గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (21:02 IST)

''నేను వినాయకుడి విగ్రహాన్ని ముట్టుకుంటే మైల పడుతుందని దూషించారు'' - ఉండవల్లి శ్రీదేవి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో వివాదానికి కేంద్రమైంది. ఈసారి దళిత శాసనసభ్యురాలి పట్ల కుల వివక్ష ప్రదర్శించారనే ఆరోపణలు కలకలం రేపాయి. తుళ్లూరు మండలం అనంతవరంలో సోమవారం జరిగిన ఈ ఘటన మీద ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.

 
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు సోమవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తన నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. మార్గంలో తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపం వద్ద ఆమెను కొందరు ఆపారు. దాంతో తన వాహనం దిగి పూజ చేసేందుకు ఆమె మండపం చేరుకున్నారు. ఆ సందర్భంగా జరిగిన వివాదం ఇప్పుడు దుమారం రేపుతోంది. సోమవారం జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు బీబీసీ అనంతవరం వెళ్ళింది. వివాదం జరిగిన వినాయక మండపం దగ్గర కొందరు నిర్వాహకులు ఉన్నారు. 

 
మద్యం మత్తులో కొందరు...
వారిలో అయ్యేశ్వరరావు బీబీసీతో మాట్లాడుతూ.. ''ఎమ్మెల్యే గారు మా ఊరు వస్తున్నారని తెలిసి ఆమెని ఆపి, వినాయకుడి విగ్రహం వద్దకు పిలిచాం. వచ్చి పూజ చేశారు. ప్రసాదం కూడా తీసుకున్నారు’’ అని చెప్పారు. ‘‘ఈలోగా కొందరు మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దాంతో ఆమె అనుచరులు కూడా ప్రతిఘటించడంతో మాటామాటా పెరిగింది. కొందరు నోటికొచ్చింది అనడంతో వివాదమైంది'' అంటూ చెప్పుకొచ్చారు. ఈ వివాదంతో తామంతా బాధపడుతున్నామని తెలిపారు.

 
నిరసనలు.. పోలీస్ బందోబస్తు ఏర్పాటు..
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ వివాదం జరిగింది. పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం గ్రామంలో 20 మంది ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసు అధికారులు చెప్తున్నారు. మరోవైపు.. ఎమ్మెల్యే శ్రీదేవికి మద్దతుగా పలు చోట్ల ప్రదర్శనలు చేపట్టారు. వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో తుళ్ళూరులో ప్రదర్శన నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్‌సీ సంఘాల నేత రమేష్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవికి తామంతా అండగా ఉంటామని తెలిపారు.

 
''టీడీపీ నేతలే కారణం...''
అనంతవరంలో జరిగిన ఘటన పట్ల ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె బీబీసీతో మాట్లాడుతూ ''రాజధానిలో కుల వివక్ష దారుణం. సామాజిక వర్గం పేరుతో నన్ను మానసికంగా వేధించారు. వినాయకున్ని ముట్టుకుంటే మైల పడుతుందని ఒక సామాజిక వర్గం నేతలు నన్ను దూషించారు'' అని చెప్పారు.

 
''రాజధానిలో జరుగుతున్న అవినీతిని వెలికి తీసినందుకే నన్ను మానసికంగా వేధిస్తున్నారు. చెప్పరాని మాటలతో టీడీపీ నేతలు నన్ను దూషిస్తున్నారు. నా గెలుపును టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. రాజధానిలో వైఎస్సార్సీపీని ఓడించాలని టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు కూడా పాల్పడ్డారు. అయినా గెలవడంతో సహించలేక ఇలా దిగజారుతున్నారు'' అని ఆమె ఆరోపించారు.

 
రాజకీయాలతో ముడిపెట్టడం తగదు: టీడీపీ
అనంతవరం ఘటనను రాజకీయాలతో ముడిపెట్టడం తగదని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవ‌ర‌ప్ర‌సాద్ వ్యాఖ్యానించారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘సామాజిక కారణాలతో సంఘటన జరిగింది. దాన్ని అందరం ఖండించాం. రాజకీయాలతో ముడి పెట్టవద్దు’’ అని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని ఆశిస్తున్నాం. అందరం కలిసి సాగాలి. రాజకీయాలతో ముడిపెట్టి విషయం పక్కదారి పట్టించడం తగదు’’ అని చెప్పారు.

 
ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశాం: గుంటూరు రూరల్ ఏఎస్‌పీ
ఎమ్మెల్యే శ్రీదేవి పట్ల కుల వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన కేసులో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు రూరల్ ఏఎస్‌పీ జయలక్ష్మి బీబీసీకి తెలిపారు. ''కేసులో ప్రధాన నిందితుడు కె.శివయ్యని అరెస్ట్ చేశాం. మరో నిందితుడు ఏ2 రామకృష్ణని కూడా అరెస్ట్ చేస్తాం. ఏ3 మైనర్ కాగా ఏ4గా ఉన్న నిందితురాలు శివయ్య భార్య. కేసుని సీరియస్‌గా తీసుకున్నాం. నిందితులపై చట్టపరమైన చర్యలు చేపడతాం'' అని వివరించారు.