శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (22:07 IST)

మలేషియా: పోగొట్టుకున్న సెల్ ఫోన్‌లో 'దొరికిన' కోతుల సెల్ఫీలు

మలేషియాకు చెందిక ఒక విద్యార్థి మొబైల్ ఫొన్ పోయింది. ఆ మర్నాడు అది తన ఇంటి వెనకాల ఉన్న అడవిలో దొరికింది. తెరిచి చూస్తే అందులో కోతుల సెల్ఫీలు, వీడియోలు కనిపించాయి. ఫోన్ కొరుక్కు తినే ప్రయత్నం చేస్తున్న కోతి వీడియోతో సహా బోల్డు సెల్ఫీలు, వీడియోలు అందులో కనిపించాయి.

 
జాక్రిడ్జ్ రోడ్జి వాటిని తన ట్విట్టర్‌లో షేర్ చేసిన దగ్గరనుంచీ అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 20 ఏళ్ల రోడ్జి నిద్రపోయి లేచేసరికి ఫోన్ పోయింది. ఎలా పోయిందో అతనికి అర్థం కాలేదు. ఆ చుట్టుపక్కలంతా అడవి. ఎవరూ ఎత్తుకెళ్లిపోయే అవకాశం కూడా లేదు. దొంగతనం చేసిన జాడలేమీ కనిపించలేదు. ఏదో మాయ జరిగి ఉంటే తప్ప ఫోన్ పోయే అవకాశం లేదని రోడ్జి బీబీసీతో చెప్పారు.

 
దక్షిణ మలేసియాలోని జోహోర్‌లో బతు పహాత్‌కు చెందిన రోడ్జి కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. ఆరోజు శనివారం. ఉదయం 11.00 గంటలకి నిద్ర లేచి చూసేసరికి ఫోన్ కనిపించలేదు. తరువాత రోడ్జి బీబీసీకి చూపించిన వీడియోల్లో అదేరోజు మధ్యాహ్నం 2.00 గంటలకి ఒక కోతి ఆ ఫోన్ కొరికి తినే ప్రయత్నం చేస్తున్న వీడియో ఉంది.

 
ఆ కోతి అడవిలో గుబురు చెట్ల మధ్య ఉన్నట్టు ఫోన్‌లో కనిపించిన సెల్ఫీలు, వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఆదివారం మధ్యహ్నం వరకూ వారికి ఫోన్ జాడ తెలియలేదు. ఆరోజు మద్యాహ్నం ఒక కోతి వాళ్ల ఇంటి బయట కూర్చున్నట్టు రోడ్జి తండ్రి గమనించారు. రోడ్జి ఫోన్‌కు మళ్లీ కాల్ చెయ్యగా, ఇంటి వెనకాల కొన్ని అడుగుల దూరంలో ఉన్న అడవిలోంచి ఫోన్ రింగ్ టోన్ వినిపించింది. పరుగెత్తికెళ్లి చూడగా, అక్కడ ఒక తాటి చెట్టు పక్కన, నేల మీద ఆకుల మధ్యలో బురద అంటుకుని ఉన్న ఫోన్ కనిపించింది.

 
ఫోన్‌లో దొంగ ఫొటో ఉండొచ్చు అని రోడ్జి మామయ్య సరదాగా అన్నారు. సరే చూద్దామని ఫోన్ శుభ్రం చూసి చూస్తే దాన్నిండా కోతుల ఫొటోలే కనిపించాయని రోడ్జి తెలిపారు. ఇలా ఎప్పుడూ జరగలేదని, బహుశా తెరిచి ఉంచిన తన సోదరుని పడక గది కిటికీలోంచి కోతి ఇంట్లోంచి వచ్చి ఉండొచ్చని రోడ్జి తెలిపారు. "ఇలాంటివి వందేళ్లకోసారి జరుగుతాయి" అని రాస్తూ ఈ కోతి సెల్ఫీలు, వీడియోలు ఆదివారం నాడు రోడ్జి ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. అప్పటినుంచీ అవి వైరల్ అయ్యాయి.

 
కోతుల సెల్ఫీలు వార్తల్లోకెక్కడం ఇది మొదటిసారి కాదు. 2011లో ఒక మకాక్ (కోతుల్లో ఒక రకం) తన ఫోన్‌ నుంచీ తీసుకున్న సెల్ఫీ కారణంగా ఒక బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ జంతు హక్కుల పరిరక్షణ బృందంతో రెండేళ్లు పోరాడవలసి వచ్చింది. ఇండోనేషియా అడవుల్లో నరుటో అనే మకాక్, డేవిడ్ శ్లాటర్ అనే బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ కెమేరాని ఎత్తుకుపోయి బోల్డు సెల్ఫీలు తీసుకుంది.

 
ఆ కెమేరా తనది కాబట్టి ఆ ఫొటోలపై తనకే అధికారం ఉంటుందని శ్లాటర్ వాదించారు. కానీ, పేటా అందుకు ఒప్పుకోలేదు. అవి కోతి తీసుకున్న సెల్ఫీలు కాబట్టి కోతికే చెందుతాయని అన్నారు. కోతులకు కాపీ రైట్ ఇవ్వలేమని యూఎస్‌లోని ఒక న్యాయస్థానం పేటా వాదనను కొట్టిపారేసింది. అయితే, ఈ ఫొటో వల్ల తనకు వచ్చే లాభాల్లో 25% డబ్బును నరుటోతో సహా ఇతర మకాక్‌లను పరిరక్షిస్తున్న ఛారిటీకి ఇస్తానని శ్లాటర్ అంగీకరించారు. 2017లో ఈ వివాదం ముగిసింది.