కశ్మీర్: మహమ్మద్ గజనీకి ముచ్చెమటలు పట్టించిన హిందూ రాజుల కథ

jammu and kashmir
Last Modified గురువారం, 29 ఆగస్టు 2019 (19:08 IST)
భారత్‌లాగే కశ్మీర్లోకి కూడా ఇస్లాం ఆగమనం చరిత్రకు ముందు ఒక పురాణ కథలాగే ప్రారంభమైంది. ఖ్వాజా మహమ్మద్ ఆజం దీదామరీ అనే ఒక సూఫీ రచయిత ఫారసీలో వాక్యాత్-ఎ-కశ్మీర్ పేరుతో రాసిన పుస్తకం 1747లో ప్రచురితమైంది. అందులో ఆ కథలను పురాణాల తరహాలోనే రాశారు. అందులో 'జలదేవ్' అనే రాక్షసుడు ఆ ప్రాంతాన్నంతా నీటిలో ముంచి ఉంచాలనుకున్నాడని చెప్పారు. ఈ కథలో కథానాయకుడి పేరు 'కాశేఫ్'. ఆయన మారీచీ కొడుకని చెప్పారు.

కాశేఫ్ మహాశివుడి గురించి తపస్సు చేస్తాడు. తర్వాత శివుడి ఆదేశాలతో జలదేవుడిని సంహరించిన బ్రహ్మ, విష్ణు ఆ ప్రాంతానికి కాశేఫ్ పేరు తగినదని చెబుతారు. కాశేఫ్ నిజానికి 'కశ్యప' మహర్షి కథ అని పరిశోధకులు భావిస్తున్నారు. దానినే తెలీసోతెలీకో ముస్లిం పేరులా చెప్పే ప్రయత్నం జరిగిందని అంటున్నారు. 'వాక్యాత్-ఎ-కశ్మీర్' రాసిన ఆజం కొడుకు బేదియా-ఉద్-దీన్ ఈ పురాణ గాథలను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన దీనిని నేరుగా వేరే కథతో జోడించారు.

కశ్మీర్ ఘన చరిత్ర
ఆయన వివరాల ప్రకారం కశ్మీర్‌లో ప్రారంభం నుంచి 1100 ఏళ్ల వరకు ముస్లింల పాలన ఉండేది. ఆ పాలకులను హరినంద్ అనే హిందూ రాజు ఓడించాడు. కశ్మీర్ ప్రజలకు ప్రార్థించడం స్వయంగా హజ్రత్ మూసానే నేర్పించాడని బేదియా చెప్పారు. మూసా మరణం కూడా కశ్మీర్లోనే జరిగిందని, అక్కడ ఆయన సమాధి కూడా ఉందన్నారు. నిజానికి బేదియా-ఉద్-దీన్ ఇవన్నీ షేక్ నూరుద్దీన్ వలీ(ఈయన్నే నంద్ రుషి అని కూడా అంటారు) రాసిన 'నూర్‌నామా' పేరుతో కశ్మీరీలో రాసిన కశ్మీర్ చరిత్ర ఆధారంగా ఇదంతా చెప్పారు. అయితే, చరిత్రకారులు 'చేరమన్ పెరుమాళ్' కథల్లాగే ఈ కథలకు కూడా ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు.

'పృథ్వీనాధ్ బామ్జయీ' అనే ఒక ప్రముఖ చరిత్రకారుడు ఉండేవారు. ఆయన ప్రతిభను చూసిన కశ్మీర్ అప్పటి ప్రధానమంత్రి షేఖ్ అబ్దుల్లా కశ్మీర్ విస్తృత చరిత్ర రాయాలని ఆయన్ను కోరినట్లు చెబుతారు. 1962లో ప్రచురించిన ఆయన పుస్తకం 'ఎ హిస్టరీ ఆఫ్ కశ్మీర్‌'కు ముందు మాట స్వయంగా ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ రాశారు. ఆయన మూడు భాగాలుగా రాసిన 'కల్చర్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ కశ్మీర్' ఈ ప్రాంత చరిత్రను అర్థం చేసుకోడానికి ఒక అద్భుతమైన సోర్స్‌గా భావిస్తున్నారు.

