జర్మనీ: డ్రెస్డెన్ గ్రీన్ వాల్ట్ మ్యూజియం నుంచి వజ్రాలు చోరీ
జర్మనీలోని డ్రెస్డెన్ గ్రీన్ వాల్ట్‌లో మూడు వజ్రాభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఈ చారిత్రక ఆభరణాలు 37 భాగాలుగా ఉంటాయి. దొంగలు వాటిని విరగ్గొడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. సోమవారం వేకువన జరిగిన ఈ దొంగతనంలో ఏమేం పోయాయి.. ఎంత విలువైన వస్తువులు పోయాయన్నది అధికారులు ఇంకా లెక్కిస్తున్నారు.
ప్రపంచంలోని ప్రాచీన మ్యూజియంలలో ఒకటైన గ్రీన్ వాల్ట్‌ను సాక్సొనీ పాలకుడు 'అగస్టస్ ది స్ట్రాంగ్' 1723లో ఏర్పాటుచేశారు. ఇక్కడున్న 10 వజ్రాల సెట్లలో మూడు చోరీ అయినట్లు మ్యూజియం హెడ్ మరియన్ అకర్‌మన్ చెప్పారు. వజ్రాల సెట్లతో పాటు కొన్ని కెంపు, పచ్చ, నీలం హారాలూ మాయమైనట్లు చెబుతున్నారు.
దొంగలు ఎలా చొరబడ్డారు?
మ్యూజియం గ్రౌండ్ ఫ్లోర్‌లోని కిటికీకి ఉన్న ఇనుప ఊచలను దొంగలు తొలగించి, అద్దాన్ని పగలగొట్టి ఆ ఖాళీలోంచి లోపలికి ప్రవేశించారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో మ్యూజియం సమీపంలోని ఒక ఎలక్ట్రిసిటీ జంక్షన్ బాక్స్‌లో మంటలను అదుపు చేయాలంటూ తమకు కాల్ వచ్చిందని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు.
ఆ బాక్సులో మంటల వల్ల మ్యూజియంలోని అలారం వ్యవస్థ, కొన్ని వీధి దీపాలు పనిచేయకపోయి ఉంటాయని.. అక్కడి మంటలకు దొంగలే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించగా చీకట్లో ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. అయితే, ఈ దొంగతనంలో ఇంకా ఎక్కువ మంది పాత్ర ఉండొచ్చని భావిస్తున్నారు. డ్రెస్డెన్‌లో సోమవారం ఉదయం ఓ కారు తగలబడింది.. దొంగలు అదే కారును వినియోగించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోయిన వస్తువుల విలువ ఎంతుంటుంది?
పోయిన ఆభరణాలు అమూల్యమైనవని, ఇంత ధర చేస్తాయని వాటికి వెలకట్టలేమని అకర్‌మన్ చెప్పారు. అవన్నీ ప్రముఖ ఆభరణాలు కావడంతో బయట ఎక్కడా విక్రయించలేరనీ చెప్పారు. వస్తువులుగా వాటికున్న విలువ కంటే సాంప్కృతికంగా వాటి విలువ ఎంతో ఎక్కువ ఉంటుందన్నారు. అయితే, ప్రముఖ జర్మన్ పత్రిక బిల్డ్ వీటి విలువ 85 కోట్ల పౌండ్లు ఉంటుందని రాసింది.
గ్రీన్ వాల్డ్ కథ ఇదీ..
ఒకప్పటి ఈ రాజుల కోటలోని ఎనిమిది ఆభరణాల గదుల్లో అమూల్యమైన ఆభరణాల కలెక్షన్ ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో బాంబు దాడుల్లో ఇందులోని మూడు గదులు ధ్వంసమయ్యాయి. ఆ తరువాత మళ్లీ మ్యూజియంను పునరుద్ధరించారు.
ఇందులోని కొన్ని గదుల గోడలకు ముదరు ఆకుపచ్చ రంగు వర్ణం ఉండడంతో దీన్ని గ్రీన్ వాల్ట్‌గా పిలుస్తారు. ఇక్కడ 3 వేల ఆభరణాలున్నాయి. ఇక్కడున్న అత్యంత విలువైన వస్తువుల్లో 41 క్యారట్ల ఆకుపచ్చ డైమండ్ ఒకటి. ప్రస్తుతం అది న్యూయార్క్ ప్రదర్శనలో ఉంది.