1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 21 జులై 2022 (17:48 IST)

Marriage: ‘‘మా భర్త 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. పక్క పక్క వీధుల్లో ముగ్గురితో కాపురాలు పెట్టాడు’’ - ఓ నిత్యపెళ్లికొడుకు మోసాలపై బాధితులు ఏం చెప్తున్నారు?

woman victim
'నేను సంపాదించిన డబ్బే కాదు, మా బంధువుల దగ్గర నుంచి కూడా అప్పు తీసుకొచ్చి నా భర్తకి ఇచ్చా. ఇప్పుడు ఆ డబ్బు సెటిల్ చేస్తా అంటున్నాడు. మరి నా శరీరాన్ని కూడా అతనితో పంచుకున్నా కదా... మరి దానికి ఎలా విలువ కడతాడు వాడు?' ఇప్పటి వరకు 8 పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అడపా శివశంకర్ బాబు వల్ల మోసపోయిన వైదేహి (బాధితురాలి కోరిక మేరకు పేరు మార్చడం జరిగింది) ఆవేదన ఇది. శివశంకర్ బాధితుల్లో ఈమె ఒకరు.

 
'నా భర్త నిత్య పెళ్లి కొడుకని తెలిసిన తరువాత వాడికి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని నా వంతు కృషి చేస్తున్నా' అని వైదేహి చెప్తున్నారు. శివశంకర్ తమను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఇద్దరు మహిళలు ఈ నెల 13న హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టారు. 'కొండాపూర్‌లో నా ఫ్లాట్‌కు ఇటు 2 వీధులు దాటి ఒక అమ్మాయితో... అటు 200 మీటర్ల దూరంలో మరొక అమ్మాయితో శివశంకర్ కాపురం పెట్టాడు' అని వైదేహి చెప్తున్నారు. ఇలాగే తమను కూడా మోసం చేశాడంటూ మరి కొంతమంది అమ్మాయిలు చెప్పుకొచ్చారు. 'ఇప్పటి వరకు 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం 8 మందితో జరిగిన పెళ్లిళ్ల గురించి సమాచారం సేకరించగలిగాం' అని ఆ మహిళలు నాటి ప్రెస్ మీట్‌లో చెప్పుకొచ్చారు.

 
'శివశంకర్ ఒకరిని పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే మరో ఇద్దరిని కూడా పెళ్లి చేసుకుంటాడు. విషయం తెలిసిన తరువాత నిలదీస్తే, కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి ష్యూరిటీ ఇప్పిస్తాడు. తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేస్తానంటూ అంతకు ముందు పెళ్లి చేసుకున్న వారికి హామీ ఇస్తాడు. కొన్నేళ్లుగా ఇదే పని. ఇప్పుడైనా దీనికి ఫుల్ స్టాప్ పడాలి' అన్నారు వైదేహి.

 
ఎవరు ఈ అడపా శివశంకర్?
'గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడికి చెందిన అడపా శివశంకర్‌ బాబు ఓ ప్రైవేట్ ఉద్యోగి. 2018లో మంగళగిరి ప్రాంతానికి చెందిన ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చాడు. నాటి నుంచి విడాకులు తీసుకున్న ఆడవారి మీద దృష్టి పెట్టాడు. విడాకులు తీసుకొని కొత్త జీవితం మొదలుపెట్టాలని అనుకునే మహిళల గురించి మాట్రిమోనీ సైట్లలో వెతికేవాడు. ఉన్నత విద్యావంతులు, ఉద్యోగం చేసే అమ్మాయిలే టార్గెట్‌గా నెంబర్లు తీసుకొని వారితో మాట్లాడతాడు. వారి తల్లితండ్రులు, కుటుంబ సభ్యులతో కూడా మాటలు కలుపుతాడు.