కశ్మీర్‌లో ఇస్లాం తొలి పరిచయం
బామ్జయీ ప్రకారం సింధుపై విజయం తర్వాత బిన్-కాసిమ్ కశ్మీర్ వైపు కదిలారు. కానీ ఆయనకు పెద్దగా ఫలితం దక్కలేదు. ఆయన అకాలరమణంతో అక్కడ దీర్ఘకాలిక పాలన ఏర్పాటు చేయలేకపోయారు. కఠిన భౌగోళిక పరిస్థితుల వల్ల కూడా అరబ్బులు కశ్మీర్ వరకూ చేరుకోవడంలో విఫలమయ్యారు. కశ్మీరీ హిందూ పాలకుల్లో కార్కోట్ రాజవంశీయులు (క్రీ.శ.325 నుంచి 885) మొదట అరబ్బులను కలిశారు. మధ్య ఆసియా, అఫ్గానిస్తాన్‌లో ఇస్లాం ప్రచారం చేస్తున్న సమయంలో ఈ రాజ వంశంలోని చంద్రపీడ్, లలితాదిత్య లాంటి రాజులు అరబ్బులను కలిశారు. అప్పుడే మొదటిసారి వారికి ఇస్లాం అనే ఈ కొత్త మతం గురించి తెలిసింది. హిందూ రాజులకు అరబ్బులు చాలా ప్రమాదకరంగా అనిపించారు. దాంతో, రాజు లలితాదిత్య చైనా చక్రవర్తిని సాయం అడిగారు. అరబ్బులకు ఎదుర్కోడానికి ఒక సైనిక కూటమి ఏర్పాటు చేద్దామని చెప్పారు.

మహమ్మద్ గజనీకి ముచ్చెమటలు
కఠిన భౌగోళిక పరిస్థితుల వల్ల బయటివారు కశ్మీర్‌లోకి చొరబడడం దాదాపు అసాధ్యంగా ఉండేది. కశ్మీర్ రాజు కూడా తన సరిహద్దులను పూర్తిగా మూసి ఉంచేవారు. ఎవరూ బయటకు వెళ్లకుండా చూసుకునేవారు. 1017లో భారత్‌లో పర్యటించిన అల్ బరూనీ దీని గురించి ఫిర్యాదులా రాశారు. "కశ్మీరీ రాజుకు తన రాజ్యంలోని సహజ వనరుల గురించి ఆందోళన ఎక్కువ. అందుకే ఆయన కశ్మీర్ చేరుకునే ప్రతి దారిపై తన పట్టు ఉండేలా చాలా జాగ్రత్త పడ్డారు" అన్నారు. "ఆయనతో ఎలాంటి వ్యాపారం చేయాలన్నా చాలా కష్టం. తనకు పరిచయం లేనివారు హిందువులనైనా ఆయన తన రాజ్యంలోకి రానివ్వరు" అని చెప్పారు.

అల్ బరూనీ మహమూద్ గజనీ కాలానికి చెందినవారనే విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. గజనీ భారత్‌పై ఎన్నోసార్లు దండయాత్ర చేశాడు. గజనీ కంటే సుమారు వందేళ్ల క్రితమే కాబూల్‌లో 'లల్లియా' పేరుతో ఒక బ్రాహ్మణ మంత్రి తన రాజ్యాన్ని స్థాపించారు. దానిని చరిత్రకారులు 'హిందూ రాజ్యం' అంటారు. ఆయన కశ్మీర్ హిందూ రాజులతో బలమైన రాజకీయ, సాంస్కృతిక సంబంధాలు కొనసాగించేవారు.


కశ్మీర్‌పై కన్ను
గజనీ ఉత్తర భారత దేశంపై దాడులు చేయాలనుకున్నప్పుడు ఆయన మొదట కశ్మీర్ సామ్రాజ్యంపైనే కన్నేశారు. ఆ సమయంలో కాబూల్ రాజు జైపాల్. దాంతో, జైపాల్ కశ్మీర్ రాజు సాయం కోరాడు. సాయం అందింది. కానీ ఆయన గజనీ చేతుల్లో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత కూడా జైపాల్ కొడుకు ఆనంద్‌పాల్, మనవడు త్రిలోచన్‌పాల్ గజనీతో యుద్ధం కొనసాగించారు. త్రిలోచన్‌పాల్‌కు అప్పటి కశ్మీర్ రాజు సంగ్రాంరాజా(1003-1028) నుంచి సాయ కూడా అందింది. కానీ ఆయన తన రాజ్యాన్ని కాపాడుకోలేకపోయారు.

