శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 14 జూన్ 2024 (22:28 IST)

వైసీపీ ఓటమికి వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక కారణమా? ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏంటి?

“ప్రజలకు సేవలు అందించేందుకు ఇన్ని వ్యవస్థలు ఉండగా వాలంటీర్ వ్యవస్థతో పనేంటి? వాలంటీర్లు సేకరించిన డేటా, సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది” అని 11 నెలల క్రితం ఏలూరు సభలో పవన్ కల్యాణ్ అన్నారు. “వాలంటీర్లు ప్రజలకు అవసరమైన పనులు చేస్తే సమస్య ఉండదు. వాలంటీర్లు రాజకీయాలు చేయడం సరికాదు” అని చంద్రబాబు నాయుడు గత జులైలో అన్నారు. “వాలంటీర్లను పార్టీ కార్యకర్తల్లా రాజకీయ అవసరాలకు వాడుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగేతర శక్తిగా మారకూడదన్నది తెలుగుదేశం విధానం” అని గతేడాది జులైలో నారా లోకేష్ అన్నారు.
 
వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ, జనసేన నాయకులు గతంలో చేసిన వ్యాఖ్యలివి. వాలంటీర్లు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటూ, వైసీపీ కోసం పని చేస్తున్నారని ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన నాయకులు ఆరోపించారు. కానీ, ఎన్నికల ఫలితాల తర్వాత కొందరు వైసీపీ నాయకులు చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. “ప్రభుత్వం దిగిపోడానికి వాలంటీర్లు ఒక కారణమే. వాలంటీర్ల కారణంగా నాయకులకు ప్రజలు దూరమయ్యారు” అని బీబీసీతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ‘‘ప్రజలకు, పార్టీ నాయకులకు మధ్య వాలంటీర్లు వచ్చారు. దీంతో ప్రజలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు దూరం కావాల్సి వచ్చింది’’ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
 
‘‘వాలంటీర్లను, ఐప్యాక్ టీమ్‌ను చూసుకుని జగన్ కూడా పార్టీలోని నాయకులు, కార్యకర్తలను దూరం చేసుకున్నారు. దాని ఫలితమే ఇప్పుడు ఎన్నికల్లో కనిపించింది’’ అని మరో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. వైసీపీ గెలుపు కోసం వాలంటీర్లు పని చేస్తున్నారని ఎన్నికలకు ముందు టీడీపీ ఆరోపిస్తే.. తమ ఓటమికి వాలంటీర్ల వ్యవస్థ కూడా ఒక కారణం కావొచ్చని ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు అంటున్నారు. అసలు ఏం జరిగింది? నిజంగానే వాలంటీర్లు వైసీపీ ఓటమికి కారణమయ్యారా? బలమవుతుందని వైసీపీ ప్రభుత్వం సృష్టించిన వ్యవస్థ, ఆ ప్రభుత్వానికి అధికారం లేకుండా చేసిందా? వాలంటీర్ వ్యవస్థ తమ ఓటమికి కారణమని వైసీపీ ఎందుకు భావిస్తోంది? ప్రస్తుత ప్రభుత్వం ఈ వాలంటీర్ల వ్యవస్థను ఏం చేస్తుంది?
 
వాలంటీర్ వ్యవస్థ ప్రారంభం నుంచి ఇప్పటివరకు..
వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి దానిపై చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం మారిన సమయంలోనూ వారి ప్రస్తావన వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ లెక్కల ప్రకారం, రాష్ట్రంలోని మొత్తం వాలంటీర్ల సంఖ్య సుమారు 2.66 లక్షలు. వైసీపీ ప్రభుత్వం 2019 ఆగస్టులో నెలకు రూ. 5 వేల గౌరవ వేతనంతో వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించింది. వార్తాపత్రికల కోసం వారికి నెలకు మరో రూ. 200 ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇది సేవాభావంతో చేయాల్సిన పనే కానీ, ప్రభుత్వ ఉద్యోగం కాదని అప్పుడే స్పష్టంగా చెప్పింది.
 
