శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 19 ఏప్రియల్ 2021 (20:18 IST)

కోవిడ్ వ్యాక్సీన్: మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా, కేంద్రం ప్రకటన

మే నెల 1 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృత స్థాయిలో అందరికీ వర్తించేలా ఉంటుందని కేంద్ర ఆరోగ్య - కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

 
మూడో దశ వ్యాక్సినేషన్ వ్యూహంలో భాగంగా దేశంలోని వ్యాక్సీన్ ఉత్పత్తిదారులు కేంద్ర ఔషధ ప్రయోగశాల విడుదల చేసిన డోసుల్లో 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 50 శాతం డోసులను వారు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓపెన్ మార్కెట్‌కు ఇవ్వొచ్చని ప్రభుత్వం ఆదేశించింది.

 
కేంద్ర ప్రభుత్వం తనకు లభించిన వాటాలోని టీకాల డోసులను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయిస్తుంది. ఈ కేటాయింపులు ఆయా రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి తీవ్రతను ఆధారంగా చేసుకుని నిర్ణయిస్తారు.

 
వ్యాక్సీన్ డోసులను 50 శాతం కేంద్రానికి, 50 శాతం ఓపెన్ మార్కెట్‌కు ఇవ్వడమనే నిబంధన భారతదేశంలోని అన్ని వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలకు వర్తిస్తుంది. అయితే, పూర్తిగా వినియోగానికి సిద్ధంగా దిగుమతి అయిన టీకాలను ప్రభుత్వేతర మార్గాలలో ఉపయోగిస్తారని కేంద్రం ప్రకటించింది.