12వ శతాబ్దంలో 'రాజతరంగిణి' పేరుత కశ్మీర్ చరిత్ర రాసిన కల్హణుడు ఈ మహా సామ్రాజ్యం పతనం గురించి చాలా బాధపడ్డాడు. గజనీ ఆ తర్వాత ఇప్పటి హిమాచల్‌లో భాగమైన కాంగ్డా కూడా గెలిచారు. కానీ కశ్మీర్ స్వతంత్ర హిందూ సామ్రాజ్యం అతడి కంటిలో ముల్లులా మారింది.


ఓటమితో వెనకడుగు
1015లో ఆయన మొదటిసారి తోసా-మైదాన్ కనుమ దారిలో కశ్మీర్‌పై దాడి చేశాడు. కానీ కఠిన భౌగోళిక పరిస్థితులు, కశ్మీరీల ప్రతిఘటనతో అతడు ఓటమిభారంతో వెనుదిరగాల్సి వచ్చింది. భారత్‌లో ఒక యుద్ధంలో గజనీ వెనుదిరిగిన మొట్టమొదటి ఘటన ఇదే. కశ్మీర్ నుంచి తిరిగివెళ్లేటపుడు అతడి సైన్యం దారి కూడా తప్పింది. లోయలో వరదలో చిక్కుకుపోయింది. దాంతో దారుణ ఓటమితోపాటు గజనీకి చాలా నష్టం జరిగింది.

ఆరేళ్ల తర్వాత 1021లో అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న గజనీ మళ్లీ అదే దారిలో కశ్మీర్‌పై దాడి చేశాడు. వరసగా ఒక నెల వరకూ అతడు దాడులు చేస్తూనే ఉన్నాడు. కానీ కశ్మీర్ చుట్టూ ఇనుప కోటలా చుట్టుముట్టిన సైనికులను ఎదుర్కోలేకపోయాడు. అప్పుడే లోయలో మంచు పడడం మొదలవుతోంది. దాంతో ఈసారీ ఇంతకుముందు కంటే ఎక్కువ సైన్యాన్ని కోల్పోతానేమో అని భయపడ్డ గజనీ వణికిపోయాడు. ఇక కశ్మీర్‌ను గెలవలేమనే విషయం గ్రహించిన గజనీ, మరోసారి అవమానంతో వెనక్కు తిరిగాడు. ఆ తర్వాత ఆతడు కశ్మీర్ గురించి ఆలోచించడం కూడా మానుకున్నాడు.

కశ్మీర్ హిందూ రాజు హర్షదేవ్‌పై ఇస్లాం ప్రభావం
ఉత్పాల వంశ రాజు హర్ష్ దేవ్ 1089 నుంచి 1111(కొంతమంది పరిశోధకులు 1038-1089 వరకూ అంటారు) వరకూ కశ్మీర్‌ను పాలించాడు. ఆయన ఇస్లాంకు ప్రభావితం అయ్యాడని చెబుతారు. తర్వాత హర్ష్ స్వయంగా విగ్రహారాధన వదిలేయడంతోపాటు, కశ్మీర్లో ఉన్న విగ్రహాలు, హిందూ ఆలయాలు, బౌద్ధ ఆలయాలను కూడా ధ్వంసం చేశారని అంటారు. అలా చేయడానికి ఆయన 'దేవోత్పతన్ నాయక్' అనే పేరుతో ఒక ప్రత్యేక పదవిని కూడా ఏర్పా టు చేశాడని చెబుతారు. హర్ష్ తన సైన్యంలో తురుష్కులు(తుర్క్) సేనాధిపతులను కూడా నియమించారు.

