శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 30 మే 2022 (14:16 IST)

కోనసీమకు ఆ పేరు ఎలా వచ్చింది?

Konaseema
కోనసీమ.. ఇటీవల కాలంలో ఈ పేరు చుట్టూ చర్చ సాగుతోంది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటయిన కొత్త జిల్లాకు కోనసీమ పేరు మాత్రమే ఉంచాలని కొందరు, కోనసీమకు ముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుని కూడా జోడించాలని మరికొందరు పట్టుబడుతున్నారు. పేరు విషయంలో ఏర్పడిన వివాదం విధ్వంసానికి, హింసాకాండకు దారితీసింది. ఈ నేపథ్యంలో అసలు కోనసీమ అనే పేరు ఎలా వచ్చింది, ఈ ప్రాంతం ప్రత్యేకంగా ఎలా మారిందనే విషయాల్లో ఆసక్తి నెలకొంది.

 
స్వరూపమిదే..
ఉభయ తెలుగు రాష్ట్రాలకు ప్రధాన నీటివనరుగా ఉన్న గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతమే కోనసీమ. రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరిగా పిలిచే ఆ నదీ ప్రవాహం ఆ తర్వాత దిశ మారుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దిగువన పలు పాయలుగా మారుతుంది. అందులో వశిష్ఠ, వైనతేయ, గౌతమీ పాయల మధ్య ప్రాంతమే కోనసీమ. నదీ పాయల మధ్య దీవుల సముదాయంలా కోనసీమ కనిపిస్తుంది. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకుని ఉంటుంది. జిల్లాల విభజనకు ముందు 16 మండలాలతో కోనసీమ ఉండేది. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉండేది.

 
అమలాపురం పార్లమెంట్ స్థానం ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లా ఏర్పాటు కావడంతో ప్రస్తుతం 21 మండలాలతో ఇది ఉంది. అందులో 9 మండలాలు సముద్రంతీరంలో ఉన్నాయి. గోదావరి నదీ ప్రవాహపు ఒండ్రుమట్టితో సారవంతమైన నేలలకు కోనసీమ ప్రసిద్ధి. వ్యవసాయ, వాణిజ్య పంటలతో పాటు ఆక్వా సాగులోనూ అభివృద్ధి సాధించింది. సగటున 1,280.0 మి.మీ. వర్షపాతం నమోదవుతుంది. దాంతో నీటి వనరులకు లోటులేని ప్రాంతంగా చెబుతారు. 20 ఏళ్ల క్రితం గౌతమీ నదీ పాయపై యానాం- ఎదుర్లంక వద్ద నిర్మించిన వంతెనకు పూర్వం ఇక్కడ తగిన రవాణా సదుపాయాలు లేవు.

 
అంతకుముందు జాతీయ రహదారి విషయంలో కూడా రావులపాలెం మీదుగా ఎన్‌హెచ్ 16 ఉండడం కొంత కలిసివచ్చింది. ఆ తర్వాత ఎన్‌హెచ్ 216ని అమలాపురం మీదుగా అభివృద్ధి చేస్తున్నారు. రైలు మార్గం ఏర్పాటు చేయాలని అనేక ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి. నిధుల మంజూరులో జాప్యం కారణంగా కోనసీమలో రైలు కూత ఆలస్యమవుతోంది. పారిశ్రామికంగా ఈ ప్రాంత అభివృద్ధికి అవకాశాలున్నాయి. ముఖ్యంగా చమురు-సహజ వాయువు ఉత్పత్తిలో దేశంలోనే కీలక స్థానంలో కోనసీమ ఉంది. కేజీ బేసిన్ పరిధిలోనే ఈ ప్రాంతం ఉంటుంది. కానీ వ్యవసాయాధారిత పరిశ్రమలు గానీ, ఇతర పరిశ్రమలు గానీ ఆశించిన స్థాయిలో ఏర్పాటు కాలేదు. కోనసీమ నుంచి వనరులు తరలించుకుపోవడమే తప్ప తగిన అభివృద్ధి ప్రయత్నాలు జరగలేదనే అభిప్రాయం ఆ ప్రాంతానికి చెందిన జర్నలిస్ట్ పి గోపి వ్యక్తం చేశారు.

