గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 21 మార్చి 2022 (21:00 IST)

కేసీఆర్: ‘కశ్మీర్ ఫైల్స్ కాదు, అభివృద్ధి ఫైల్స్ మీద చర్చ చేయాలి... ఈడీ, బీడీ బెదిరింపులకు ఎవడూ భయపడడు’

''కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నిరకాలుగానూ విఫలమైంది. ఈ ప్రభుత్వం పోవాలి. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. ప్రగతిశీల విధానంలో పనిచేసే ప్రభుత్వం కావాలి. అందుకోసం మేం కృషి చేస్తాం'' అని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ''నేనిప్పుడు జాతీయ రాజకీయాలు చేస్తున్నాను. అందులో నాన్చుడు లేదు. జాతీయ రాజకీయాల్లో ఒక శూన్యత ఉంది. ఆ ఖాళీని భర్తీ చేయటానికి మేం ప్రయత్నిస్తున్నాం. 2024లో సంపూర్ణ క్రాంతి వైపు భారతదేశం ప్రయాణిస్తుంది'' అని కేసీఆర్ పేర్కొన్నారు.

 
కేసీఆర్ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఉగాది తర్వాత దిల్లీలో ధర్నా చేస్తుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ రైతు ధర్నాకు అందరూ కలిసి రావాలని కోరారు. ఆహార ధాన్యాల సేకరణలో దేశం మొత్తం ఒకే రకమైన విధానం ఉండాలన్నారు. పంజాబ్‌లో లాగానే తెలంగాణ వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్రం కొనుగోలు చేయాలన్నారు. ''మేం కోరేది గొంతెమ్మ కోరిక కాదు. పంజాబ్‌ తరహాలోనే తెలంగాణలో కూడా పండిన ధాన్యం తీసుకుని, మద్దతు ధర ఇవ్వండి. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చేతులెత్తి నమస్కరిస్తూ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు. మేం తప్పకుండా ఉద్యమిస్తాం. మీరే భంగపడతారు'' అని కేసీఆర్ పేర్కొన్నారు.

 
ప్రశాంత్ కిషోర్‌ నాకు మంచి మిత్రుడు.. డబ్బు కోసం పని చేయరు - కేసీఆర్
దేశంలో మార్పు తెచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ తనతో కలిసి పనిచేస్తారని కేసీఆర్ చెప్పారు. ''ప్రశాంత్ కిషోర్ ఏడేళ్లుగా నాకు మంచి మిత్రుడు. ప్రశాంత్ కిషోర్ డబ్బు కోసం పనిచేయరు. దేశం కోసం పనిచేస్తారు. ప్రజల పల్స్‌ను ప్రశాంత్ కిషోర్ పట్టుకుంటారు. ప్రశాంత్ కిషోర్‌ నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పని ఆయన చేస్తున్నారు. ఆ వేదిక ఏమిటనేది మీ ముందుకు వస్తుంది. పరిపూర్ణమైన విజయాన్ని సాధిస్తుంది'' అని పలు ప్రశ్నలకు సమాధానంగా ఆయన వివరించారు.
''రాష్ట్రంలో ఆరునూరైనా ముందస్తు ముచ్చటే లేదు. ఈసారి 95 నుంచి 105 స్థానాలు గెలుస్తాం'' అని కేసీఆర్ మరొక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విలేఖరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

 
'యూపీఏను కాదని బీజేపీకి అధికారం ఇస్తే.. అంతకన్నా అధ్వాన్నంగా తయారైంది'
''బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడిచిపోయింది. దేశానికి ఏమైనా మంచి చేయాలంటే 8 ఏళ్లు చాలా ఎక్కువ సమయం. దేశంలో ఒక కొత్త ఫ్యాక్టరీ కట్టలేదు. ఒక కొత్త ప్రాజెక్టు కట్టలేదు. యూపీఏను కాదని బీజేపీకి అధికారం ఇస్తే.. అంతకన్నా అధ్వాన్నంగా తయారైంది. జీడీపీ అప్పటి కన్నా పడిపోయింది. నిరుద్యోగిత రేటు బాగా పెరిగిపోయింది. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ ప్రభుత్వం పోవాలని దేశం ఒక నిర్ణయానికి వచ్చింది. దేశంలో ఆ రకంగా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్లు చేసిందేమీ లేదని తెలిసిపోయింది. 

