శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (16:09 IST)

ఇమ్రాన్ ఖాన్‌: శ్రీలంక పార్లమెంటులో పాక్ ప్రధాని ప్రసంగం రద్దవడానికి కారణం భారతదేశమా?

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం శ్రీలంక వెళ్లారు. ఆయన పర్యటనపై స్థానిక ముస్లింలు కొన్ని ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఈ పర్యటనను శ్రీలంకపై చైనా ప్రభావం పెరుగుతుండటానికి సంకేతంలా భారత్ చూస్తోంది. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తారని ఇదివరకు చర్చలు జరిగాయి. అయితే, ఈ ప్రసంగాన్ని శ్రీలంక రద్దు చేసింది.

 
కోవిడ్‌తో చనిపోయిన ముస్లింల మృతదేహాలను ఇస్లాం ఆచారం ప్రకారం పూడ్చేందుకు శ్రీలంక అంగీకరించడం లేదు. దహనం చేయాలనే నిర్దేశిస్తోంది. ఈ విషయమై ముస్లింల నుంచి అక్కడ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శవాన్ని దహనం చేస్తే కోవిడ్ వ్యాప్తికి అవకాశం ఉండదని చెబుతూ ప్రభుత్వం అలా చేస్తూ వస్తోంది. అయితే, శాస్త్రవేత్తలు మాత్రం ఈ వాదనను బలపరిచే శాస్త్రీయ ఆధారాలు లేవని అంటున్నారు.

 
అయితే, కోవిడ్‌తో మరణించిన ముస్లింలను పూడ్చిపెట్టేందుకు అనుమతిస్తామని గతవారం శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సే పార్లమెంటులో ప్రకటించారు. ఈ ప్రకటనను ఇమ్రాన్ ఖాన్ ట్విటర్ వేదికగా ఆహ్వానించారు. ఐరాస మానవహక్కుల మండలి 46వ సదస్సులో పాకిస్తాన్ ద్వారా ఓఐసీ సభ్యుల మద్దతు పొందేందుకు శ్రీలంక ఇప్పుడు ప్రయత్నిస్తోంది. ముస్లింల మతపరమైన హక్కులను ఉల్లంఘిస్తున్నట్లు శ్రీలంక ఆరోపణలు ఎదుర్కొంటోంది.

 
అయితే, రాజపక్సే ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత కూడా కోవిడ్ మృతుల శవాల దహనం కొనసాగుతుందని, ఈ విధానంలో ఏ మార్పూ లేదని శ్రీలంక ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. దీంతో శ్రీలంకలోని ముస్లింలు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు విజ్ఞప్తులు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయంలో ఆయన ఏదైనా చేస్తారని వారు ఆశలు పెట్టుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఈ పర్యటనలో భాగంగా శ్రీలంకలో పార్లమెంటులో ప్రసంగిస్తారని స్థానిక మీడియాలో ఇదివరకు కథనాలు వచ్చాయి. అయితే, ఈ ప్రణాళికలను శ్రీలంక ప్రభుత్వం రద్దు చేసింది.

 
ఈ విషయమై శ్రీలంక ప్రభుత్వం గానీ, పాకిస్తాన్ ప్రభుత్వం గానీ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఇమ్రాన్ ఖాన్ పర్యటన వివరాలతో విడుదల చేసిన ప్రకటనలోనూ ఈ ప్రసంగం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ విషయమై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందన కోసం బీబీసీ కూడా ప్రయత్నించింది. కానీ, ఎలాంటి స్పందనా రాలేదు.

 
శ్రీలంక ముస్లింల ఆశలు
ముస్లింల అంతిమ సంస్కారాల విషయమై అనవసరపు అపోహలు పెరగకుండా ఉండేందుకు ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటు ప్రసంగాన్ని శ్రీలంక రద్దు చేసి ఉండొచ్చని కొలంబోలో ఉన్న ఓ దౌత్యవేత్త బీబీసీతో అన్నారు. ‘‘దేశాలకు అతీతంగా ముస్లింలందరూ తామంతా 'ముస్లిం ఉమ్మా'లో భాగమని భావిస్తుంటారు. ఓ ఇస్లామిక్ దేశం నాయకుడు తమ దేశ పార్లమెంటులో ప్రసంగించడం... శ్రీలంక ముస్లింలు ఆనందించే విషయమే. ముస్లిం ఉమ్మా అనేది ఒక భిన్నమైన భావన. చాలా మంది దీన్ని తేలిగ్గా అర్థం చేసుకోలేరు'' అని ఆస్ట్రేలియాలోని మోర్డెక్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అమీర్ అలీ 'ఫైనాన్షియల్ టైమ్స్'కు రాసిన ఓ వ్యాసంలో అభిప్రాయపడ్డారు.