 
కోన అంటే అర్థమదే..
తెలుగు నిఘంటువు ప్రకారం కోన అంటే చాలా అర్థాలున్నాయి. అందులో అడవి వంటివి బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే కోన అంటే మూల అని, సీమ అంటే ప్రదేశం అని తెలుగు అధ్యాపకుడు ముళ్లపూడి రామచంద్రం అభిప్రాయపడ్డారు. "గోదావరి జిల్లాల్లో ఇప్పుడు కోనసీమగా పిలుస్తున్న ప్రాంతం ఓ మూలన ఉంటుంది. అందులోనూ భౌగోళికంగా నదీ ప్రవాహానికి చివరిలో ఉంది. ఇది ఓ దీవిని తలపిస్తుంది. రోడ్డు రవాణా మార్గాలు అంతగా లేని రోజుల్లో రాకపోకల కోసం పడవల మీద గోదావరిని దాటాల్సి వచ్చేది. అందుకే ఆ ప్రదేశాన్ని కోనసీమగా పిలుస్తారు. కోనసీమ గురించి 12వ శతాబ్దం నాటి నుంచే ప్రస్తావన ఉంది. నన్నయ్య వంటి వారి రచనల్లోనూ కోనసీమ గురించి పేర్కొన్నారు. అనేక శతాబ్దాలుగా కోనసీమగానే ఈ ప్రాంతాన్ని పిలుస్తున్నారు"అని ఆయన బీబీసీకి వివరించారు.

 
కోనసీమ అనే పేరు రావడానికి ఆనాటికి ఇది అటవీ ప్రాంతంగా ఉండడం వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు.

 
విపత్తులు ఎదుర్కొంటూ..
కొనసీమ అంటే వర్తమానంలో అత్యధికులకు గుర్తుకు వచ్చేది కొబ్బరి సాగు. దేశంలోనే కొబ్బరి ఉత్పత్తిలో కోనసీమకు ప్రత్యేక స్థానం ఉంది. కొబ్బరి తోటలతో పాటుగా వివిధ అంతర పంటలతో కోనసీమ దాదాపుగా కేరళని తలపిస్తుంది.

 
కానీ ధవళేశ్వరం క్యాటన్ బ్యారేజ్ నిర్మాణానికి ముందు కోనసీమ కూడా నీటి వనరుల వినియోగానికి దూరంగా ఉండేది. 1850 తర్వాత ఆనకట్ట, దానికి అనుబంధంగా కాలువలు నిర్మించిన కాటన్ సంకల్పంతో కోనసీమ కొత్త రూపు దాల్చింది. ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టాల ద్వారా లక్షల ఎకరాల ప్రాంతం సాగులోకి వచ్చింది. అయితే చుట్టూ గోదావరి ప్రవాహం మూలంగా వరదల ముప్పు పొంచి ఉంటుంది. 1986, 2006 వంటి పెద్ద వరదలను కోనసీమ ఎదుర్కోవాల్సి వచ్చింది. 

 
తీర ప్రాంతం కారణంగా తుపాన్ల తాకిడి కూడా తప్పదు. 1996లో పెను తుపాన్ కోనసీమని అతలాకుతలం చేసింది. దాని నుంచి కోలుకోవడానికి కోనసీమ ప్రాంతానికి చాలా కాలం పట్టింది. అనేక విపత్తులను ఎదుర్కొంటూ కోనసీమ నిలబడింది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆక్వా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. తొలుత చేపల సాగుతో మొదలయ్యి, ఆ తర్వాత టైగర్ రొయ్యలు, ప్రస్తుతం వనామీ రొయ్యల సాగుతో కోనసీమ రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. ఒకనాటి పచ్చదనం క్రమంగా తగ్గుతోంది.

