గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 1 జులై 2023 (21:09 IST)

‘మా నాన్న పుట్టింటికి తీసుకెళ్లి నాపై అత్యాచారం చేసేవాడు’, భర్త సాయంతో తండ్రిపై ఫిర్యాదు చేసిన వివాహిత

rape
‘పెళ్లయ్యాక నా భార్యను తీసుకెళ్లేందుకు అత్తమామలు వస్తే, నా భార్య భయపడేది. పుట్టింటికి వెళ్లడానికి నిరాకరించేది, వాళ్ల ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత నాతో గొడవపడేది. ఎందుకు నన్ను అక్కడికి పంపించావంటూ ప్రశ్నించేది’. ‘కొన్నిరోజుల క్రితం మా మామగారు ఒక రోజు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు. నా భార్యను తనతో తీసుకెళ్లాలనుకున్నారాయన. కానీ, ఆమె పుట్టింటికి రానని చెప్పింది. దీంతో తండ్రీకూతుళ్ల మధ్య పెద్ద గొడవ జరిగింది. నేను నచ్చచెప్పడానికి ప్రయత్నించిన తర్వాత ఆమె అసలు విషయం చెప్పింది. తండ్రి తనపై అత్యాచారం చేసేవాడని చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని అహ్మదాబాద్‌లోని గోమ్తీపూర్‌లో నివసిస్తున్న ఓ భర్త తన భార్యకు అండగా నిలుస్తూ చెప్పిన మాటలివి.
 
వీరికి రెండేళ్ల క్రితం అహ్మదాబాద్‌లోని జుహాపురాలో వివాహం జరిగింది. వారి వైవాహిక జీవితం సజావుగానే సాగింది. అయితే, పెళ్లికి ముందు తన తండ్రి తనపై పదేపదే అత్యాచారం చేసేవాడని.. ఇప్పటికీ తనను పుట్టింటికి తీసుకెళ్లడానికి అదే కారణమని భార్య ఆరోపించింది. సొంత తండ్రే తనపై అత్యాచారానికి పాల్పడినట్లు వేజల్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె తన భర్త సహకారంతో ఫిర్యాదు చేశారు. ఆధారాలను సేకరించిన పోలీసులు బాధితురాలి తండ్రిని అరెస్టు చేశారు.
 
"నేను ఇంగ్లిష్ మీడియంలో చదివాను. 11వ తరగతిలో సైన్స్ చదివి, కంప్యూటర్ ఇంజినీర్ కావాలనుకున్నాను. కానీ మా నాన్న ఆర్థిక పరిస్థితి బాగులేదని నిరాకరించారు" అని బాధిత మహిళ బీబీసీతో చెప్పారు. "ఒకసారి మా అమ్మ, చెల్లి, మా అక్క వేసవి సెలవులకు రాజస్తాన్ వెళ్లారు. నేను మా నాన్నతో పాటు ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. అతను ఆ రాత్రి నాపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే ఇంట్లో నుంచి గెంటేస్తానని బెదిరించారు, నా చెల్లెలిపై కూడా అత్యాచారం చేస్తానని బెదిరించారు. నేను భయపడ్డాను. అది అతనికి ధైర్యానిచ్చింది, మా అమ్మ కుట్టుపనికి, మా సోదరి పాఠశాలకు వెళ్లినప్పుడు ఆయన నాపై అత్యాచారం చేసేవాడు. ఒకసారి నా ఆరోగ్యం క్షీణించడంతో ఆయకు తెలిసిన డాక్టర్ నుంచి మందులు తీసుకొచ్చాడు. రాత్రి ఆ మెడిసిన్ వేసుకోవాలని బలవంతం చేశాడు. నేను పడుకున్న తర్వాత మళ్లీ అత్యాచారం చేశాడు" అని బాధితురాలు చెప్పింది.
 
పెళ్లయినా వదల్లేదు
"ఇంతలో నాకు పెళ్లయింది. కానీ మా నాన్న నన్ను వదల్లేదు. తరచుగా మా అత్తగారింటికి వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్లేవాడు. నా భర్త మంచివాడు కాబట్టి నన్ను ఇంటికి పంపేవాడు. మళ్లీ మా నాన్న అదేవిధంగా చేసేవాడు. నా భర్తకు తెలిస్తే నాకు విడాకులిస్తాడేమోనని భయపడ్డాను. కానీ ఒక రోజు నాన్న అన్ని హద్దులు దాటేశాడు. ఒకసారి మా అత్తగారింటికి వచ్చాడాయన. అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. తనతో శారీరకంగా కలవాలని బలవంతం చేశాడు. నేను ఒప్పుకోకపోతే కొట్టడం మొదలుపెట్టారు. ఇంటి తలుపు లోపల నుంచి గడియ వేసి ఉంది. నా అరుపులు విని ఇరుగుపొరుగు వారు నా భర్త సోదరిని పిలిచారు. తను ఇంటికి రాగానే ఆయన వెళ్లిపోయాడు" అని తెలిపారు. అయితే తన భర్తకు ఇవన్నీ చెప్పినప్పటికీ ఆయన గతాన్ని పట్టించుకోకుండా తనతో కొత్త జీవితాన్ని ప్రారంభించారని బాధితురాలు చెప్పారు.
 