 
ఈ ఎనిమిదేళ్ల పాలనా కాలంలో మా ప్రతిభ ఇంతే, మా సామర్థ్యం ఇంతేనని వాళ్లు తమ ఆచరణలో బయటపెట్టుకున్నారు. కొత్తవేవీ లేకపోగా ఉన్నయన్నీ అమ్మేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలన్నీ తాబేదారులకు అప్పనంగా అమ్మేస్తున్నారు. అయితే డీమానిటైజేషన్ లేకపోతే మానిటైజేషన్ చేయటం. గ్రామాలను బాగు చేసుకోవాలంటే పంచాయతీల ఆస్తులను కుదవపెట్టుకోండి అని చెప్తున్నారు.

 
'కశ్మీర్ ఫైల్స్ కాదు.. అభివృద్ధి ఫైల్స్ మీద చర్చ చేయాలి'
సోషల్ మీడియాలో విషప్రచారం నాటుతున్నారు. అవాంఛనీయం, అనారోగ్యమైన దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు 'కశ్మీర్ ఫైల్స్' ఇప్పుడొక నినాదం. ప్రోగ్రెస్ ప్రభుత్వం ఉంటే.. ఇరిగేషన్ ఫైల్స్, ఇండస్ట్రియల్ ఫైల్స్, ఎకానమిక్ ఫైల్స్ అవుంటాయి కానీ, ఈ దిక్కుమాలిన వ్యవహారమేంది? దిల్లీలో ఆ కశ్మీరీ పండిట్లే చెప్తున్నారు. తమకు జరిగిన దానిని ఓట్ల రూపంలో సొమ్ముచేసుకునే దుర్మార్గమైన ప్రక్రియ ఈ ప్రచారమని మొత్తుకుంటున్నారు. ఈ రకమైన దేశ విభజన, ప్రజల విభజన చేసి ఒక రకమైన విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కరెక్ట్ కాదు. అది తెలంగాణ సమాజానికి జీర్ణం కాదు.

 
ప్రగతి ఏదైనా ఇంక్లూజివ్‌గా ఉండాలి. మొత్తం దేశాన్ని కలుపుకోవాలి. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సెలవులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులను ఈ సినిమా చూడాలని చెప్తున్నారు. ఇదేం విభజన రాజకీయం? ఎక్కడికి తీసుకెళతారు ఈ దేశాన్ని? అనేక దశాబ్దాల తరబడి అనేక ప్రభుత్వాలు సాగించిన కృషి వల్ల ఒక వాతావరణం నిర్మాణమైతే భారతదేశం ఐటీ రంగంలో ఒక అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఈ విభజన రాజకీయాలు, విద్వేషాలతో వాతావరణం కలుషితమైతే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు?

 
'కశ్మీర్ ఫైల్స్, పుల్వామా.. ఇవి తప్ప.. భారీ పరిశ్రమ, పెద్ద ప్రాజెక్టుల ప్రసక్తే లేదు'
ప్రభుత్వ అసమర్థత అనేక రకాలుగా బయటపడింది. కరోనా వస్తే దాన్ని టాకిల్ చేయటంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. స్వాతంత్ర్యానంతరం కోట్లాది మంది పేద కూలీలను పిల్లాపాపలతో వేల కిలోమీటర్లు నడిపించిన ఘనత ఈ ప్రభుత్వానిది. మనమంతా పవిత్రమని భావించే గంగానదిలో కూడా వందల వేల శవాలు తేలేటట్టు చేసిన ప్రభుత్వం ఇది. ఇది వాస్తవం. దీనిని దాచలేరు. నిన్నగాక మొన్న యుక్రెయిన్ పరిణామాలు. 20 వేల మంది పిల్లలుంటే వాళ్లని తేలే. నెల ముందు ఎంబసీని తరలించారు. కానీ పిల్లలను తేలే. వారి చదువుల గురించీ పట్టించుకోలేదు.

