గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (19:31 IST)

జగ్గారెడ్డికి చెక్... హరీష్ రావును ఎందుకు కలిశారంటే?

టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బాధ్యతల్లో కోత విధించింది.  ఈ మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చిన అదనపు బాధ్యతల్లో కోత విధించింది. ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది టీపీసీసీ. 
 
వర్కింగ్ ప్రెసిడెంట్‌‌గా ఆయనకు అప్పగించిన పార్లమెంట్ నియోజక వర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి తప్పించింది టీపీసీసీ. ఆయనకు గతంలో ఉన్న బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
 
ఇకపోతే.. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినా సరే సోనియా, రాహుల్ గాంధీలకు తాను విధేయుడిగానే ఉంటానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయనుందనే ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
వీహెచ్ కూతురు ఒక డాక్టర్ అని.. ఆమెకు సంబంధించిన పని కోసం వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావును ఆయన కలిశారని అన్నారు. అందులో తప్పేంటని ప్రశ్నించారు. మంత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చినప్పుడు సదరు నేత ఎక్కడుంటే అక్కడికి వెళ్లాల్సి వస్తుందన్నారు.
 
టీడీపీలో రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఎవరెవరిని కలిశారు... ఎవరెవరిని ఎలా వాడుకున్నారన్నది బయటపెడుతానని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనతో అసెంబ్లీలో రేవంత్ ఏం మాట్లాడినది కూడా బయటకు వెల్లడిస్తానన్నారు. ఇవాళ జరిగిన కాంగ్రెస్ సీనియర్ల ప్రత్యేక భేటీ పార్టీ వ్యతిరేక కార్యక్రమం ఎంతమాత్రం కాదన్నారు. 
 
కాగా, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సీనియర్ల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉన్నారు. రేవంత్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని... ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పలు సందర్భాల్లో సీనియర్లు విమర్శించారు.