 
ఆయిల్ నిక్షేపాల కోసం ఓఎన్జీసీ, రిలయన్స్, గెయిల్, కెయిర్న్స్, జీఎస్ పీసీ వంటి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యకలాపాలతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ఆయిల్ రిగ్గులలో 30 ఏళ్ల క్రితం పాశర్లపూడి బ్లో అవుట్ కలకలం రేపింది. రెండేళ్ల క్రితం ఉప్పలగుప్తం మండలంలో చెయ్యేరులో కూడా ఆయిల్ బావి వద్ద మంటలు చెలరేగి రెండు రోజుల పాటు ఆందోళనకు గురిచేశాయి.

 
‘‘రాజకీయాలే కారణం’’
కోనసీమ పేరుకి సుదీర్ఘ చరిత్ర ఉండడం వల్ల ఆయ్ మాది కోనసీమ అంటూ ప్రత్యేక యాసలో ఈ ప్రాంత వాసులు గర్వంగా చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం జిల్లా పేరు చుట్టూ సాగుతున్న చర్చలో కోనసీమ పేరు తొలగించడం లేనందున అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదన్నది కొందరి అభిప్రాయం.

 
"కోనసీమను జిల్లాగా తొలుత నిర్ణయించారు. దానిని అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడం వల్ల పెద్దగా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాజకీయ కారణాలు మాత్రం అనేకం ఉన్నాయి. అంబేడ్కర్ అనే పేరుని అంగీకరించడానికి కొందరు సిద్ధంగా లేరు. స్పష్టంగా అది చెప్పకపోయినా ప్రస్తుతం వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు అసలు కారణం కోనసీమ పేరు మీద ప్రేమ కన్నా అభ్యంతరమంతా అంబేడ్కర్ పేరు ఉండడమేనని చెప్పాలి. రాజకీయ కారణాలతో కొందరు ఈ వైరుధ్యాన్ని రాజేస్తున్న కారణంగానే సమస్య జటిలమయ్యింది" అంటూ రిటైర్డ్ ప్రిన్సిపాల్ కందికట్ల రాధాకృష్ణ వ్యాఖ్యానించారు.

 
ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని కోనసీమ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా పేరు పెట్టే ఆలోచన చేయవచ్చంటూ ఆయన సూచించారు. అంతేగాకుండా ఎవరు ఎన్ని పేర్లు పెట్టినా ప్రజలు వాడుకలో మాత్రం కోనసీమ జిల్లాగానే ప్రస్తావించే అవకాశం ఎక్కువగా ఉందంటూ రాధాకృష్ణ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని అధికారికంగా నిర్ణయించినా వాడుకలో నెల్లూరు జిల్లాగానే ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 
‘‘ప్రత్యేకతను నిలుపుకోవాలి..’’
"కోనసీమ అంటే ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి వాతావరణం, ప్రకృతి వనరులు, పర్యాటకం పరంగా ఉన్న అవకాశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, వనరులు.. ఇలా అనేక రంగాల్లో కోనసీమకు గుర్తింపు ఉంది. లంక భూములు సహా అనేక వనరులు సామాన్యుల చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎస్సీ, బీసీలలోనూ విద్యావంతులు, ఉద్యోగుల సంఖ్య పెరిగింది. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అన్ని సామాజిక తరగతుల్లోనూ ఇక్కడ కొంత అభివృద్ధి కనిపిస్తుంది. ఇలాంటి ప్రత్యేకతలను నిలుపుకోవాలి. కానీ కులం పేరుతో కొందరు విద్వేషాలు రాజేస్తే రెచ్చిపోయే పరిస్థితి రావడం ఆందోళనకరం"అని ఆర్డీవోగా పనిచేసి పదవీ విరమణ చేసిన అడబాల వెంకట్రావు చెప్పారు.

 
తాను రెవెన్యూ శాఖలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసిన సమయంలో కోనసీమ వాసిగా గర్వంగా చెప్పుకునే వాడినన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు కూడా కోనసీమ అనగానే ఆసక్తిగా చూసేవారని తెలిపారు. ప్రస్తుతం అలాంటి గుర్తింపు కోల్పోయే పరిస్థితి రావడం ఆందోళనకరం అంటూ వెంకట్రావు అభిప్రాయపడ్డారు.