 
తన కుటుంబం గురించి అడిగితే తల్లితండ్రులు లేరని, విడాకులు అయ్యాయని శివశంకర్ చెప్పేవాడు. తనకు ఒక కూతురు ఉందని ఒక పాపను కల్పిస్తాడు. అద్దె పిన్ని బాబాయిలను చూపించి పెళ్లి చేసుకుంటాడు. వారి నుంచి తెలివిగా డబ్బు లాగుతాడు. ఒక నెల నెలన్నర తరువాత నువ్వు పని చేయడం ఇష్టం లేదంటూ ఉద్యోగం మానేయమని ఆ అమ్మాయిల మీద ఒత్తిడి చేయడం మొదలుపెడతాడు. ఈలోగా అంతకు ముందు పెళ్లి చేసుకొని మోసపోయిన మహిళలు అనుమానిస్తే వారి దగ్గర తీసుకున్న డబ్బును సెటిల్ చేస్తానని చెబుతాడు.

 
ఇలా డబ్బులు సెటిల్ చేస్తానని చెప్పడానికి కారణం, మరో భార్య డబ్బు ఇస్తుందన్న ధైర్యం. అవసరం ఉందని చెప్తూ.. కొత్తగా పెళ్లి చేసుకున్న మహిళ నుంచి డబ్బు తీసుకుని, అనుమానించిన భార్యకు కొంత ముట్టచెప్పేవాడు. డబ్బు ఇచ్చిన మహిళ వాటిని తిరిగి ఇవ్వాలని అడిగితే మరో మహిళతో పరిచయం పెంచుకొని ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇలా ఇప్పటి వరకు 11 పెళ్లిళ్లు చేసుకున్నాడు' అని బీబీసీతో చెప్పారు వైదేహి. ప్రస్తుతానికి 8 మంది మహిళల గురించి ఆధారాలు సేకరించగలిగానని ఆమె చెబుతున్నారు. ఇప్పటికే ఒకసారి విడాకులు తీసుకున్నాం కాబట్టి, రెండోసారి కూడా మోసపోయామనే విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే భయంతో కొందరు బాధితులు ముందుకు రావడం లేదని వైదేహి తెలిపారు. అడపా శివశంకర్ చేతిలో మోసపోయామని చెబుతున్న మహిళల్లో వర్షిణి కూడా ఒకరు. ఆమె కోరిక మేరకు పేరు మార్చాం.

 
'నన్ను 2021 నవంబర్‌లో పెళ్లి చేసుకున్నాడు. 2022 ఫిబ్రవరిలో వైదేహిని పెళ్లి చేసుకున్నాడు. ఏప్రిల్‌లో మ్యారేజీ రిజిస్ట్రేషన్ జరిగింది. మరొక అమ్మాయిని ఏప్రిల్‌లో పెళ్లి చేసుకొన్నాడు. ఆ అమ్మాయి ఇప్పుడు గర్భవతి. శివశంకర్ గురించి ఆ అమ్మాయికి చెప్పినా అతనితో వెళ్లిపోయింది' అని బీబీసీతో చెప్పారు వర్షిణి. 'విడాకుల తరువాత కొత్త జీవితం మొదలుపెట్టాలనుకునే నా లాంటి అమ్మాయిలు శివశంకర్ చేతుల్లో మోసపోతున్నారు. మంచి ఉద్యోగం చేసే భర్త రావాలని మాకు... తమ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని తల్లితండ్రులకు ఉంటుంది కదా. మా జీవితానికి భరోసా ఇచ్చేవాడు అయితే చాలు అని అనుకుంటారు కదా... ఆ ఆశనే ఇతను వాడుకున్నాడు' అని వర్షిణి ఆవేదన వ్యక్తం చేసింది.

