ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 10 ఆగస్టు 2022 (16:20 IST)

సానియా ఖాన్: విడాకుల గురించి టిక్‌టాక్‌లో చెప్పినందుకు భార్యను హత్య చేసిన భర్త

Sania Khan
వైవాహిక జీవితంలో ఇబ్బందుల కారణంగా విడాకులు కోరగానే, తానేదో తప్పు చేసినట్లు, జీవితంలోనే విఫలమైనట్లు బంధువులు రకరకాల వ్యాఖ్యలు చేశారని సానియా ఖాన్ అన్నారు. అయితే, ఆమె మాజీ భర్త ఆమెను హత్య చేసేనాటి వరకు టిక్‌టాక్ యూజర్లలో ఎందరో అపరిచితులు, మిత్రులు ఆమె నిర్ణయానికి మద్ధతుగా నిలిచారు. 
హెచ్చరిక: ఈ కథనంలోని అంశాలు హృదయాన్ని కలచి వేయవచ్చు.

 
అది జులై 21, షికాగో నగరం. ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సానియా ఖాన్ తన లగేజ్ సర్దుకుని సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి తన తల్లిదండ్రులు నివసించే నగరమైన టెన్నెస్సీ రాష్ట్రంలోని చట్టనూగా వెళ్లిపోయి స్వేచ్ఛగా జీవించాలన్నది ఆమె ఆలోచన. కానీ, ఆమె టెన్నెస్సీ రాష్ట్రానికి చేరుకున్నారు. కానీ, ఒక శవపేటికలో వచ్చారు. అంతకు మూడు రోజుల ముందు, సానియా ఖాన్, షికాగోలో తన భర్త రహీల్ అహ్మద్‌తో కలిసి ఉన్న అపార్ట్‌మెంట్ ఫ్రంట్ డోర్ ముందు నిర్జీవంగా పడి ఉన్నారు. ఆమె తలపై తుపాకీ తూటా గాయం కనిపిస్తోంది. సంఘటనా స్థలంలోనే ఆమె మరణించారని పోలీసులు ధృవీకరించారు. పోలీసులు వచ్చేలోగానే ఆమె భర్త అహ్మద్ తన భార్యను కాల్చిన గన్‌తో తనను కూడా కాల్చుకుని చనిపోయారు.

 
షికాగోకు చెందిన పత్రిక సన్-టైమ్స్‌కు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, రహీల్ అహ్మద్, సానియా ఖాన్‌లు విడాకులు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆమెతో విడిపోయాక రహీల్ అహ్మద్ మరో రాష్ట్రంలో నివసిస్తున్నారు. ఆమెను హత్య చేసి తాను చనిపోవడానికి అహ్మద్ అక్కడికి సుమారు 1100 కి.మీ. ల దూరం నుంచి షికాగోలోని తన పాత ఇంటికి వచ్చారు. ఈ ఘోరమైన హత్య, ఆత్మహత్య ఘటనలు ఈ పాకిస్తానీ అమెరికన్ యువ ఫొటోగ్రాఫర్ సానియా ఖాన్ జీవితంలో విషాదకరమైన చివరి అధ్యాయం. ఆమె ఇటీవలే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ ద్వారా దక్షిణాసియా కమ్యూనిటీకి చెందిన వారి వివాహాలలో సమస్యలు, విడాకుల కోసం పోరాడుతున్న మహిళల కోసం ఆమె గళం విప్పారు.

 
సానియా ఖాన్ మరణం ఆమె స్నేహితులను షాక్‌కు గురి చేసింది. అంతేకాదు, వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యల కారణంగా ఇబ్బందులు పడుతున్న వందలమంది ఆమె టిక్ టాక్ ఫాలోయర్లకు కూడా ఈ హత్య వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. ''తనకు 29 సంవత్సరాలు వస్తున్నాయని, కొత్త జీవితం మొదలుపెడతానని ఆమె నాకు చెప్పింది. తానెంతో ఉద్వేగంగా ఉంది'' అని సానియా ఖాన్ యూనివర్సిటీ ఫ్రెండ్ బ్రిఅన్నా విలియమ్స్ అన్నారు. ఆమె ఎప్పుడూ పాజిటివ్ మైండ్‌తో ఉంటారని, చలాకీగా, ఉత్సాహంగా కనిపిస్తారని ఆమె స్నేహితులు పలువురు చెప్పారు. ''ఎప్పుడూ ఇతరులకు సాయం చేయడంలో ముందుంటుంది. తాను తీవ్రమైన సమస్యల్లో ఉన్నప్పుడు కూడా నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నావ్ అని అడిగేది'' అని సానియా ఖాన్‌కు బెస్ట్ ఫ్రెండ్‌నని చెప్పుకున్న మెహ్రూ షేక్ చెప్పారు.

