కర్ణాటక ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్న యడ్యూరప్ప
బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప ఈరోజు సాయంత్రం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హతవేటు వేయడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధమైంది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న యడ్యూరప్ప ఇప్పటికే మూడుసార్లు మధ్యలోనే పదవికోల్పోయారు.
ఈరోజు ఉదయం గుడికి వెళ్లి దర్శనం చేసుకున్న ఆయన ప్రభుత్వ ఏర్పాటు కోసం రాజ్‌భవన్‌కు వెళుతున్నట్లు ప్రకటించారు. ''మా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనల మేరకు ప్రభుత్వ ఏర్పాటు కోసం కర్ణాటక గవర్నర్‌ను కలిశాను'' అని యడ్యూరప్ప ట్వీట్ చేశారు. ''ప్రతిపక్షనేతగా నేనే ఉన్నందువల్ల పార్టీ శాసనసభ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు'' అని పేర్కొన్నారు.
గవర్నర్ వాజూభాయి వాలాకు రాసిన లేఖలో ''బీజేపీకి 105 సభ్యుల బలం ఉంది. శాసన సభలో మాదే ఏకైక అతిపెద్ద పార్టీ'' అని పేర్కొన్నారు. ''నేటి ఆ పార్టీ స్థానం దృష్ట్యా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే లేదు'' అని కాంగ్రెస్ పార్టీ ట్వీటర్‌లో పేర్కొంది. బీజేపీకి ప్రస్తుతం 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉంది. దీంతో శాసన సభలో వారి బలం 106కు చేరింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో వారి బలం ప్రస్తుతం 76కు తగ్గింది.
జేడీఎస్‌కు 37 మంది సభ్యులు ఉన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు మూలంగా శాసనసభ సభ్యుల సంఖ్య 224 నుంచి 221కి తగ్గింది. 76 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 13 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జేడీఎస్‌కు ఉన్న 37 మంది సభ్యుల్లో రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే శ్రీమంత్ పటేల్, బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్. మహేశ్ వారి పదవులకు రాజీనామా చేయనప్పటికీ విశ్వాస పరీక్ష సమయంలో సభకు గైర్హాజరయ్యారు.
పేరు వెల్లడించడానికి ఇష్టపడిని ఓ సీనియర్ రాజకీయనాయకుడు ప్రస్తుత పరిస్థితి గురించి బీబీసీతో మాట్లాడుతూ, ''మా జాతీయ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. మేం కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టాం. ఇప్పుడు మేం ప్రభుత్వాన్ని ఏర్పరచకపోతే పరిస్థితి బాగుండదు. రెబెల్ ఎమ్మెల్యేలలో బాధను మేం గమనించాం'' అని పేర్కొన్నారు.
బీజేపీ చేపట్టిన 'ఆపరేషన్ కమల'లో కీలకసూత్రధారులని భావించి కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు రమేశ్ జర్కోహ్లీ, మహేశ్ కుమతహల్లీలపై స్పీకర్ రమేశ్ అనర్హత వేటు వేశారు. రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు ఉపసంహరించుకోడానికి సమయం ఇస్తారా అని స్పీకర్‌ను మీడియా ప్రశ్నించిన్నప్పుడు ''మీరు ఎందుకు, ఎవరి లబ్ధి కోసం ఈ ప్రశ్నలు వేస్తున్నారో నాకు తెలుసు. నా వరకు ఇది ఊహాజనితమైన ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి సమాధానం చెప్పను'' అని ఆయన పేర్కొన్నారు.
దర్వాడ్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ హరీశ్ రామస్వామి కర్ణాటక సంక్షోభంపై బీబీసీతో మాట్లాడుతూ, ''సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కోరిక ఇప్పుడు కాంగ్రెస్‌కు లేదు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోడానికే ఆ పార్టీ ప్రయత్నిస్తుంది. ఈ సంక్షోభం వల్ల రాష్ట్రపతిపాలన రావొచ్చు. డిసెంబర్‌లో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది'' అని పేర్కొన్నారు.