో కలగడం లేదని సోమవారం జెనీవాలో డాక్టర్ టెడ్రోస్ వ్యాఖ్యానించారు. "వైరస్ ఇప్పటికీ మనిషికి ప్రథమ శత్రువుగానే ఉంది. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు దానిపై ఏమాత్రం ప్రభావం చూపుతున్నట్లు లేదు'' అని ఆయన అన్నారు.
"సామాజిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం లాంటి కనీస జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంది. లేకపోతే సమీప భవిష్యత్తులో గతకాలపు పరిస్థితులను తీసుకురావడం కష్టం'' అన్నారు టెడ్రోస్. "కనీస నిబంధనలు పాటించకపోతే ఈ వైరస్‌ను అరికట్టడం అసాధ్యం. అది అలా వ్యాపిస్తూనే ఉంటుంది'' అన్నారు టెడ్రోస్. "ఇది దారుణాతిదారుణంగా పరిణమిస్తుంది'' అన్నారాయన.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరక్టర్ డాక్టర్ మైక్ ర్యాన్ కూడా వ్యాధి వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు. "అమెరికాలో కొన్నిచోట్ల లాక్‌డౌన్ ఎత్తివేయడం, వ్యాపారాలకు అనుమతి ఇవ్వడం వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి అవకాశమిస్తోంది'' అని ఆయన అన్నారు. లాటిన్ అమెరికా దేశాలలో ఇప్పటి వరకు 145,000 కోవిడ్-19 సంబంధిత మరణాలు సంభవించాయి. సరైన టెస్టింగ్ జరగడం లేదు కాబట్టి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇందులో సగం మరణాలు ఒక్క బ్రెజిల్‌లోనే జరిగాయి.
కానీ ఆ దేశాధ్యక్షుడు బోల్సొనారో మాత్రం లాక్‌డౌన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. "పెద్ద పెద్ద ప్రాంతాలను మూసేయడం వల్ల ఆర్ధికంగా నష్టం ఉండొచ్చు. కానీ వైరస్‌వ్యాప్తిని అరికట్టడానికి కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్ తప్పదు'' అన్నారు డాక్టర్ ర్యాన్. "ప్రజలు కచ్చితంగా సమస్య తీవ్రతను అర్ధం చేసుకుంటారు. ప్రభుత్వాధినేతలు వైరస్‌ను నిరోధించడానికి ఇంకా కఠినమైన చర్యలను, పక్కా ప్రణాళికలను సిద్ధం చేయాలి'' అని ర్యాన్ అన్నారు .
వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది? వ్యాధి నిరోధకత ఎన్నాళ్లుంటుంది?
"వైరస్‌తో కలిసి జీవించడం మనం నేర్చుకోవాలి'' అన్నారు ర్యాన్. రాబోయే కొద్దినెలల్లో వ్యాక్సిన్ వస్తుంది అనుకోవడం అత్యాశే అన్నారాయన. అలాగే కరోనా వైరస్ సోకిన తర్వాత దాన్నుంచి బైటపడటం అంటే వ్యాధి నిరోధకత సాధించినట్లు కాదన్నారు ర్యాన్. ఒకవేళ అది వ్యాధి నిరోకత వల్లే అయినా, ఆ శక్తి ఎన్నాళ్లుంటుందో చెప్పలేమని అన్నారు.
వ్యాధి నిరోధక చాలా కొద్దికాలమే ఉంటుందని లండన్‌లోని కింగ్స్ కాలేజీ నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. ఈ రీసెర్చ్ రిపోర్టును సోమవారంనాడు విడుదల చేశారు. ఈ పరిశోధన కోసం 96మందిని ఎంచుకున్న రీసెర్చ్ టీమ్, వారిలో యాంటీ బాడీస్ ఎలా తయారయ్యాయి.. కోలుకున్న తర్వాత శరీరంలో అవి ఎన్నాళ్లు ఉన్నాయి అన్నది పరిశీలించింది. బాధితుడు కోలుకున్న మూడు నెలల తర్వాత యాంటీబాడీస్ క్షీణించడం మొదలు పెట్టాయని ఈ పరిశోధకులు గుర్తించారు.
10 సంవత్సరాలలోపు పిల్లలపై కోవిడ్-19 ప్రభావం చాలా స్వల్పంగా ఉందని, 10ఏళ్లు దాటిన వాళ్లు తమకంటే చిన్నవాళ్లకన్నా ఎక్కువ ప్రభావానికి గురయ్యారని కూడా పరిశోధనలో తేలినట్లు ప్రపంచ ఆరోగ్యం సంస్థ వెల్లడించింది. అయితే వ్యాధివ్యాప్తికి చిన్నారులు ఎంత వరకు కారకులవుతారన్నది మాత్రం తెలియరాలేదు.