 
ముందుగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలోకి ప్రవేశంచిన సానియా ఖాన్ ఫొటోగ్రఫీపై తనకు ఆసక్తిని ప్రకటించుకున్నారు. పెళ్లిళ్లు, మెటర్నిటీ షూట్లు, బేబీ షవర్‌ లాంటి కార్యక్రమాలకు ఆమె ఫొటో‌గ్రాఫర్‌గా వ్యవహరించేవారు. కెమెరా ముందు తమ ఎమోషన్లు పంచుకునేందుకు సానియా ఖాన్ వారికి అవకాశం కల్పించేవారని ఆమె స్నేహితులు చెప్పారు. అయిదు సంవత్సరాలపాటు అహ్మద్‌తో డేటింగ్ చేసిన సానియా ఖాన్, 2021లో వివాహమాడారు. తర్వాత వారు షికాగోకు మకాం మార్చారు. ''వాళ్లిద్దరి పెళ్లి పాకిస్తానీ స్టైల్లో వైభవంగా జరిగింది. అయితే, ఆ వివాహం అబద్ధాలు, అపోహలు అనే పునాదుల మీద జరిగింది'' అని సానియా ఖాన్ చిన్ననాటి స్నేహితురాలు ఒకరు చెప్పారు.

 
అహ్మద్‌కు మానసిక సమస్యలు ఉన్నాయని, పెళ్లికి ముందు వారు ఎక్కువకాలం కలిసి ఉండి, ఒకరినొకరు చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉందని ఆమె అన్నారు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని, అహ్మద్ మానసిక స్థితి సరిగా లేదని గత ఏడాది డిసెంబర్‌లో సానియా ఖాన్ తనకు చెప్పినట్లు ఆమె స్నేహితురాలు వెల్లడించారు. అయితే, అహ్మద్ మానసిక ఆరోగ్యం గురించి అతని కుటుంబ సభ్యుల ద్వారా బీబీసీ ధృవీకరించుకోలేకపోయింది. కథనం తెలిసిన తర్వాత వారు సానియా ఖాన్ స్నేహితుల ద్వారా ఈ ఆరోపణలను ఖండించారు.

 
ఒత్తిళ్లతో హత్యలు, ఆత్మహత్యలు
అమెరికాలో ప్రతివారం దాదాపు డజను హత్యలు-ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వీటిలో మూడింట రెండు వంతుల హత్యలు భాగస్వాముల మధ్య వివాదాల కారణంగా జరుగుతున్నాయని అమెరికా వయోలెన్స్ పాలసీ సెంటర్ వెల్లడించింది. మానసిక సమస్యలు, వైవాహిక సంబంధాలలో సమస్యలే ఎక్కువగా ఈ హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని తేలింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా హింసను ఎదుర్కొంటున్నారు. వివాహ బంధాలను తెంచుకున్న సమయంలో మహిళలు ఎక్కువగా హత్యకు గురవుతున్నారని డొమెస్టిక్ వయోలెన్స్ అంశంపై కృషి చేస్తున్న వారు చెబుతున్నారు.

 
డిసెంబర్‌లో జరిగిన ఘటనల తర్వాత, అప్పటి వరకు రహస్యంగా ఉన్న తన వైవాహిక జీవితంలో సమస్యలను ఆమె టిక్‌టాక్ ద్వారా బహిర్గతం చేయడం ప్రారంభించారు సానియా ఖాన్. తమ సంసారం జీవితంలో సమస్యలను స్నేహితులతో పంచుకున్నారు. తన భర్త రాత్రి పూట సరిగా నిద్రపోయేవాడు కాదని, విచిత్రంగా ప్రవర్తించేవాడని, మానసిక నిపుణులను కలవమని తాను ఎంత చెప్పినా వినేవాడు కాదని ఆమె చెప్పుకున్నారు. కొందరు స్నేహితులు ఆమెను వైవాహిక జీవితం నుంచి బయటకు రావాలని సూచించగా, మరికొందరు మాత్రం ఈ రిలేషన్‌షిప్‌ను ఎలాగోలా కొనసాగించాలని అన్నారు.