 
మహిళలు అతనిని అలా ఎలా నమ్ముతారు?
మహిళలను కలిసినప్పుడు తాను నెలకు లక్షల్లో సంపాదిస్తునట్టు చెబుతాడు. ఆ తరువాత పరిచయం పెళ్లి దాకా వెళ్లే సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినంటూ నకిలీ పే స్లిప్పులు, ఐడీ కార్డులు సృష్టిస్తాడు. అలా సదరు మహిళనే కాదు ఆమె తల్లితండ్రులను వారి బంధువులను నమ్మిస్తాడని బాధితులు చెబుతున్నారు. 'పెళ్లి జరిగిన నెల రోజులకు తన భార్య పని చేయడం ఇష్టం లేదంటూ ఉద్యోగాలు మానేసేలా వారి మీద ఒత్తిడి చేస్తాడు. ఆ మహిళలు బయట తిరుగుతుంటే అతని గుట్టు రట్టు అవుతుందేమో అన్న భయం.

 
ఆ తరువాత మెల్లగా తనకు విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చిందని, కంపెనీ తనని త్వరలోనే ఫారిన్ పంపనుందని కథ అల్లడం మొదలుపెడతాడు. అందరం హ్యాపీగా అక్కడే సెటిల్ కావొచ్చని నమ్మిస్తాడు. ఆ తరువాత తన పాస్‌పోర్ట్ పోయిందని, అందుకే అమెరికా వెళ్లడం ఆలస్యం అవుతోందని చెబుతాడు. ఆ క్రమంలో తనకు జీతం కూడా ఆపేశారని, అన్ని డాక్యుమెంట్స్ మళ్లీ తయారు చేసుకోవడానికి లక్షల్లో ఖర్చవుతుంది అని నమ్మిస్తాడు. అలా పెళ్లి చేసుకున్న మహిళ నుంచే కాకుండా ఆమె బంధువుల దగ్గర నుంచి కూడా డబ్బులు అప్పు చేసి తెచ్చేలా చేస్తాడు. ఇలా ఒక్కో మహిళ నుంచి రూ. 20 నుంచి రూ. 35 లక్షల వరకు వసూలు చేశాడు' అని వర్షిణి చెప్పుకొచ్చారు.

 
అనుమానం ఎలా కలిగింది?
వర్షిణిని పెళ్లి చేసుకున్న తరువాత ఇటీవల ప్రాజెక్ట్ పనిమీద తనను అమెరికా పంపుతున్నారని శివశంకర్ ఆమెకు చెప్పాడు. నిన్ను కూడా తీసుకెళ్తానని చెప్పి మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌ కూడా చేయించాడు. వర్షిణి చెల్లికి కూడా అక్కడే ఉద్యోగం ఇప్పిస్తాను అని నమ్మించాడు. అమెరికా వీసా ప్రాసెస్ కోసం డబ్బు అవసరమని భార్య నుంచి, అత్తింటి నుంచి డబ్బు తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత అమెరికా ప్రయాణం వాయిదా పడిందని చెప్పాడు. ఎన్ని రోజులు అయినా డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో అత్తింటివారు ఆరా తీయగా వివాదం మొదలైంది. అదిగో ఇదిగో అంటూ శివశంకర్ తప్పించుకుంటూ తిరిగాడు. అతడి వ్యవహారంపై అనుమానం వచ్చి గట్టిగా అడిగేసరికి పోలీసులకు ఫిర్యాదు చేసుకోమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.

 
వర్షిణి తన తండ్రితో కలిసి మెదక్‌ జిల్లా రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శివశంకర్‌ను పిలిపించారు. అతడు వైదేహితో స్టేషన్‌కు వచ్చాడు. ఆమె తన భార్య అంటు పోలీసులకు పరిచయం చేశాడు. అంతేకాదు అలా తీసుకువచ్చిన వైదేహిని కూడా అబద్ధాలు చెప్పి నమ్మించాడు. వర్షిణి తనను మోసం చేసి తిరిగి కేసు పెడుతోందని, పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనకు మద్దతుగా నిలవాలని కోరాడు. వర్షిణి వాళ్లకు డబ్బు ఇచ్చే భరోసా తమదేనంటూ తనతో తీసుకువచ్చిన వైదేహితో చెప్పించాడు. వైదేహికి కూడా ఆ తరువాత నెమ్మదిగా శివశంకర్ ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. 'రోజు నైట్ షిఫ్ట్ అని చెప్పడం... ఒకే అమ్మాయితో తరచూ మాట్లాడుతూ తను నా క్లయింట్ అని చెప్పడం.. రహస్యంగా మరో ఫోన్ వాడటం... ఆ ఫోన్ కారులోనే వదిలి రావడం చేసేవాడు. చివరకు బాత్రూంలో కూడా రహస్యంగా ఫోన్‌లో మాట్లాడడం చూశాం.