 
అన్ని సూచీల్లోనూ భారతదేశం.. హ్యాపీనెస్ ఇండెక్స్‌లో 140 దేశాల్లో 139వ స్థానం భారత దేశానిది. యువత నిరుద్యోగితలో సిరియా కన్నా అధ్వాన్నమైన పరిస్థితిలో ఉన్నాం. ఆకలి సూచీ, మానవాభివృద్ధి సూచీల్లో అన్నిటిలోనూ తిరోగమనంలో ఉంది. కశ్మీర్ ఫైల్స్, విద్వేషాలు పెట్టటం, సమాజాన్ని విడదీయటం ఇదే తమకు చేతనవుతుందని చెప్తున్నారు. వందకు వంద శాతం మావల్ల కాదు.. మావల్ల ఇదే అవుతది, కశ్మీర్ ఫైల్స్, పుల్వామా.. ఇవి తప్ప.. భారీ పరిశ్రమనో, పెద్ద ప్రాజెక్టనో ఆ ప్రసక్తే లేదు. వాళ్ల వాగ్దానం ఒక్కటి కూడా నెరవేరలేదు. రెండు కోట్ల ఉద్యోగాలన్నారు. లేదు. దేశంలో 15 లక్షల ఖాళీలున్నాయి. వాటి మీద కూడా మేం ఉద్యమం చేస్తాం. విపరీతమైన బ్యాంకుల కుంభకోణాలు జరుగుతున్నాయి. అంతకుముందు అరుదుగా ఉండేవి. ఎన్‌పీఏల పేరుతో 11 లక్షల కోట్ల రుణాలను కొట్టేశారు. పది, పదిహేను వేల కోట్ల రైతుల ధాన్యాలు కొనమంటే కొనరు.

 
హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉండాల్నా? విద్వేషాలు పెరగాల్నా?
ఈ కశ్మీర్ ఫైల్స్ అనే ఫిలాసఫీని తిప్పికొట్టాలి. దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని అనుకున్నాం. ఈ దేశంలో భారీ పరివర్తన రావాల్సిన అవసరముంది. దేశంలో ఫ్రీవిల్ ఉందా? ఈ పరిస్థితి మంచిదా? హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉండాల్నా? విద్వేషాలు పెరగాల్నా? పిల్లలకు ఉద్యోగాలు పెరగాలా? ఉన్న ఉద్యోగాలు పోవాలా?

 
జాతీయ రాజకీయాల్లో ఒక శూన్యత ఉంది. అందులో సందేహమేమీ లేదు. ఆ ఖాళీ ఏ విధంగా భర్తీ కావాలి? బీజేపీ వ్యతిరేక ఫ్రంటా అని అడిగారు. భారత ప్రజల మేలు కోరే ఫ్రంట్ ఇది. అలాంటి రాజకీయ ప్రక్రియ, రాజకీయ వ్యవస్థ రావాలి. అది ఎలా వస్తుందో చూడాలి. అద్భుతమైన పద్ధతిలో కొత్త జాతీయ పార్టీ రావచ్చు కదా. ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ప్రక్రియ మొదలైంది. ఈడీ, బీడీ బెదిరింపులకు ఈడ ఎవడూ భయపడడు. స్కాములు చేసే వాళ్లు, దొంగలు భయపడాలి.

 
ప్రశాంత్ కిశోర్ బీజేపీకి పనిచేశాడు. మమతా బెనర్జీకి పనిచేశాడు. జగన్‌కు పనిచేశాడు. మొన్న స్టాలిన్‌కు పనిచేశాడు. 12 రాష్ట్రాల్లో పనిచేశాడు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయటానికి ప్రశాంత్ కిశోర్‌ను నేనే పిలిచాను అని కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కేసీఆర్ మళ్లీ వరి అంటున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. వడ్లు కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శించారు.