 
ఈ ఏడాది మే నెలలో తనను కలిసినప్పుడు తన బాధలు చెప్పుకుని సానియా ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నారని ఆమె స్నేహితురాలు విలియమ్స్ వెల్లడించారు. ''విడాకులు తీసుకోవడమన్నది చాలా అవమానకరమైందని, తాను ఒంటరితనాన్ని ఫీలవుతున్నానని ఆమె చెప్పింది. పదిమంది ఏమనుకుంటారు అన్న బాధ ఆమెను బాగా కుంగదీసింది'' అని విలియమ్స్ వెల్లడించారు. ''మిగతా ప్రపంచం మన గురించి ఏమనుకుంటుందో అని బాధితుల కుటుంబాలపై ఒత్తిడి ఉంటుంది'' అని అప్నాఘర్ అనే సంస్థను నడుపుతున్న నేహా గిల్ అన్నారు. షికాగో కేంద్రం సామాజిక సమస్యలు, ముఖ్యంగా దక్షిణాసియా కమ్యూనిటీలలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ సంస్థ పని చేస్తుంది.

 
''దక్షిణాసియా కమ్యూనిటీలలో మహిళలపై సాంస్కృతిక ఒత్తిడి, అణచివేత ఉంటుంది. ఇవి వ్యక్తి భద్రత, ఆరోగ్యాలకన్నా కుటుంబం, కమ్యూనిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి'' అన్నారామె. చివరకు స్నేహితుల సూచనలు, సహకారంతో సానియా ఖాన్ విడాకులకు దరఖాస్తు చేశారు. ఆ తర్వాత తాను విడాకులు తీసుకోవడానికి గల కారణాలను, తనకు ఎదురైన అనుభవాలను ఆమె టిక్ టాక్ ద్వారా పంచుకున్నారు. ''దక్షిణాసియా కమ్యూనిటీలలో విడాకులు తీసుకోవడం అంటే స్త్రీలు తాము జీవితంలో ఫెయినట్లు ఫీలవుతారు'' అని ఆమె అన్నారు.

 
''విడాకులు తీసుకోవడం ద్వారా నువ్వు సైతాన్‌ను గెలిపిస్తున్నావని, నువ్వు వేశ్యలాగా డ్రెస్ చేసుకుంటున్నావని మా కుటుంబ సభ్యులు తిట్టారు. నువ్వు తిరిగి మా ఊరు వస్తే మేమంతా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు'' అని సానియా ఖాన్ తన టిక్‌టాక్ వీడియో పోస్టుల్లో వెల్లడించారు. ఈ వీడియో పోస్టుల తర్వాత సానియా ఖాన్ ఈ ప్లాట్‌ఫామ్‌పై వైరల్ అయ్యారని ఆమె స్నేహితురాలు నేటి వెల్లడించారు. ''నా ఫోన్ ఆమె వీడియోలతో నిండిపోయింది. నేను చేయాలనుకున్నది చేస్తున్నానని ఆమె చెప్పింది. తన వైవాహిక జీవితం గురించి, అలాంటి బాధకరమైన బంధాల నుంచి బయటకు వచ్చే వారికి తాను సాయం చేస్తాననని ఆమె చెప్పేది'' అని నేటీ వివరించారు.

 
తాను చేస్తున్న ప్రతి పోస్టుకు ఆమెలో ఉత్సాహం మరింత పెరిగేదని, తనకు బెదిరింపులు వచ్చినా ఆమె వెనక్కి తగ్గేది కాదని నేటీ వెల్లడించారు. సానియా ఖాన్ మరణించే నాటికి ఆమెకు టిక్‌టాక్‌లో 20వేలమంది ఫాలోయర్లు ఉన్నారు. ''ఆమె మొదటి వీడియో చూసిన వెంటనే నేను ఆమె కోసం ప్రార్ధించాను'' అని పాకిస్తానీ మూలాలున్న అమెరికన్ బిస్మా పర్వేజ్ అన్నారు. ''ఇలాంటి సమయాల్లో మహిళలు సహనంతో ఉండాలని అంటుంటారు. కానీ, కొన్నిచోట్ల సహనం పని చేయదు'' అని ఆమె అన్నారు. సానియా ఖాన్ హత్య తర్వాత ఆమెకు సంతాపాలు వెల్లువెత్తాయి. ఆమె చదువుకున్న స్కూల్ ఆమె పేరిట ఒక మెమోరియల్ స్కాలర్‌షిప్‌ను ఏర్పాటు చేసింది. ''మహిళల రక్షణ గురించి మనం పదేపదే హెచ్చరిస్తుంటాం. కానీ, అదే సమయంలో మనం మన కొడుకులకు మహిళలను గౌరవించాల్సిన అవసరాన్ని నేర్పాలి. అది మన ఇంటి నుంచి ప్రారంభమైనప్పుడే మార్పు మొదలువుతుంది'' అన్నారు బిస్మా పర్వేజ్.