'రాజతరంగిణి' రచయిత కల్హణుడు ఆయన సమకాలీనుడు. కల్హణుడి తండ్రి చంపక్‌ హర్ష్ మహామంత్రిగా పనిచేశారని చెబుతారు. విగ్రహాలను ధ్వంసం చేసిన హర్ష్‌ను కల్హణుడు అవమానకర శైలిలో 'తురుష్క్' అని నిందించాడు. 1277లో వెనిస్ యాత్రికుడు మార్కోపోలో కశ్మీర్‌లో ముస్లింల ఉనికి కనిపించిందని చెప్పాడు. ఆ సమయంలో కశ్మీర్ బయటి ప్రాంతాల్లో, సింధు నది చుట్టుపక్కల దరాద్ తెగ ప్రజలు భారీగా మతం మారారని, ఇస్లాం స్వీకరించారని చరిత్రకారులు చెబుతున్నారు.

కశ్మీర్‌లో ఇస్లాం ప్రచారం జోరందుకుంది. జనం దానిని భారీగా స్వీకరించారు. ప్రజలు రాజులు, సామంతుల ఘర్షణల మధ్య నలిగిపోవడమే దానికి కారణం. ముఖ్యంగా రైతులకు రెట్టింపు కష్టాలు ఎదుర్కున్నారు. ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడడంతో వాళ్లకు భూముల్లో ఏ పంట పండేది కాదు. వరసగా కరువు, భూకంపాలు, వరదలు, కార్చిచ్చు లాంటివి రైతుల జీవితాలను విషాదంలో ముంచేశాయి. సరిగ్గా అదే సమయంలో ముస్లిం సైనికులు, సూఫీ మత ప్రచారకులు వారిని కలవడం మొదలైంది. ఇస్లాం అనే కొత్త ఆలోచన వారి మనసులో ఒక నమ్మకం, ఒక ఆశను రెకెత్తించేదిలా మారింది. ఇస్లాం మతంలోకి మారడం వల్ల శతాబ్దాల నాటి దోపిడీ ఆచారాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని వారు భావించారు.

కశ్మీర్ మొదటి ముస్లిం పాలకుడు-ఒక టిబెట్ బౌద్ధుడు
కశ్మీర్‌కు మొదటి ముస్లిం పాలకుడి కాలంలో అక్కడ ఇస్లాం ప్రచారంలో కీలక మలుపు వచ్చింది. ఆ పాలకుడు నిజానికి ఒక టిబెట్ బౌద్ధుడు, అతడి రాణి ఒక హిందూ. 1318 నుంచి 1338 మధ్యలో 20 ఏళ్ల పాటు కశ్మీర్‌ అల్లకల్లోలమైంది. ఆ సమయంలో యుద్ధాలు, కుట్రలు, తిరుగుబాట్లు, ఆందోళనలు జరిగాయి. కానీ అంతకుముందు మొదటి 20 ఏళ్లు అంటే 1301 నుంచి 1320 వరకూ రాజా సహదేవ్ పాలనలోనే సూఫీ మత ప్రచారకుల ప్రభావం, ఘర్షణలతో కశ్మీరీలు భారీగా ఇస్లాం మతంలోకి మారిపోయారు. తర్వాత వారికి మొదటి ముస్లిం పాలకుడు కూడా లభించాడు.

సహదేవ్ ఒక బలహీన పాలకుడు, నిజానికి ఆయన పేరుతో మంత్రి, సేనాధిపతి రామచంద్ర రాజ్యాన్ని పాలించేవాడు. రామచంద్రకు అందమైన, తెలివైన కూతురు కోటా కూడా ఆయనకు సహకరించేది. అదే సమయంలో టిబెట్ నుంచి పారిపోయిన ఒక రాజకుమారుడు చిందన్ లేదా రిన్‌చెన్(పూర్తి పేరు లోచన్ రిగ్యాల్ బూ రిన్‌చెన్) కొంతమంది సాయుధ సైనికులతో కశ్మీర్ చేరుకున్నాడు. టిబెట్ రాజకుటుంబం, కాలమాన్య భూటియాల మధ్య జరిగిన అంతర్యుద్ధంలో రించన్ తండ్రి చనిపోయారు. కానీ రించన్ ప్రాణాలు కాపాడుకోడానికి కఠిన దారుల్లో కశ్మీర్‌లోకి రాగలిగాడు. రామచంద్ర రించన్‌కు ఆశ్రయం ఇచ్చాడు.