మా అక్క ఇంటికి వెళ్లడంతో..
"పెళ్లి తరువాత నా భార్యను ఆమె తండ్రి తరచూ పుట్టింటికి రావాలని పిలిచేవారు. కానీ నా భార్య వెళ్లడానికి నిరాకరించేది. నన్ను కూడా రమ్మనేది.. నేను వెళ్లకపోతే తాను కూడా వెళ్లననేది. ఆ తండ్రి కుమార్తెపై ప్రేమతో తరచూ తీసుకెళ్లడానికి వస్తున్నారనే అనుకున్నాను. అందుకే నేనేం అభ్యంతరం పెట్టేవాడిని కాదు. మేం, మా మామగారు ఒకే నగరంలో ఉంటుండడంతో తరచూ ఆయన కుమార్తె కోసం వచ్చేవారు’ అని బాధితురాలి భర్త బీబీసీతో చెప్పారు.
 
''అయితే పుట్టింటికి వెళ్లిన తర్వాత నా భార్య అర్ధ రాత్రి ఏడుస్తూ ఫోన్ చేసేది. వచ్చి తనను తీసుకెళ్లాలంటూ బతిమాలేది" అని గుర్తుచేసుకున్నారు భర్త. ''ఓ సారి మా మామ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇంట్లో తండ్రీకూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. అదే సమయంలో మా అక్క ఇంటికి వచ్చింది. మామ ఆమెను చూడగానే వెళ్లిపోయారు. నా భార్య చాలా ఏడుస్తోంది. మా సోదరి తనతో మాట్లాడటానికి ప్రయత్నించింది, చివరికి తన తండ్రి తనపై పదేపదే అత్యాచారం చేసేవాడని చెప్పింది. పెళ్లి తర్వాత కూడా ఆమెను తండ్రి ఇంటికి తీసుకువెళ్లి అదే విధంగా చేసేవాడంది." అని భర్త అన్నారు
 
"మా సోదరి, భార్య ఇద్దరూ నాతో విషయం చెప్పినపుడు, ఆమె ఇంటికి వెళ్లకపోవడానికి గల కారణం నాకు అర్థమైంది. నేను మా అత్తమామలను ఇంటికి రానివ్వలేదు. దీంతో వారు నాతో గొడవపడ్డారు. సమాజంలో పరువు తీశారని నాపై ఆరోపణలు చేశారు. చివరకు తండ్రి వేధింపుల నుంచి తనను రక్షించాలని నా భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది'' అని వివరించారు భర్త.
 
తండ్రిని అరెస్టు చేశారా? లేదా?
"22 ఏళ్ల అమ్మాయి తన భర్తతో కలిసి వచ్చింది. ఆమె తన తండ్రిపై అత్యాచారం ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. పెళ్లికి ముందు, తరువాత తండ్రి వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు" అని బీబీసీతో వేజల్‌పూర్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.బి. రజ్వీ తెలిపారు. ''ఇక్కడ జుహాపురాలోని ఒక ఫ్లాట్‌లో నివసిస్తూ చిన్న వ్యాపారం చేస్తున్న నిందితుడు తన కుమార్తెపై పదేపదే అత్యాచారం చేశారనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అత్యాచారం అనంతరం బాధితురాలికి మెడిసిన్ ఇచ్చిన వైద్యుడు చెప్పిన వివరాలు, మరికొన్ని ఆధారాలతో ఆమె తండ్రిని అరెస్ట్ చేశాం'' అని అన్నారు ఇన్‌స్పెక్టర్ కె.బి. రజ్వీ.
(ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి స్పందనకు బీబీసీ ప్రయత్నించింది, కానీ, సాధ్యం కాలేదు.)
 
కన్న తండ్రే అలా ఎలా
కూతురిపై అత్యాచారం చేసే తండ్రి మనస్తత్వం గురించి సైకియాట్రిస్ట్ డా. ఎం.ఎన్. యాదవ్ బీబీసీతో మాట్లాడారు. "దీని వెనుక ప్రధాన కారణం ఏంటంటే, ఐదుగురు పిల్లలు పుట్టిన తర్వాత, భార్యతో మానసిక అనుబంధం తగ్గితే లేదా భార్య తన లైంగిక కోరికలను తీర్చకపోతే అమ్మాయి మొదటి బాధితురాలు అవుతుంది. అలాంటి లైంగిక వాంఛ గల వ్యక్తులు బలహీనంగా ఉంటారు, వ్యతిరేకతను తట్టుకోలేరు" అని సైకియాట్రిస్ట్ యాదవ్ తెలిపారు.
‘‘బాలిక చదువు ఆగిపోవడంతో తండ్రిపైనే ఆధారపడి ఉంది. ఆమె నిస్సహాయతను ఆసరాగా చేసుకున్న తండ్రి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
భర్త మద్దతు దొరికిన తరువాత తండ్రి దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి ఆమెకు ధైర్యం వచ్చింది. భర్త మద్దతు లభించకపోతే తండ్రి దౌర్జన్యాన్ని భరించడం తప్ప ఆమెకు వేరే మార్గం లేకపోయేది'' అన్నారు సైకియాట్రిస్ట్ యాదవ్.