శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 23 జూన్ 2021 (13:11 IST)

కోవిడ్: పిల్లల్ని బడికి పంపాలా వద్దా? తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో తల్లిదండ్రుల్లో ఆందోళన

హైదరాబాద్‌కు చెందిన భారతి రెడ్డికి ముగ్గురు పిల్లలు. పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంటే మిగిలిన ఇద్దరు పిల్లలు 4, 6 తరగతులు చదువుతున్నారు. ఆన్‌లైన్ క్లాసుల కారణంగా పిల్లల క్లాస్ బ్రేక్ వచ్చినప్పుడల్లా వారికి బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్, లంచ్ సమయానికి అందివ్వడానికి పరుగులు తీయడమే ఇప్పుడు భారతి పనిగా మారింది. ఇది కేవలం ఆమె ఒక్కరి దినచర్య మాత్రమే కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటి బాధ్యతలు చూసుకునే ప్రతి తల్లి పరిస్థితి ఇలాగే ఉంది.

 
"స్కూల్ లేకపోవడంతో పిల్లల టైమ్ టేబుల్ మాత్రమే కాదు.. మా ఇంటి బడ్జెట్ కూడా మొత్తం మారిపోయింది. 2నెలల క్రితం పిల్లలతో పాటు కుటుంబ సభ్యులందరం కరోనా బారిన పడ్డాం. పిల్లలకు కూడా కోవిడ్ వస్తోందన్న భయం మాలో ఇంకా పోలేదు. అలాంటిది ఓ వైపు మూడో వేవ్ వస్తుందని నిపుణులు చెబుతూ ఉంటే, ఇప్పుడు స్కూల్‌కి ఎలా పంపించగలం? పైగా మా పిల్లలు తరచూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంటారు . సంవత్సరం వృథా అయిన ఫరవాలేదు కానీ పిల్లలని స్కూల్‌కి ఇప్పుడయితే పంపను. కరోనా తగ్గినప్పుడు చూద్దాం. పిల్లల జీవితమే నాకు ముఖ్యం" అని భారతి బీబీసీతో అన్నారు.

 
అయితే ఇలాంటి ఆందోళన ఈ ఒక్క మహిళది మాత్రమే కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకుంది. దశల వారీగా తరగతులు ప్రారంభించాలని యోచిస్తోంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 8, 9, 10 తరగతులు, అదే నెల 20 నుంచి 6, 7 తరగతుల విద్యార్థులకు ముఖాముఖి బోధన ప్రారంభించాలని అనుకుంటున్నారు. మిగిలిన తరగతులకు కూడా మరో నెల, నెలన్నర రోజుల తేడాలో ప్రారంభించే అవకాశం ఉంది.

 
ఈ నిర్ణయం స్కూల్‌కి వెళ్లే పిల్లలున్న ప్రతి తల్లి, తండ్రిని మాత్రమే కాదు అటు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల్లోనూ గుబులు పుట్టిస్తోంది. హైదరాబాద్‌లోని బచ్‌పన్ ప్లే స్కూల్ ప్రిన్సిపల్ లలిత ఇదే విషయంపై బీబీసీతో మాట్లాడారు. ఒకప్పుడు 200 మంది విద్యార్థులు ఉన్న మా స్కూల్‌లో కరోనా వల్ల ఇప్పుడు కేవలం 32 మంది చిన్నారులే ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నారు. స్కూల్ ఇప్పట్లో తెరిచే ప్రసక్తే లేదు. కనీసం అక్టోబర్, నవంబర్ వరకు స్కూల్ తెరవాల్సిన అవసరం లేదని అనుకున్నాం అని ఆమె చెప్పారు.

 
ఈ సమయంలో ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేస్తుందని ఊహించలేదు. చిన్నారులకి ఇంకా వ్యాక్సీన్ రాలేదు . అసలు పిల్లల తల్లిదండ్రులు అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. ఒకవేళ స్కూల్ తెరిస్తే పిల్లల్ని 6 అడుగుల దూరం పాటించాలని ఎలా చెబుతాం" అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ ఏడాది కూడా ఆన్‌లైన్ తరగతులకే సిద్ధం కావాలంటూ తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని ముందే సిద్ధం చేసిన కార్పొరేట్ పాఠశాలలు ఈ ఏడాది స్కూల్ తెరిస్తే మళ్లీ హైబ్రిడ్ మోడల్‌పైనే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

 
"గత ఏడాది మేం పెద్ద క్లాసులలో చదువుతున్న విద్యార్థులను రెండేసి బృందాలుగా విభజించి రోజు మార్చి రోజు 50 శాతం విద్యార్థులకు ప్రత్యక్ష బోధన, మిగిలిన వారికి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాం. శుక్రవారం మాత్రం అందరికీ ఆన్‌లైన్ క్లాసులే నిర్వహించాం" అని బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ స్కంద బాలి బీబీసీతో అన్నారు. ప్రైమరీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలని స్కూల్‌కి పంపడానికి భయపడుతుండడం వాస్తవమే. అయితే అమెరికాలో మొదట చిన్న పిల్లలకే స్కూల్స్ ఓపెన్ చేశారు. దానికి కారణం వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందన్న వాదన కావచ్చు.