ఏటా కొందరు వాలంటీర్లకు రూ.10 వేల చొప్పున వివిధ అవార్డుల పేరుతో ప్రభుత్వం చెల్లింపులు చేసింది. సామాజిక పెన్షన్లు, ప్రభుత్వ పథకాల ప్రచారం, రేషన్ సరుకుల సమాచారం ఇవ్వడం.. ఇలాంటి పనులు వాలంటీర్లు చేసేవారు. నిబంధనల కారణంగా 2024 ఏపీ ఎన్నికలకు ముందు పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను ఈసీ అనుమతించలేదు. అదే సమయంలో కొందరు వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటువంటివారిని ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. కొందరు రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మిగతా వారు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నెల (జూన్) నుంచి మళ్లీ వాలంటీర్లు విధుల్లో చేరే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో దీనిపై ఇంకా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది.
 
వైసీపీ నాయకుల మాట నిజమే: వాలంటీర్లు
వాలంటీర్లు నిజంగానే పార్టీ కోసం ప్రచారం చేశారా అనే అంశంపై బీబీసీ కొందరు వాలంటీర్లతో మాట్లాడింది. “నేను వైసీపీ పార్టీపై అభిమానంతో వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ ప్రచారంలో పాల్గొన్నాను. వాలంటీరుగా నా పరిధిలో 50 కుటుంబాల వారు నాకు బాగా తెలిసినవారే. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ పథకాలు, చేసిన పనుల గురించి వివరించి వైసీపీకే ఓటు వేయాలని కోరాను” అని బీబీసీతో విశాఖపట్నం 79వ వార్డులో వాలంటీరుగా పని చేసిన ఎస్. కార్తీక్ చెప్పారు.
 
“వాలంటీర్లుగా చేరిన తర్వాత ఊర్లో జరిగే పండుగలకు, ఏదైనా మీటింగులకు వైసీపీ నాయకులు రావడమే కానీ, మిగతాదంతా మేమే చూసుకునేవాళ్లం. మా వార్డు వాళ్లు ఏ సమస్య అయినా మాతోనే చెప్పుకునేవారు. మీరు రావడం వల్ల మా పని తగ్గిందని వైసీసీ నాయకులు కూడా అనేవారు. మాకు సంతోషంగా ఉండేది” అని కార్తీక్ చెప్పారు. విజయనగరం జిల్లా వాలంటీరు ఈ విషయంపై మరింత స్పష్టంగా మాట్లాడారు. “మాకు ఓటేయించండి అని వైసీపీ నాయకులు చెప్పేవారు. నేను ప్రభుత్వ పథకాలను వివరిస్తూ వైసీపీకి ఓట్లు వేయమని కొందరిని అడిగాను. మా వల్ల నాయకులకు, ప్రజలకు కనెక్షన్ కట్ అయ్యిందనే మాట వాస్తవమే. అన్ని పనులూ మేమే చేసేవాళ్లం. దీంతో నాయకుల వద్దకు ప్రజలు వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది” అని విజయనగరం జిల్లా రేగిడి మండలం ఉంగలాడ గ్రామ వాలంటీరు కృష్ణమూర్తి నాయుడు బీబీసీతో చెప్పారు.
 
'మేం వైసీపీ కోసం పని చేయలేదు'
అయితే, వైసీపీ కోసం తాము పని చేయలేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో తమ వంతు సాయం చేశామని మరికొందరు వాలంటీర్లు బీబీసీతో చెప్పారు. వైసీపీ కోసం పని చేయాలని తనను ఎవరూ అడగలేదని, తాను కూడా వైసీపీ కోసం ప్రచారం చేయలేదని శ్రీకాకుళం టౌన్‌లో వాలంటీర్‌గా పని చేస్తున్న బి. ప్రియాంక బీబీసీతో చెప్పారు. ‘‘వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిన దగ్గర నుంచి ప్రభుత్వమే ప్రజల ఇంటికి వెళ్లినట్లయింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఆ తర్వాత వాలంటీర్లు తప్పా ప్రజలకు ప్రభుత్వంలోని మిగతావారితో సంబంధం లేకుండా పోయింది. వాలంటీర్లు అంత బలంగా తయారయ్యారు’’ అని బీబీసీతో సీనియర్ జర్నలిస్ట్ వీవీ రమణమూర్తి అన్నారు.
 