 
ఆ ఫోన్ లాక్కొని మాట్లాడగా తానూ అతని భార్య అని చెప్పింది. ఇన్ని విషయాలు తెలిసిన తరువాత ఆశ్చర్యపోయి వర్షిణిని కలిశాను. ఇద్దరం కలిసి అతని గురించి మరిన్ని వివరాలు సేకరిస్తే పక్క పక్క వీధుల్లోనే మూడు కాపురాలు పెట్టాడని తెలిసింది. శివశంకర్ 2018 నుంచి ఇలా మహిళల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడని తెలుసుకున్నాం. అతని మీద గతంలో కూడా కొందరు మహిళలు కేసు పెట్టారని తెలిసి, ఆ వివరాలు సేకరించాం' అని వైదేహి వివరించారు. 2018, 2019లో శివశంకర్ మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు కూకట్‌పల్లిలో రెండు, అనంతపూర్‌లో ఒక కేసు కూడా నమోదైంది. శివశంకర్ మోసాలపై కేపీహెచ్‌బీ, ఆర్‌సీ పురం, గచ్చిబౌలి, అనంతపురం, ఎస్‌ఆర్‌ నగర్‌ ఠాణాలలో వేర్వేరు మహిళలు ఫిర్యాదులు ఇచ్చినట్లు బాధిత మహిళలు చెప్పుకొచ్చారు.

 
శివ శంకర్ ఏమంటున్నాడు?
తమను శివశంకర్ పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఆరోపించిన తరువాత అతను ఒక వీడియో విడుదల చేశాడు. ఎక్కడికి పారిపోలేదని తాను గుంటూరులోనే ఉన్నానంటూ అందులో చెప్పుకొచ్చాడు. 'నేను 8 నుంచి 11 పెళ్లిళ్లు చేసుకున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. మా మామలు, అతనితో పాటు మరో వ్యక్తి నన్ను పలు కంపెనీలు పెట్టి జనాల్ని మోసం చేయమన్నారు. నేను దానికి ఒప్పుకోకపోయేసరికి ఇద్దరు అమ్మాయిలతో నా పై ఇలాంటి కేసులు పెట్టమని చెప్పారు. నాకు ఇన్ని పెళ్లిళ్లు జరిగి ఉంటే వారిని రుజువు చేయమనండి. నేను వారి వద్ద రూ. 60 లక్షలు తీసుకుంటే ఆధారాలు బయటపెట్టమనండి. నేను ఒకే పెళ్లి చేసుకున్నా. కాక పోతే తనతో నాకు విభేదాలు రావడంతో మేం వేరుగా ఉంటున్నాం. ఇంకా విడాకులు తీసుకోలేదు. ప్రస్తుతం నేను మరో మహిళతో సహజీవనం చేస్తున్నా' అని శివశంకర్ ఆ వీడియోలో ఆరోపించారు.

 
పోలీసులు ఏమంటున్నారు?
పోలీసులు అధికారికంగా ఈ కేసు గురించి చెప్పడం లేదు కానీ విచారణ జరుగుతోంది అని అంటున్నారు. శివశంకర్ మీద ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి కనుక ఆ మహిళల వివరాలు కూడా సేకరిస్తున్నామని వారు చెబుతున్నారు.