 
''కానీ, శ్రీలంక ముస్లింలు పాకిస్తాన్ నాయకుల నుంచి గానీ, ఇతర ఇస్లామిక్ దేశాల నాయకుల నుంచి గానీ పెద్దగా ఆశించకూడదు. ఎందుకంటే వాళ్లు వాళ్ల వాళ్ల దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తారు'' అని అమీర్ అలీ అన్నారు. ''ముస్లిం ఉమ్మా అంత లోతైన భావన కాదు. ఇస్లామిక్ దేశాలపై శ్రీలంక ముస్లింలు ఆశలు పెట్టుకుంటే... వారి పరిస్థితి కూడా పాలస్తీనా, వీగర్, రోహింగ్యాల్లాగే మారుతుంది. ఇస్లామిక్ దేశాలు వీరందరినీ వారి దారిన వారిని వదిలేశాయి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

 
భారత్-శ్రీలంక సంబంధాలు
శ్రీలంక, భారత్ సంబంధాలు కొంత ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో ఇమ్రాన్ ఖాన్ పర్యటన జరుగుతోంది. భారత్‌కు చెందిన అదానీ గ్రూప్ శ్రీలంకలో చేపట్టిన పోర్టు టెర్మినల్ ప్రాజెక్టును శ్రీలంక అధ్యక్షుడు గోడోభాయా రాజపక్సే రద్దు చేయడంతో ఈ ఒడుదొడుకులు తలెత్తాయి. ఈ టెర్మినల్ నిర్మాణ ప్రాజెక్టు కోసం ప్రధాని మోదీ ప్రత్యేకంగా అదానీ సంస్థను ఎంపిక చేశారు. పోర్టు తూర్పు కంటెయినర్ టెర్మినల్ ఇది. చైనా నిర్మించిన టెర్మినల్ పక్కనే దీన్ని నిర్మించతలపెట్టారు.

 
మరోవైపు తమ దేశానికి చెందిన ఉత్తర ద్వీపాల్లో ఇంధన పునరుత్పత్తి ప్రాజెక్టులు చేపట్టేందుకు శ్రీలంక చైనాకు అనుమతి ఇచ్చింది. భారత్ సరిహద్దులకు సమీపంలోని ప్రాంతం ఇది. దీంతో భారత్‌కు ఈ విషయంలో భద్రతపరమైన ఆందోళనలు కూడా ఉన్నాయి. శ్రీలంక పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం రద్దవ్వడానికి భారత్ కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 
శ్రీలంక పార్లమెంటులో ప్రసంగిస్తూ ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తితే... భారత్‌తో తమ సంబంధాలు మరింత దెబ్బతింటాయని శ్రీలంక ఆందోళనకు గురైందని వారు అంటున్నారు. ''ప్రాంతీయంగా పాకిస్తాన్‌ను 'చైనా ఏజెంట్'గా చూస్తున్నారు. చైనా ఆ దేశంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇమ్రాన్ ఖాన్ శ్రీలంకలో పర్యటించడాన్ని చైనా ప్రభావం కింద కూడా చూస్తున్నారు'' అని రాజకీయ విశ్లేషకుడు కసాల్ పెరేరా బీబీసీతో అన్నారు.

 
''పాకిస్తాన్ ద్వారా చైనాను మరింతగా తమ దేశంలో పెట్టుబడులు పెట్టేలా చేయాలని శ్రీలంక ప్రయత్నిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ పర్యటన సమయంలో అత్యున్నత స్థాయి సమావేశాలతోపాటుగా వ్యాపార, పెట్టుబడిదారీ రంగాలవారితోనూ సమావేశం అవుతారని శ్రీలంక విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపింది'' అని కసాల్ పెరేరా అన్నారు.

 
పాకిస్తాన్, శ్రీలంక ప్రధానమంత్రుల సమక్షంలో ద్వైపాక్షిక సహకారం విషయమై పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. 2021లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇదే తొలి విదేశీ పర్యటన. పాకిస్తాన్ నుంచి వాణజ్య ప్రతినిధుల మండలి కూడా ఈ పర్యటనకు వచ్చింది. జౌళి, గార్మెంట్స్, ఔషధ, వ్యవసాయ, ఆహార, క్రీడాసామగ్రి, ఆభరణాలు, ఆటోమొబైల్ విడి భాగాల రంగాలకు చెందిన ప్రతినిధులు ఈ మండలిలో ఉన్నారు.