‘‘వాలంటీర్లను వైసీపీ ఎన్నికల సమయంలో ఉపయోగించుకోవాలని భావించింది. అందుకే వారిని ప్రభుత్వంలో కలపకుండా, ఎన్నికల సమయంలో టెక్నికల్‌గా ఇబ్బందులు రాకుండా చూసుకుంది. వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలని డిమాండ్లు వచ్చినా కూడా వైసీపీ పట్టించుకోకుండా వాలంటీర్లుగానే కొనసాగించింది’’ అని వీవీ రమణమూర్తి చెప్పారు.
 
వాలంటీర్లు దగ్గరయ్యారు, పార్టీ దూరమైంది: కేకే రాజు
‘‘ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల సమయానికి వాలంటీర్లు ప్రజలకు దూరమయ్యారు. నిజానికి వాలంటీర్లలో 80 శాతం వైసీపీ మనుషులే ఉన్నారు. వాలంటీర్లుగా రాజీనామాలు చేసినవారు కూడా వైసీపీకే ఓటు వేయమని కోరుతారు. వాలంటీరుగానే కాకుండా ఊరిలో మనిషిగా కూడా వాళ్లు ప్రచారం చేసే ఉంటారు. అయితే ఒక పార్టీ మనిషిగా కాకుండా కేవలం వాలంటీరు రూపంలో ఎన్నికల్లో ఓటు అడగడంతో ప్రజలు పట్టించుకోలేదని అనుకోవచ్చు. ఇలా వాలంటీర్ల కారణంగా వైసీపీకి దెబ్బతగిలిందనేది వాస్తవం'' అని పొలిటికల్ అనలిస్టు ఎం. యుగంధర్ రెడ్డి అన్నారు.
 
''అప్పటివరకు అన్నీ చూసుకున్న వాలంటీర్లను ఎన్నికల సంఘం పక్కన పెట్టడంతో, వాలంటీరుకు నిత్యం టచ్‌లో ఉన్న లబ్ధిదారులను పార్టీ గుర్తించలేకపోయింది. లబ్ధిదారులను గుర్తించి, వారికి తమ ప్రభుత్వం చేసిన మేలును వివరించేందుకు వైసీపీ నాయకులకు తగిన సమయం చిక్కలేదు. వివరాలు తెలుసుకునే సరికే పుణ్యకాలం గడిచిపోయింది'' అని విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గం నుంచి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన కేకే రాజు అన్నారు. ‘‘వాలంటీర్లు ప్రజలకు చేరువయ్యారు. కానీ, నాయకులు దూరమయ్యారు. ఇది పార్టీకి నష్టం చేసింది’’ అని చెప్పారు.
 
వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తారు?
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించబోమని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని కూడా చెప్పారు. మొత్తం 2.66 లక్షల మంది వాలంటీర్లలో ప్రస్తుతం రాష్ట్రంలో రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్ల సంఖ్య సుమారు లక్షా 8 వేలు. కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వాలంటీర్లు ఎదురు చూస్తున్నారు. అలాగే రాజీనామాలు చేసిన వారిని తీసుకుంటుందా, లేదా అనేది కూడా తేలాల్సి ఉంది.
 
కొత్త ప్రభుత్వం నుంచి త్వరలో వాలంటీర్లపై స్పష్టమైన నిర్ణయం వస్తుందని ఎదురుచూస్తున్నట్లు విజయనగరం జిల్లా చీపురపల్లిలో పని చేస్తున్న వాలంటీర్ ఆర్. రామారావు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వాలంటీర్లకు రూ. 10 వేలు జీతం ఇస్తామని హామీ ఇచ్చిందని, దానిని నిలబెట్టుకుంటుందో లేదో చూడాలని అన్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోనే మాట ఇచ్చారని బీబీసీతో టీడీపీ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ చెప్పారు. వాలంటీర్లలో చదువుకున్న ప్రతీ ఒక్కరి నైపుణ్యాలు పెంచి వారికి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలని బండారు అన్నారు. వాలంటీర్ వ్యవస్థపై కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది.