గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:43 IST)

విశాఖలో టీ20, హైదరాబాద్‌కు దక్కని అవకాశం - ప్రెస్‌రివ్యూ

వచ్చే ఎనిమిది నెలల్లో స్వదేశంలో టీమ్‌ఇండియా ఆడే అంతర్జాతీయ సిరీస్‌లకు సోమవారం బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్ర వేసిందని, అందులో భాగంగా ఓ టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని విశాఖపట్నం దక్కించుకుందని ఈనాడు తన కథనంలో తెలిపింది.

 
‘‘వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న వెస్టిండీస్‌తో రెండో టీ20 విశాఖలో జరుగుతుంది. హైదరాబాద్‌కు మాత్రం నిరాశే మిగిలింది. ఉప్పల్‌ స్టేడియానికి అవకాశం దక్కలేదు. భవిష్యత్‌ ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది నవంబర్‌ నుంచి 2022 జూన్‌ మధ్యలో సొంతగడ్డపై భారత్‌ 14 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు కలిపి మొత్తం 21 మ్యాచ్‌లు ఆడనుంది.

 
కానీ అందులో ఒక్క మ్యాచ్‌కూ హైదరాబాద్‌ వేదిక కాదు. అందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లోని అంతర్గత కుమ్ములాటలే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు వర్గాలుగా చీలిపోయిన హెచ్‌సీఏ పాలకవర్గం విభేదాలతో ఇప్పటికే హైదరాబాద్‌ అబాసుపాలైంది. ఈ ఏడాది ఐపీఎల్‌ 14వ సీజన్‌ మ్యాచ్‌ల వేదికల్లోనూ హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. ఇక ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌ల విషయంలోనూ నిరాశ తప్పలేదు.

 
ఇక టెస్టులకు కాన్పూర్‌, ముంబయి, బెంగళూరు, మొహాలీ.. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు జైపుర్‌, రాంచి, లఖ్‌నవూ, విశాఖ, కోల్‌కతా, అహ్మదాబాద్‌, కటక్‌, త్రివేండ్రం, చెన్నై, రాజ్‌కోట్‌, దిల్లీ ఆతిథ్యమిస్తాయి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో.. పొట్టి ఫార్మాట్‌పైనే బీసీసీఐ ఎక్కువగా దృష్టి పెట్టింద’’ని ఆ కథనంలో రాశారు.

 
టీమ్‌ఇండియా షెడ్యూల్
న్యూజిలాండ్‌తో మూడు టీ20లు (నవంబరు 17, 19, 21వ తేదీల్లో), రెండు టెస్టులు (నవంబరు 25-29, డిసెంబరు 3-7)
 
వెస్టిండీస్‌తో మూడు వన్డేలు (ఫిబ్రవరి 6, 9, 12), మూడు టీ20లు (ఫిబ్రవరి 15, 18, 21)
 
శ్రీలంకతో రెండు టెస్టులు (ఫిబ్రవరి 25-మార్చి1, మార్చి 5-9), మూడు టీ20లు (మార్చి 13, 15, 18)
 
దక్షిణాఫ్రికాతో అయిదు టీ20లు (జూన్‌ 9, 12, 14, 17, 19)
 
మధ్యలో డిసెంబర్‌ నుంచి జనవరి వరకూ దక్షిణాఫ్రికాలో టీమ్‌ఇండియా పర్యటిస్తుంది. ఏప్రిల్‌ నుంచి మే వరకు ఐపీఎల్‌ 15వ సీజన్‌ జరిగే అవకాశాలున్నాయి.