కశ్మీరీల మనసు గెలవడమే లక్ష్యం
అప్పుడే స్వాత్ లోయలో షా మీర్ అనే ఒక ముస్లిం సేనాధిపతి కూడా తన కుటుంబం, బంధువులతో కశ్మీర్ చేరుకున్నాడు. ఒక ఫకీర్ అతడితో ఒకరోజు నువ్వు కశ్మీర్ పాలకుడివి అవుతావని చెప్పాడు. అతడు ఆ కలను నిజం చేసుకోవాలనే అక్కడకు వచ్చాడు. రామచంద్ర, సహదేవ్ అతడికి కూడా ఆశ్రయం ఇచ్చారు. రామచంద్ర, కోటా, రించన్, షా మీర్ కలిసి కశ్మీర్ పాలన చూసుకునేవారు. అదే సమయంలో మధ్య ఆసియాకు చెందిన ఒక తాతార్ పాలకుడు దుల్చూ ఝీలం లోయ దారి నుంచి కశ్మీర్‌పై దాడి చేశాడు. అతడితో యుద్ధం చేయకుండా రాజు సహదేవ్ కిశ్త్‌వాడ్ పారిపోయాడు.

దుల్చూ 8 నెలల వరకూ కశ్మీర్‌లో కల్లోలం సృష్టించాడు. వనరులు లేక అతడు కనుమల దారిలో భారత మైదాన ప్రాంతాల వైపు వెళ్లాడు. కానీ మంచు తుఫానులో చిక్కుకుని అతడు, వేలమంది సైనికులు చనిపోయారు. కశ్మీర్ పాలన మళ్లీ రామచంద్ర చేతుల్లోకి వచ్చింది. దుల్చూ కశ్మీర్‌ను పూర్తిగా నాశనం చేశాడు. అప్పుడే రించన్‌కు తన లక్ష్యం గుర్తొచ్చింది. అవకాశం చూసి అతడు తిరుగుబాటు చేశాడు. తన మనుషులతో రామచంద్రను హత్య చేసి, కశ్మీర్ సింహాసనం చేజిక్కించుకున్నాడు.

కోటాకు అతడిని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే దారి లేకుండా పోయింది. రించన్ కోటా సోదరుడు అంటే రామచంద్ర కొడుకు రావణచంద్రకు కూడా గౌరవం ఇచ్చాడు. అతడిన తన సేనాధిపతిగా నియమించాడు. కానీ రించన్ అప్పటికీ తనను తాను లామాగా భావించేవాడు కాదు. కోటా రాణి అతడు హిందూ కావాలని కోరుకునేది. రించన్‌కు కశ్మీరీల నమ్మకం గెలుగుచోవడం సవాలుగా మారింది.


కశ్మీర్ అధికారిక మతంగా ఇస్లాం
ఒకసారి అతడు హిందూ మతం కూడా తీసుకోవాలనుకున్నాడు. కానీ అదంత సులభం కాదు. అప్పట్లో కశ్మీరీ శైవ గురువు బ్రాహ్మణ దేవస్వామి అతడిని హిందువుగా మార్చడానికి నిరాకరించారు. దానికి మూడు కారణాలు చెబుతారు. రించన్ టిబెట్ బౌద్ధుడు కావడం, అతడు హిందూ రాజు రామచంద్రను హత్య చేయించడం. ఒకవేళ రించన్ హిందూ మతం స్వీకరిస్తే అతడిని ఉన్నత కులాల్లో చేర్చాల్సి వస్తుంది.

హిందూ మతం తీసుకోలేక చివరికి రించన్ ఇస్లాం మతంలోకి మారాడు. చాలామంది ఆయన ముస్లింగా మారడానికి వెనుక ఇస్లాం మెజారిటీ ప్రాంతం కావడం, పాలనకు రాజకీయ భద్రత, లక్ష్యం అని కూడా చెబుతారు. నిజం ఏదైనా ఇస్లాంలో చేరన తర్వాత రించన్‌కు బుల్‌బుల్ షా 'సదర్ అల్ దీన్' అనే పేరు ఇచ్చారు. అలా ఆయన కశ్మీర్ మొదటి ముస్లిం పాలకుడు అయ్యారు. సదర్-అల్-దీన్ అంటే మతానికి(ఇస్లాం) నాయకుడు అని అర్థం.