 
పిల్లల వ్యాక్సినేషన్ అయ్యేదాక పాఠశాలలు తెరవకుండా ఉండటమే మేలు. కానీ ప్రభుత్వ ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి" అని స్కంద బాలి అన్నారు. అటు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలదీ అదే మాట. తెలంగాణ ఉపాధ్యాయుల సంఘం హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇఫ్తేకారుద్దీన్ దీనిపై బీబీసీతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను ఇప్పటికీ వ్యాక్సినేషన్ సెంటర్లగా, కోవిడ్ సెంటర్లగా వాడుకుంటున్నారు. పాఠశాలలను తిరిగి ప్రారంభించాలంటే వెంటనే వాటిని పూర్తిగా శానిటైజ్ చేయాలి.

 
ఒక్కొక్క బెంచ్ మీద ప్రస్తుతం ముగ్గురు నలుగురు పిల్లలు కూర్చుంటున్నారు. ఒక్కక్కరికీ ఒక్కో బెంచ్‌పై కూర్చోబెట్టడం సాధ్యం కాదు కదా. అలా అని రోజు మార్చి రోజు తరగతులంటే సిలబస్ ఎలా పూర్తి చేయాలి? బాత్రూమ్ విషయానికి వచ్చేసరికి ఒక విద్యార్థి వాడుకున్న 15 నిమిషాల వరకు ఇంకొకరు వెళ్లకూడదని అంటున్నారు. పైగా వాటిని తరచూ శుభ్రం చేయాల్సి ఉంటుంది.

 
ఆ స్థాయిలో స్టాఫ్ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ ఉన్నారు? అందరికీ ఒకే టైమ్‌లో లంచ్ లేక బ్రేక్ ఉంటుంది. ఇన్ని ఇబ్బందుల మధ్య స్కూల్ ఎలా తెరవగలుగుతాం? ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు కరోనా కారణంగా ఇప్పటికే నష్టపోయారన్న మాట వాస్తవమే. కానీ అలాగని వారి ఆరోగ్యం, జీవితాలను నిర్లక్ష్యం చేయలేం కదా?" అని తెలంగాణ ఉపాధ్యాయుల సంఘం హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇఫ్తేకారుద్దీన్ బీబీసీతో అన్నారు. పిల్లల వైద్యులు కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు.

 
వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టి సారించి, ఆ తర్వాత స్కూల్ తెరిస్తే బాగుంటుంది అంటున్నారు పిడియాట్రిషన్ డాక్టర్ రంగయ్య. "కేసులు తగ్గాయి కానీ జీరో కాలేదుగా. ఇంకో నెల అయిన కఠిన ఆంక్షలు ఉంచాల్సింది. రెండో దశలో చిన్నారులకు కరోనా సోకడం చూసాం. మూడో దశ ఎలా ఉండబోతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. పిల్లలకి వ్యాక్సీన్ వస్తేనే లేక పిల్లలు ఉండే ఇంట్లో అందరికీ , అలాగే స్కూల్ స్టాఫ్ అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయితేనే విద్యార్థులకు రక్షణ" అని డాక్టర్ రంగయ్య అన్నారు.

 
గత ఏడాది మొదటి వేవ్ తర్వాత పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించడంతో ఒక్కసారిగా పిల్లల్లో కోవిడ్ కేసులు ఎక్కువయ్యాయి. ఆ తర్వాత పాఠశాలలకు సెలవులు ప్రకటించి మళ్లీ ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని తరగతుల్ని ప్రారంభించినా పిల్లలు గంటల తరబడి మాస్కు పెట్టుకొని ఉండటం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, స్కూలంతా రోజూ శానిటైజ్ చేయడం వంటివి సాధ్యమేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

 
ఈ ప్రశ్నలన్నీ అటు తల్లిదండ్రుల్ని, ఇటు ఉపాధ్యాయుల్ని వేధిస్తున్నాయి. ఈ విషయాలపై ముందుగా వారికి అవగాహన కలిగించి, తల్లిదండ్రులందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యిందా లేదా అన్న సమాచారాన్ని సేకరించి, పాఠశాల సిబ్బంది మొత్తానికి వ్యాక్సినేషన్ పూర్తి చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.