చనిపోయిన రాజు రామచంద్ర సోదరుడు రావణచంద్రను కూడా బుల్‌బుల్ షా ఇస్లాంలోకి మార్చేశాడు. పాలనలోని చాలా మంది ఉన్నతాధికారుల అతడి ప్రభావంతో ఇస్లాం మతంలోకి మారారు. రించన్‌తో వచ్చిన టిబెటన్లు కూడా ఇస్లాం తీసుకున్నారు. ఇలా బుల్‌బుల్ షా ఒక పద్ధతి ప్రకారం ఇస్లాంను కశ్మీర్ అధికారిక మతంగా మార్చాలనే తన లక్ష్యాన్ని చేరడంలో విజయవంతం అయ్యారు. శ్రీనగర్‌ ఐదో వంతెన కింద కశ్మీర్‌లో కట్టిన మొదటి మసీదును రించన్ నిర్మించాడు. ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ బుల్‌బుల్ లాంకర్ అంటారు.

1327లో బుల్‌బుల్ షా చనిపోయినప్పుడు, ఆయన్ను ఆ మసీదు దగ్గరే ఖననం చేశారు. బుల్‌బుల్ షాను చాలాసార్లు బుల్‌బుల్-ఎ-కశ్మీర్‌గా గుర్తు చేసుకుంటారు. రించన్ త్వరగానే చనిపోయారు. కానీ ఆ తర్వాత కశ్మీర్ ఇస్లాం సామ్రాజ్యం పూర్తి దశను చూసింది. ఇన్ని జరిగినా కశ్మీరీ ప్రజల్లో ఇస్లాం మతం లాంటిది ఎప్పుడూ కనిపించలేదు. దాని గురించి విడిగా మరో కథను రాయచ్చు.


కశ్మీరీ సంస్కృతి ప్రత్యేకం
భారత చరిత్రను హిందూ వర్సెస్ ముస్లింల దృష్టితో చూడడం-చూపించడం ఎంత అభద్ధమో.. అలాగే కశ్మీర్ లోయలో ఇస్లాం ఎక్స్‌క్లూజివ్, తప్పనిసరి అని చెప్పడం కూడా ఒక విధంగా కల్పనే. అదే విధంగా కశ్మీరీలది 'మూఢభక్తి' అని మిగతా భారతదేశం అంతటా జరుగుతున్న ప్రచారం కూడా కూడా నిరాధారమే. ఇటీవల కశ్మీర్‌పై 'కశ్మీర్‌నామా' పుస్తకం రాసిన అశోక్ కుమార్ పాండేయ్ ఈ పుస్తకంలో ఒక ముఖ్యమైన మాట చెప్పారు. "బౌద్ధం, కాశ్మీర్ శైవం, ఇస్లాం సూఫీ సంప్రదాయాల సమన్వయంతో కశ్మీర్ ఏర్పడింది. వీటి ప్రభావం అక్కడి సామాజిక-రాజకీయ జీవితాలపై స్పష్టంగా కనిపిస్తుంది" అన్నారు.

"అయితే ఒకవైపు కశ్మీర్‌లోని రెండు సమాజాల వైరుధ్యాలపై ముసుగు వేసి, ప్రపంచం ముందు 'కశ్మీరియత్‌'ను ప్రదర్శించడం, మరోవైపు దీనిని హిందూ-ముస్లిం ఘర్షణలుగా చూడడం రెండూ మితిమీరి చెప్పడమే" అని ఆయన అంగీకరిస్తారు. "బౌద్ధులు, శైవులు, సూఫీ ఇస్లాం కలిసి ఒక ప్రత్యేక కశ్మీరీ సంస్కృతి ఏర్పడింది. దానిని అర్థం చేసుకోడానికి చాలా ఉదారమైన, లోతైన దృష్టి చాలా అవసరం" అని పాండేయ్ అందులో రాశారు.

"దురదృష్టవశాత్తూ, దేశంలో అందరూ ఆ దృష్టితో చూసేలా చేయడంలో మనం ప్రస్తుతం చాలా ఘోరంగా విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే కొన్నిసార్లు చరిత్ర పుటలను తిప్పి చూపించడం కూడా చాలా అవసరం" అని ఆయన ఆ పుస్తకంలో చెప్పారు.

దీనిపై మరింత చదవండి :